ఒంగోలు: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి లేదని వైయస్ఆర్‌సీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు మండిపడ్డారు. జనసేన ఆవిర్భావ సభలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైయస్ఆర్‌సీపీ నేతలు ఫైర్ అయ్యారు. వైయస్ఆర్‌సీపీ ఇచ్చిన అధికారంతో పదవి అనుభవించడమే కాకుండా.. కోవర్టు రాజకీయాలతో బాలినేని పార్టీని ఘోరంగా దెబ్బ తీశారని వైయస్ఆర్‌సీపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్ లో ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబుతో పాటు పలువురు సీనియర్ నాయకులు మీడియాతో మాట్లాడారు. బాలినేని వ్యాఖ్యలు ఖండిస్తున్నాం.. `జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాజీ సీఎం వైయస్ జగన్ పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రజలకు నిజాలను వివరించాల్సిన అవసరం మాపై ఉంది. తిరుమల వెంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నానని అబద్ధాలు మాట్లాడటం చూస్తుంటే ఆయనకు దేవుడి మీద భక్తి లేదని అర్థమవుతుంది. తన స్థాయి ఏంటో తెలుసుకోకుండా వైయస్ జగన్ ఎలా గెలుస్తాడో చూస్తానని బాలినేని అనడం, అసూయతో ఇతరుల పతనం కోరుకునే లక్షణాలను నిన్న పిఠాపురం అమ్మవారి సాక్షిగా బయటపెట్టుకున్నారు. కలిసి తిరిగిన వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడటం అనే మొహమాటం కొద్దీ ఇన్నాళ్లూ ఆయన్ను వదిలేస్తే, వైయస్ఆర్‌సీపీ గురించి, వైయస్ జగన్ గురించి రోజురోజుకీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వైవీ సుబ్బారెడ్డి లేకుండా వైయస్ఆర్ ఆయనకు ఎలా బంధువయ్యాడో బాలినేని చెప్పాలి. చెల్లిని ఇచ్చిన పాపానికి వైవీ సుబ్బారెడ్డి తమ కుటుంబానికి వచ్చిన అవకాశాలను కూడా వదులుకుని బాలినేనికి ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంతగా ప్రయత్నించారో మర్చిపోతే ఎలా? ఆనాడు మాగుంట కుటుంబాన్ని, జిల్లా నాయకులను ఒప్పించి బాలినేనికి టికెట్ ఇప్పిస్తే ఆయన త్యాగాలు చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది`. మంత్రి పదవి త్యాగం ఒట్టిదే `మంత్రి పదవిని త్యాగం చేశానని పదేపదే బాలినేని చెప్పుకుంటున్నారు. నిజానికి వైయస్ఆర్ చనిపోయిన తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసింది కొండా సురేఖ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లే. రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం బాలినేని మంత్రివర్గంలోనే ఉన్నారు.రోశయ్య తర్వాత కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా నియమించబడ్డాక కొత్త కేబినెట్‌లో బాలినేనికి స్థానం దక్కక రెండు నెలలు ఎదురు చూశాడు. ఆఖరుకి వైయస్ జగన్ ఓదార్పు యాత్రకి కూడా బాలినేని మొహం చాటేశాడు. చివరికి రాజకీయాల్లో ఎటూ కాకుండా పోతాననే భయంతోనే వైయస్ జగన్ వెంట నడిచారు. ఇదే అసలు నిజం. అన్నీ అబద్ధాలే.. `బాలినేని విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే పదే పదే మనమడి మీద ఒట్టు, కొడుకు మీద ఒట్టు.. అని అబద్ధాలు చెబుతున్నాడు. ఆస్తులు అమ్ముకున్నానని, వైయస్ జగన్ దోచుకున్నాడని చెబుతున్నాడు. ఇది కూడా పచ్చి అబద్ధం. బాలినేని సొంతూరు కొణిజేడులో ఆయన తండ్రి సంపాదించిన ఆస్తులు ఒక ఎకరా కూడా అమ్ముకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఒకవేళ నిజంగా తండ్రి ఆస్తులు అమ్మడమే నిజమైతే ఆయన చేసిన రాజకీయాలకు ఎన్నిసార్లు తండ్రి ఆస్తులు అమ్ముకోవాలి?. కేసినోలకు వెళ్తానని పేకాట ఆడతానని ఆయన చెప్పేవారు. ఆయన చేసిన విలాసాలకు, రష్యాకు తిరిగిన స్పెషల్ ఫ్లైట్లకు, శ్రీలంక, గోవాల్లో పేకాట క్లబ్బుల్లో ఆడిన కోట్ల రూపాయల ఆటలకు ఆయన నాన్నగారు సంపాదించిన ఆస్తులు ఒక్కరోజుకైనా సరిపోతాయా? ఆయన సొంత ఆస్తులతో ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగలిగేవాడేనా?. సౌమ్యుడినని మీకు మీరు సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా బాలినేని? ఎవరి జోలికి రాని బ్రాహ్మణులు, వైశ్యుల ఆస్తుల జోలికి వెళ్లబట్టే కదా వారి శాపాలు తగిలి ఈరోజున ఆయనకు ఈ పరిస్థితి వచ్చింది. నోరు లేని వారి ఆస్తులు కాజేయలేదా? ` అంటూ రవిబాబు నిలదీశారు. సమన్వయకర్తలను చేస్తానని దోచుకున్నాడు `జిల్లాలో 12 సీట్లుంటే ఒక్కో నియోజకవర్గంలో ఐదారు మంది అభ్యర్థులను ప్రోత్సహించి వారిని ఏ విధంగా దోచుకున్నది జిల్లా ప్రజలకు, నీ కారణంగా ఇబ్బందులు పడిన నాయకులకు తెలుసు. ఇన్నాళ్లు వారంతా సంస్కారంతో నోరు మెదపకుండా ఉన్నారు. చివరికి మా అధినాయకుడి గురించి కూడా మాట్లాడిన తర్వాత నిన్ను ఉపేక్షించేది లేదని, నీ గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఒంగోలు భూ అక్రమాలపై సిట్ వేస్తే, ఎస్పీని మార్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది మీరు కాదా?. నిన్న మీరు మాట్లాడుతున్నప్పుడు స్టేజ్ మీదున్న నాయకులు, కిందున్న కార్యకర్తలు నవ్వుకుంటున్నారు. అధికారంలో ఉన్నంతకాలం జనసేన, టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టి వేధించిన మీరు, ఓడిపోయాక జనసేన పంచన చేరి వాటాలు అడిగితే ఇస్తారా? మిమ్మల్ని ఏదైనా అనాలంటే మీ వయసును, మీతో ఉన్న స్నేహాన్ని చూసి మాకు సంస్కారం అడ్డొస్తుంది. వైవీ సుబ్బారెడ్డి, వైయస్ కుటుంబాలతో ఉన్న బంధుత్వాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు ఆస్తులు పోగేసుకుని ఇప్పుడు వారినే తిట్టే స్థాయికి వచ్చారు. అసలు మీ వియ్యకుండికి ఆస్తులు ఎలా వచ్చాయి. ఆయన మీ బినామీయే కదా. మీకు వందల ఎకరాలు క్వార్ట్జ్, గ్రానైట్ లీజులు ఎలా వచ్చాయి? మీ మీద ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ విచారణ చేయిస్తారనే భయంతోనే కదా పార్టీ మారి జనసేనలో చేరింది`. టీడీపీకి కోవర్టుగా పనిచేశాడు `బాలినేని మొదట్నుంచి తెలుగుదేశం పార్టీకి కోవర్టుగానే పనిచేశారు. 2014-19 మధ్య వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం వైపు మళ్లించిన ఘనుడు ఈ బాలినేనే. ఇక్కడ కూడా రెండు ప్రయోజనాలు ఆశించాడు. పార్టీలో సీనియర్ నాయకులైన గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు పార్టీలో ఉంటే తనకు పదవులకు ఇబ్బంది ఉంటుందనేది ఒక కారణమైతే, వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి పంపడం ద్వారా నేను మీకు మిత్రుడినే అనే సంకేతం పంపడం రెండో కారణం. ప్రతి సందర్భంలో వైవీ సుబ్బారెడ్డిని బూచిగా చూపించి అలగడం. పనులు చేయించుకోవడం ఆయన నైజం. అధికారంలో ఉన్నప్పుడే బాలినేని ఒంగోలులో ఉంటారు. 2014-19 మధ్య హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఎన్నికల చివరి ఏడాది వచ్చి వైయస్ జగన్ గాలిలో ఎమ్మెల్యే అయ్యారు. మళ్లీ ఇప్పుడు ఓడిపోయారు. మళ్లీ వెళ్లిపోయారు. అధికారం ఉంటే పెత్తనం చెలాయించడం.. లేకపోతే పలాయనం చెందడం చేసే బాలినేని, వైయస్ జగన్ లాంటి యోధుడి గురించి ఎలా గెలుస్తాడో చూస్తానని చెప్పడం చాలా తప్పు` అంటూ రవిబాబు ఆక్షేపించారు. వైయస్ఆర్‌సీపీ ఓటమికి బాలినేనే కారణం: పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య `జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ ఓడిపోయిందంటే దానికి కారణం బాలినేని. 12 యోజకవర్గాల్లోనూ అసంతృప్తులను తయారు చేసి గొడవలు పెట్టి పార్టీని సర్వనాశనం చేశాడు. ఆయన పోవడంతో పార్టీలో వాతావరణం ప్రశాంతంగా ఉంది. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఇచ్చిన ఆదేశాలను కూడా జిల్లాలో అమలుకానివ్వకుండా బాలినేని అడ్డుకునేవారు. జగన్ ను కలవనిచ్చేవారు కాదు. ఆయన ఉన్నప్పుడు జిల్లాలో మాకు మాట్లాడే స్వేచ్చ ఉండేది కాదు. ఎంతసేపటికీ నేనే పోగొట్టుకున్నా అంటారు.. ఏం వ్యాపారాలు చేసి సంపాదించారు.. ఏం పొగొట్టుకున్నారు. రాజకీయాల ద్వారా సంపాదించుకున్నది బాలినేని ఒక్కడే. వైయస్ఆర్‌సీపీలో వైయస్ జగన్ ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు జనసేనలో ఎక్కడో మూలన కూర్చునే దుస్థితికి వెళ్లిపోయారు. జగన్ ని తిడితే ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇస్తారనే కలల్లో బాలినేని ఉన్నాడు. పైగా మంత్రి అయిన తర్వాతే జిల్లాలో అడుగుపెడతానని చెబుతున్నాడు. ఆ మాట మీదనే నిలబడితే ఆయన ఎప్పటికీ జిల్లాకు రాలేరు. హైదరాబాద్‌లోనే ఉండిపోవాల్సిందే` అంటూ మాదాసి వెంకయ్య వ్యాఖ్యానించారు.