27న విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు 

 
వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్ర ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం దారుణం

ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం

అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ

ప్రజాభాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

తాజా వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి

తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షులతో రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ గారి పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారంను విధించడం దుర్మార్గమని అన్నారు. 

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఏమన్నారంటే..

ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచము అని ప్రజలకు హామీ ఇచ్చి, నేడు అధికారంలోకి రాగానే ఏకంగా రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారంను విధించడం దారుణం. దీనిని వ్యతిరేకిస్తూ వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈనెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో విద్యుత్ కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించాలి. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ మెమోరాండంలను సమర్పించాలి. అన్ని నియోజకవర్గాల ఇన్ చార్జీలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో పార్టీ శ్రేణులతో సమావేశాలు జరిగాయి. అన్ని జిల్లాల్లోనూ వైయస్ఆర్ పోరుబాట పేరుతో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజల పక్షాన వైయస్ఆర్ సిపి చేపట్టిన ఈ నిరసనలపై ఇప్పటికే ప్రజల్లో ఆదరణ కనిపిస్తోంది. ప్రజాసమస్యలపై వైయస్ఆర్ సిపి బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోంది. విద్యుత్ చార్జీల పెంపుదల అన్ని వర్గాలపై ఆర్థికంగా భారంను మోపుతోంది. అయా వర్గాలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. వారంతా వైయస్ఆర్ సిపి తలపెట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఇటువంటి ప్రజాసంఘాలు, సంస్థలను కూడా కలుపుకుని నిరసన ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించాలి. ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ కార్యక్రమం ద్వారా పాలకులకు అర్థం కావాలి. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని, పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలి. 

    పార్టీ శ్రేణులు, గ్రామ, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొనాలి. ఇందుకోసం పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీలు ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించడం ద్వారానే ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం మరింత పెరుగుతుంది. ప్రజలకు వైయస్ఆర్‌సీపీ కష్ట సమయంలో అండగా ఉంది అనే సంకేతాలను పంపాలి. అలాగే తాజాగా వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి, ఇబ్బంది పడుతున్న రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు పార్టీ నేతలు రైతులను కలుసుకోవాలి. వారికి వచ్చిన కష్టంలో అండగా ఉంటామనే భరోసాను అందించాలి.

Back to Top