కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు

కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్  

అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం

మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు

2027 చివరిలో జమిలి ఎన్నికలు.. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే
 

వైయ‌స్ఆర్ జిల్లా : కష్టాలు అనేవి శాశ్వతం కావు. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడద‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. మనమందరం కలిసికట్టుగా పని చేయాలి. దేశ చరితలో ఏ ఒక్కరూ చేయని మంచి పనులు చేశామ‌న్నారు. ఎన్నికలకు ముందు అలవి గాని హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.  పులివెందుల పర్యటనలో భాగంగా.. కడప నేతలు, కార్పొరేటర్లతో తాజా పరిణామాలపై ఆయన చర్చించారు.

ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

ప్రజలకిచ్చిన మాట మీద నిలబడి, ప్రజల కష్టాలను నా కష్టాలుగా భావించి, ప్రజలకు మంచి చేశాం, ఈ రోజు కూడా ప్రతి ఇంటికీ మనం కాలర్‌ ఎగరవేసుకుని వెళ్ళగలుగుతాం, ప్రతి ఇంట్లో మనం చెప్పింది చేశామనే మాట ప్రజల నుంచి వినిపిస్తుంది, ప్రజలు సంతోషంగా మీరు చేశారంటున్నారు, అదే టీడీపీ నాయకులు ఎవరైనా ప్రజల దగ్గరకు వెళ్ళి ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన సూపర్‌ సిక్స్‌  చేశామని వెళ్ళగలుగుతారా, వాళ్ళు ప్రజల దగ్గరకు వెళ్ళాలంటే భయపడే పరిస్ధితి, ఏ ఇంటికి వెళ్లినా చిన్నపిల్లలతో సహా నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని వారి తల్లులైతే నీకు రూ.18 వేలు, ఆ అమ్మలకు తల్లులు, అత్తలు కనిపిస్తే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్లు దాటిన పిల్లవాడు ఇంట్లో కనిపిస్తే రూ.36 వేలు అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని ఇంట్లో ఎవరినీ వదిలిపెట్టకుండా ఆశపెట్టారు. వారంతా మా డబ్బులు ఏమయ్యాయని నిలదీస్తారు, ఏ టీడీపీ కార్యకర్త ఎవరి ఇంటికి వెళ్ళే పరిస్ధితి లేదు

జమిలి ఎన్నికలు 2027లో అంటున్నారు, నెలలు గడిచేకొద్ది చంద్రబాబులో భయం పెరిగిపోతుంది, మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నాం, మన ప్రభుత్వం మళ్ళీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో ఉన్నవారికి మంచిరోజులు వస్తాయి, ఇబ్బందులు కొంతకాలం ఉంటాయి, మనల్ని ప్రలోభాలకు గురిచేసినా కొంత ఓపిక పట్టండి, మీకు నా తమ్ముడు అవినాష్‌ అందుబాటులో ఉంటారు, మీకు ఏ అవసరం వచ్చినా తనను కలవండి, తప్పకుండా సాయం చేస్తారు, నేను కడప బిడ్డను కాబట్టే మీరంటే నాకు ప్రత్యేకమైన అనుబంధం, మీరందరి ప్రేమ ఎప్పటికీ మరిచిపోను

మనం ఇంత త్వరగా ప్రజల్లోకి వెళ్ళాల్సి వస్తుందనుకోలేదు, చంద్రబాబు బాదుడే బాదుడులాగా పాలన సాగిస్తున్నారు, సూపర్‌ సిక్స్‌ లేదు సూపర్‌ సెవెన్‌ లేదు, అందుకే మనం పోరుబాట పట్టాల్సి వస్తుంది, ఇప్పటికే రైతు ధర్నా చేశాం, ఈ నెల 27న కరెంట్‌ బిల్లులపై మరో నిరసన కార్యక్రమం, జనవరి 3న విద్యార్ధుల ఫీజురీఇంబర్స్‌మెంట్‌పై వారి తరుపున మరో కార్యక్రమం చేయాల్సి వస్తుంది. మీ అందరి సహాయ సహకారాలు కావాలి, మీరంతా నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను.

 

Back to Top