తాడేపల్లి:టీడీపీలో చేరి ఏడాది గడిచినా పదవి రాకపోవడంతో చంద్రబాబు ప్రాపకం సంపాదించడం కోసం మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ , వైయస్ జగన్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని వైయస్ఆర్‌సీపీ స్టేట్ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తల్లి విజయమ్మకు జగన్ అన్నం కూడా పెట్టలేదని డొక్కా స్థాయికి మించిన మాటలు మాట్లాడుతున్నాడని, ఆ విషయం విజయమ్మ తనకేమైనా ఫోన్ చేసి చెప్పారా అని ప్రశ్నించారు. అధికారం మారినప్పుడల్లా పార్టీలు మారే అలవాటున్న డొక్కా, వెన్నుపోట్లు గురించి మాట్లాడటం వింతగా ఉందని, అది కూడా వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో ఉండి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. డొక్కాను రాజకీయ వ్యభిచారి అని అనాలని ఉన్నా ఆయన వయసును చూసి గౌరవం ఇస్తున్నామని కనకారావు చెప్పారు. ఇకపై వైయస్ఆర్‌సీపీ గురించి మాట్లాడే ముందు ఆలోచించకుండా నోరు జారితే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. చంద్రబాబు ప్రాపకం కోసం డొక్కా ఆరాటం: – పదవుల ఆరాటంతో చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడుతూ టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్.. వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్, పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మెప్పుకోసం ఆయన చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే మంత్రిగా పనిచేసింది ఈ వ్యక్తేనా అని సందేహం కలుగుతోంది. – పొద్దు తిరుగుడు పువ్వు కన్నా దారుణంగా అధికార పార్టీల చుట్టూ డొక్కా తిరుగుతున్నాడు. పార్టీలు మారినప్పుడల్లా పదవుల కోసం ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా ఆయన వేషం, భాష మార్చేస్తున్నాడు. పార్టీలో చేరి ఏడాది అయినా పదవులేవీ రాకపోవడంతో చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి వైయస్ఆర్‌సీపీ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చంద్రబాబుకి కూడా డొక్కా వ్యవహారం తెలుసు కాబట్టే పక్కన పెట్టేశాడు. విజయమ్మ ఫోన్ చేసి చెప్పారా?: – జగన్ తన తల్లి విజయమ్మకి అన్నం పెట్టలేదని డొక్కా నోటికొచ్చి మాట్లాడుతున్నాడు. జగన్ నాకు అన్నం పెట్టలేదని విజయమ్మ గారు ఆయనకు ఫోన్ చేసి చెప్పుకున్నారా? లేదా ఆమె వచ్చినప్పుడు జగన్ ఇంట్లో డొక్కా ఉన్నారా? – ఆఖరుకి మాజీ మంత్రి శైలజానాథ్ వైయస్ఆర్‌సీపీలో చేరినా కూడా డొక్కా ఓర్వలేకపోతున్నాడు. వెన్నుపోటు దారుడి పార్టీలో చేరాడని అవాకులు చెవాకులు పేలుతున్నాడు. నిజానికి డొక్కాను మించిన వెన్నుపోటుదారుడు ఎవరూ ఉండరు. – దివంగత వైయస్ఆర్ ప్రాపకంతో 2004, 2009 ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి పొందిన డొక్కా మాణిక్య వరప్రసాద్, ఆ తర్వాత రాజకీయ జీవితం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశంలో చేరాడు. చంద్రబాబు నాయుడు ఆయన్ను ఎమ్మెల్సీని చేస్తే 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయాక చంద్రబాబుకి వెన్నుపోటు పొడిచి వైఎస్సార్సీపీలో చేరాడు. వైఎస్ జగన్ మళ్లీ ఎమ్మెల్సీని చేసి గౌరవిస్తే ఇక్కడ కూడా స్థిరంగా ఉండకుండా మళ్లీ తెలుగుదేశం పంచన చేరాడు. – ఉంటున్న పార్టీకి వెన్నుపోటు పొడిచి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరడం డొక్కాకు రివాజుగా మారింది. అలాంటి వ్యక్తి వెన్నుపోటు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. – దళిత కార్డును అడ్డం పెట్టుకుని ఏది మాట్లాడినా చెల్లుతుందనుకుంటే పొరపాటు. మా పార్టీ గురించి, వైయస్ఆర్‌సీపీ నాయకుల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. హామీలపై చంద్రబాబును ప్రశ్నించాలి – ఈ రాష్ట్రంలో దళితులకు న్యాయం జరిగింది అంటే, అది కేవలం వైయస్ఆర్‌సీపీ హయాంలోనే. వైఎస్ జగన్ 5 మంది దళితులకు మంత్రి పదవులు ఇచ్చారు. 15 మంది ఎస్సీలను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించారు. – వెన్నుపోటుకే బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు పార్టీలో ఉండి డొక్కా వెన్నుపోటు గురించి మాట్లాడటం హాస్యాస్పదం. – మొన్నటి ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. డొక్కాకి చేతనైతే దాని గురించి ప్రశ్నించాలని కొమ్మూరు కనకారావు చురకలంటించారు.