బాబు సంప‌ద సృష్టించ‌డం లేదు..దోచుకుంటున్నారు

మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు

ఆరు నెలల్లోనే రూ.65 వేల కోట్ల అప్పులు
 

అమరావతి పేరుతో రూ.31 వేల కోట్లు అదనం
మరో రూ.21 వేల కోట్ల అప్పులు సమీకరిస్తున్నారు

 

సంపద సృష్టిస్తామని ప్రజల్ని నమ్మించి వంచించిన సీఎం
 

:మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం

వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలిచ్చాం
 

ఏటా 4 లక్షల ఉద్యోగాలన్న కూటమి పెద్దలు మాట మర్చారు
 

వరుస పెట్టి నిర్దయగా అనేక ఉద్యోగాలు పీకేస్తున్నారు
 

ఆరు నెలలు గడిచినా నిరుద్యోగ భృతి ఊసే లేదు
 

విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని రూ.15 వేల కోట్లు మోపారు 
 

విద్యుత్‌ ఛార్జీలపై ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట
 

ప్రెస్‌మీట్‌లో అంబటి రాంబాబు వెల్లడి

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబు సంపద సృష్టించడం లేదు.. దోచుకుంటున్నారని,  ప్రభుత్వ రంగంలోకి సంస్థలను అమ్మేసి దండుకుంటున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఒకవైపు మండుతున్న సరుకుల ధరలు, మరోవైపు అన్నింటా బాదుడే బాదుడు.. చంద్రబాబు పాలనా వైఫల్యానికి నిదర్శనమని అంబటి అన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై మంగళవారం సాయంత్రం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆరు నెలల్లోనే రూ.15 వేల కోట్ల మోత:
– సూపర్‌ సిక్స్‌ హామీలు గ్యారెంటీగా అమలు చేస్తామని నమ్మించి, అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి, ప్రజలను దారుణంగా మోసగించింది. 
– అధికారంలోకి వస్తే సంపద çసృష్టిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు, ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేస్తున్నారు. ఐదేళ్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమన్న మాట కూడా తప్పిన చంద్రబాబు తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు.
– 25 నుంచి 55 శాతం విద్యుత్‌ ఛార్జీలు పెంచుతూ, ఆరు నెలల్లోనే ప్రజలపై రూ.15,485 కోట్ల భారం వేశారు. ఇప్పటికే నవంబరులో రూ.6 వేల కోట్ల భారం మోపిన ప్రభుత్వం, వచ్చే నెలలో మరో రూ.9,412 కోట్లు భారం మోపడానికి సిద్ధమైంది.
– స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే, వాటిని పగలగొట్టాలని రైతులను రెచ్చగొట్టిన చంద్రబాబు, అధికారంలోకి రాగానే అవే స్మార్ట్‌ మీటర్లు బిగించే పనికి తెర తీస్తున్నారు.
– కారు బయటకు తీస్తే టోలు కట్టాలన్నట్లు.. పంచాయతీ, జిల్లా, ఆర్‌ అండ్‌ బీ రోడ్లు అనే తేడా లేకుండా వినియోగదారులను బాదడానికి పీపీపీ మోడల్‌ తీసుకొచ్చారు. ఇది ఎవరికి దోచిపెట్టడానికి? ఇదేనా సంపద సృష్టించడం అంటే?. 

ఆదాయం లేకపోగా.. అప్పుల కుప్పగా రాష్ట్రం:
– సంపద సృష్టిస్తానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటే, ఆయన అనుకూల ఎల్లో మీడియా జోరుగా ప్రచారం చేసింది. వాటిని నిజమే అని నమ్మిన ప్రజలకు ఇప్పుడు టోల్‌ బాదుడు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. 
– గతంలోనూ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ రంగ సంస్థలను తనవారికి పప్పు బెల్లాలకు అమ్మేశాడు. తద్వారా తనకు సంపద సృష్టించుకున్నాడు. 
– మరోవైపు ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్‌లో రూ.65,590 కోట్లు అప్పులు చేశాడు. ఇవి కాకుండా బడ్జెటేతర అప్పులు మరో రూ.9 వేల కోట్లు.  అందులో పౌర సరఫరాల సంస్థ ద్వారా రూ.2 వేల కోట్లు, మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.6 వేల కోట్లు, ఏపీఐఐసీ ద్వారా రూ.1000 కోట్లు అప్పులు చేశారు.
– రాజధాని పేరుతో రూ.31 వేల కోట్లు, అమరావతికి మరో రూ.21 కోట్ల రుణం సమీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చంద్రబాబుకు సంపద సృష్టించడం చేతకాక, కేవలం అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితికి దిగజారిపోయాడు.

దారుణంగా పడిపోయిన ఆదాయం:
– చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయింది. అమ్మకం పన్ను గతేడాది ఇదే సమయంతో పోల్చితే రూ.1000 కోట్లు, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా మరో  రూ.1000 కోట్లు తగ్గింది.
– ఇంకా కేంద్ర గ్రాంట్లు రూ.12,510 కోట్లు తగ్గగా, రెవెన్యూ లోటు రూ.9,742 కోట్లకు పెరిగింది. ఇవన్నీ చూస్తుంటే.. ‘చంద్రబాబు చెప్పేవన్నీ గొప్పలు. చేసేవి మాత్రం అప్పులు’ అని అర్థమవుతుంది.

నిరుద్యోగ భృతి లేకపోగా ఉద్యోగాల కోత:
– ఏటా 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అవి ఇచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ హామీ నిలబెట్టుకోకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడపెరిగే పరిస్థితికొచ్చాడు. 
– ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌లో ఏకంగా 400 మంది ఉద్యోగులను తొలగించారు. మరో 200 మందిని తొలగిస్తామని చెబుతున్నారు. ఏవైనా అవకతవకలు జరిగాయనుకుంటే విచారణ చేసుకుని చర్యలు తీసుకోవాలి తప్పించి ఉద్యోగాలు తొలగించి వేధించే విధానం సరికాదు. 
– ఈ ఆరు నెలల్లోనే 2.60 లక్షల మంది వలంటీర్లను, స్పెషలిస్ట్‌ డాక్టర్లను, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులను, మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌ను, బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో 15 వేల మందిని.. వరుస పెట్టి తొలగించిన దౌర్బాగ్యస్థితి కనిపిస్తోంది.  
– వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల్లో చేరిన వారిని తొలగించే కక్ష సాధింపు చర్యలు ఏ మాత్రం సరికాదు.

ఐదేళ్లలో 30 లక్షల ఉద్యోగాలిచ్చాం:
– మా ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ సమస్య తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేశాం. ఏకంగా 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత వైయస్సార్‌సీపీ ప్రభుత్వానికి దక్కుతుందని గర్వంగా చెబుతాం.
– అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే, 2019, అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రామవార్డు సచివాలయాల్లో 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలిచ్చాం. 
– ఆ తర్వాత ఆర్టీసీలో 58 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. 2.60 లక్షల వాలంటీర్లను నియమించి పథకాలను డోర్‌ డెలివరీ చేశాం. వివిధ శాఖల్లో దాదాపు 6.31 లక్షల ఉద్యోగాలిచ్చాం. ఎంఎస్‌ఎంఈల ద్వారా సుమారు 3.94 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయి.  

చేతకాకే నిందలు:
– చంద్రబాబుకి పరిపాలన చేతకాక ప్రతిదానికీ గత ప్రభుత్వం అంటూ మాపై నిందలు మోపుతున్నారు. తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు మా నాయకుడు జగన్‌గారిపై నిందలు మోపడం సరికాదు. 
– పోలీస్‌ వ్యవస్థను అడ్డం పెట్టుకుని మా పార్టీని అణగదొక్కాలని చూస్తే బెదిరిపోయే పరిస్థితి ఉండదు. మరింత రాటుదేలతాం.. 
– విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ పిలుపు మేరకు ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని అంబటి రాంబాబు వివరించారు.

Back to Top