పోసానిపై పోలీసుల‌ది ఆర్గనైజ్డ్‌ క్రైమ్ 

వైయ‌స్ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ మ‌నోహ‌ర్‌రెడ్డి

గుంటూరు:  సినీ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి ప‌ట్ల పోలీసులు ఆర్గ‌నైజ్డ్ క్రైమ్ చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ మ‌నోహ‌ర్‌రెడ్డి ఆరోపించారు. గుంటూరు జైల్లో పోసాని కృష్ణమురళిని  వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ప‌రామ‌ర్శించారు.  అనంతరం మనోహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘2016లో నంది అవార్డుల కమిటీ ఏకపక్షంగా వ్య‌వ‌హ‌రించింద‌ని పోసాని మాట్లాడినందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆయనపై 12 కేసులు పెట్టారు. మీడియాతో మాట్లాడితే కేసులు పెడతారా?. మరోసారి ప్రెస్ మీట్ పెడితే మరో 6 కేసులు పెట్టారు. ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించి రాష్ట్రవ్యాప్తంగా పీటీ వారెంట్ల పేరుతో తిప్పి హింసిస్తోంది. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోసానిపై పెట్టిన నాలుగు కేసుల్లో 111 సెక్షన్లు పెట్టి బయటికి రానివ్వకుండా కుట్ర చేశారు. కూటమి ప్రభుత్వం పోసానిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఆయ‌న అనారోగ్యంతో ఉన్నారు’’  అని మనోహర్‌రెడ్డి తెలిపారు.

పోలీసుల తీరు మార‌డం లేదు..
‘‘కోర్టు పోలీసులకు చివాట్లు పెడుతున్న మారటం లేదు. రెడ్ బుక్కు టీడీపీకే కాదు. మాక్కూడా బుక్కులు ఉన్నాయి. మేము కూడా పేర్లు నమోదు చేసుకుంటున్నాం. ఇప్పటివరకు నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కేసులు పెడుతున్న 62 మందిని గుర్తించాం. చంద్రబాబు జైలుకెళ్లినప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని పిటిషన్ల మీద పిటిషన్ల వేశారు. అమ్మో ఇంకేముంది అని హడావుడి చేశారు. అందరివి చంద్రబాబు లాంటి ప్రాణాలే. పోలీసులు ఆర్గనైజర్ క్రైమ్ చేస్తున్నారు. కేసులు పెట్టి పోలీసులు వాటి సమాచారాన్ని దాచేస్తున్నారు. ఒక కేసులో బెయిల్ రాగానే మరొక కేసుని బయటికి తీస్తున్నారు’’ అంటూ మనోహర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. 
 

Back to Top