ఏలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని వైయస్‌ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. ఏలూరు వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ జగన్ గారి హయాంలో స్వచ్ఛతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం నేడు మూడో స్థానంలోకి దిగజారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనేది నినాదానికే పరిమితం చేశారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... తన 9 నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ స్వచ్చతలో దిగజారిపోతున్నామని నిన్న తణుకు పర్యటనకు వచ్చిన చంద్రబాబే స్వయంగా అంగీకరించారు. వైయస్ జగన్ పాలనలో గడిచిన ఐదేళ్లు రాష్ట్రం స్వచ్ఛతలో ముందడుగు వేసింది. తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించేలా ఇంటింటికీ బుట్టలు పంపిణీ చేసి ఆటోల ద్వారా చెత్తను సేకరించాం. సందుల్లోకి వెళ్లలేని ప్రాంతాలకు చెత్త బండ్లను పంపించి ఎప్పటికప్పుడు చెత్త సేకరించడం జరిగింది. స్వచ్ఛతలో జగన్ ప్రభుత్వం చేసిన కృషికి గాను నీతి ఆయోగ్ ప్రశంసలు అందుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలను పాటించడం జరిగింది. చెత్తను ఎక్కడా తగలబెట్టి పరిసరాలను కాలుష్యం చేసే విధానాలకు స్వస్తి పలికాం. మున్సిపాలిటీల్లో చెత్త వేరు చేసే కాంట్రాక్టులు, రీసైకిల్ విధానాల ద్వారా వాటికి ఆదాయం కల్పించాం. కేంద్రం నిర్ణయించిన మేరకు చెత్త సేకరణకు ఇంటింటికీ రూ. 60లు సేకరిస్తే దాన్ని చంద్రబాబు అవహేళన చేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్త పన్నును వసూళ్లను నిలిపివేస్తున్నామని ప్రజల్లో భ్రమలు కల్పించి చెత్తను సేకరించడం ఆపేశారు. చెత్త కుప్పగా మారిన తణుకు పట్టణం స్వచ్ఛతపై ప్రభుత్వ నిర్లక్ష్య పలితంగా తణుకు పట్టణమే చెత్తకుప్పగా మారింది. చెత్తను సేకరించే ఆటోలను మూలనపడేసి ట్రై సైకిళ్లను తీసుకొచ్చారు. ఫలితంగా చెత్త సేకరణ నామ్‌కే వాస్తే అనేవిధంగా సాగుతోంది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ చెత్తపేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్న పరిస్ధితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. ఈ ప్రాంతంలో శ్లాటర్ హౌస్‌లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పశువధకు పాల్పడుతున్నారు. దీనివల్ల ఏర్పడుతున్న దుర్గందంతో ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. ఈ శ్లాటర్ హౌస్ లకు ప్రభుత్వ పెద్దలే కొమ్ముకాస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు. శ్లాటర్ హౌస్‌ల కారణంగా ఉంగుటూరు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. స్థానిక పరిస్థితులపై డిప్యూటీ సీఎం, పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌కి ప్రజలు విన్నవించుకున్నా ఇంతవరకు పట్టించుకున్నపాపాన పోలేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు కూడా వెళ్లి ప్రజలు ఫిర్యాదు చేశారు. అక్కడా వారికి నిరాశే ఎదురైంది. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. శ్లాటర్ హౌస్ పేరు మీద కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. తణుకు ఎమ్మెల్యేకి పావలా ఎమ్మెల్యే అని పేరు. ఆయన పాలనలో నియోజకవర్గం లిక్కర్ ఏరులై పారుతోంది, కోడి పందేలు, పేకాట క్లబ్బులు, గంజాయి, క్రికెట్ బెట్టింగులు, అశ్లీల నృత్యాలతో ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు సాగిపోతోంది. అమాయక యువత తీవ్రంగా నష్టపోతున్నారు. వీటి మీద చంద్రబాబు దృష్టిసారిస్తే మంచిది. రైతులను వంచించిన చంద్రబాబు చంద్రబాబు సీఎం అయ్యాక మద్దతు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2014-19 మధ్య చంద్రబాబు హాయాంలో 2.60 కోట్ల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తే, 2019-24 మధ్య జగన్ హయాంలో 3.40 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. నేడు ఈ క్రాప్, ఇన్సూరెన్స్ చేయడం మానేశారు. దళారుల దోపిడీతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామన్న ఆర్థిక సాయం గతేడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌లో అరకొర నిదులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. రూ. 14 లక్షల కోట్ల అప్పులంటూ చంద్రబాబు చేసిన దుష్ప్రచారం అబద్ధమని తేలిపోయింది. అప్పులు రూ. 3.39 లక్షల కోట్లేనని తేలినా పథకాలు ఇవ్వడానికి చంద్రబాబుకి చేతకావడం లేదు. కరోనా పరిస్థితుల్లో కూడా జగన్ పథకాలు ఆపకుండా ఐదేళ్లలో రూ. 2.75 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. నాడు జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో ఆ పథకాలు ఇవ్వకపోగా.. కూటమి ప్రభుత్వం చెప్పిన సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేయడం లేదు.