వైయస్ఆర్ జిల్లా: టీడీపీ కూటమి ప్రభుత్వ మోసాలను క్షేత్రస్థాయిలో ఎండగడుదామని వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం కమలాపురం నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నరేన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. పార్టీలో నూతనంగా పదవులు పొందిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలోనే వైయస్ఆర్ జిల్లా పార్టీ శ్రేణులకు ఆదర్శంగా ఉండేలా నియోజకవర్గాల వారిగా సంస్థాగతంగా పార్టీ నిర్మాణన్ని పాటిష్టం చేసే దిశగా అడుగులు వేయాలన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతీ నాయకుడు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. అధికారపక్షం చేసే మోసాలను ప్రజలకు క్షేత్రస్తాయిలో తెలియచేస్తూ పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. వైయస్ జగన్ మనందరికీ అండగా ఉంటారని భరోసా కల్పించారు. 9 నెలల్లో అధికార పార్టీ నుంచి ఏ కార్యకర్తకు, నాయకులకు ఇబ్బంది కలిగి ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునే వరకు అవిశ్రాంతంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.