టీడీపీ కోసం పుట్టిన పార్టీ జనసేన

రెండు పార్టీల మద్దతుతో పవన్‌కు 21 సీట్లు వచ్చాయి  

ప‌వ‌న్‌ ఎప్పుడు ఏ వేషం వేస్తారో జనానికి అర్థం కావటం లేదు  
 

మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఫైర్‌

తాడేప‌ల్లి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించార‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజికవర్గం చంద్ర‌బాబును విశ్వసించడం లేదని, అందుకే ప‌వ‌న్‌తో పార్టీ పెట్టించారన్నారు. టీడీపీ,  జనసేన రెండింటి మద్దతుతో 21 సీట్లు గెలుచుకున్న జనసేన అధినేత ప‌వ‌న్‌..వాపును చూసి బలుపు అనుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌సంగంపై అంబ‌టి రాంబాబు స్పందించారు. శ‌నివారం ఆయ‌న తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు.

అంబ‌టి రాంబాబు ఏమ‌న్నారంటే...
 
అయోమయంగా జ‌య‌కేత‌నం స‌భ‌
శాస‌న‌స‌భ‌లోకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌టిసారి ప్ర‌వేశించిన త‌ర్వాత ఈ స‌భ నిర్వహించారు. ప్ర‌జ‌లంతా మీడియా హ‌డావుడి చూసి ఆయ‌న ఏం చెబుతారోన‌ని చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తే, ఆయ‌న ఏం చెప్ప‌ద‌లుచుకున్నారో ఆయ‌న‌కైనా అర్థ‌మైందా అనే అనుమానం క‌లిగేలా మాట్లాడాడు. 40 ఏళ్ల టీడీపీ ప‌డిపోతుంటే నిల‌బెట్టామ‌ని మాత్రం ఆయ‌న నిజం చెప్పారు. టీడీపీ ప‌డిపోకుండా నిల‌బెట్ట‌డానికి ఏర్పాటు చేసిన పార్టీ జ‌న‌సేన అని మేం మొద‌ట్నుంచి చెబుతూనే ఉన్నాం. కాపు స‌మాజం మీద అనేక దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన‌ చంద్ర‌బాబు, కాపుల‌ను నేరుగా చేతుల్లోకి తీసుకోలేక టీడీపీ బీ టీమ్‌గా ప‌నిచేయ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలో జ‌న‌సేన ఏర్పాటు చేయించారు. కాపుల ఓట్ల‌ను త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌క్రియ‌లో భాగంగానే ఈ పార్టీ ఏర్పాటు చేయ‌బ‌డింద‌ని మొద‌టి రోజు నుంచి చెబుతూ వ‌స్తున్నాం. చంద్రబాబుకి ఏ ఆప‌ద వ‌చ్చినా కాపు కాయ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముందుకొస్తాడు. కాబ‌ట్టే జ‌న‌సేన పార్టీ మెయింటినెన్స్ బాధ్య‌త‌ల‌న్నీ కూడా చంద్ర‌బాబే చూస్తారు.  ఒక‌సారి తెలుగుదేశం పార్టీకి స‌పోర్టు చేయ‌డం, ఇంకో ఎన్నిక‌ల్లో వ్య‌తిరేక ఓట్లు చీల్చేలా ఇత‌ర పార్టీల‌తో క‌లిసిపోటీ చేయడం.. ఇదంతా చంద్ర‌బాబు ఆదేశాల‌తో చేస్తున్న‌దే త‌ప్ప‌.. ఆయ‌న‌కంటూ సొంత విధానాలున్నాయా? 11 ఏళ్లుగా చంద్రబాబు కోసం అవ‌కాశ‌వాద రాజ‌కీయాలే చేశాడు కానీ, ఆయ‌న రాష్ట్రం గురించి ఏనాడూ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. 

గెలిచిన ఎమ్మెల్యేల్లో జ‌న‌సేన నాయ‌కులు ఎంత‌మంది?
100 శాతం స్ట్రైక్ రేట్ అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెబుతున్నాడు.. కానీ ఆ సీట్లు సొంతంగా పోటీ చేస్తే రాలేద‌నే విష‌యం ఆయ‌న గుర్తుంచుకోవాలి. నిన్న స‌భ‌లో కూర్చున్న 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్ద‌రు ఎంపీల్లో ..జ‌న‌సేన నాయ‌కులు ఎంత‌మంది ఉన్నారో చెప్పాక‌, స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడి ఉంటే బాగుండేది. గాలికి కొట్టుకొచ్చిన వాళ్ల‌ని పెట్టుకుని ప్ర‌జ‌ల దుర‌దృష్ట‌వ‌శాత్తో గెలిచార‌నే విష‌యం తెలియ‌దా? ఆ అభ్య‌ర్థులంతా చంద్ర‌బాబు పంపినోళ్లు, వైయ‌స్ఆర్‌సీపీ  వ‌ద్ద‌నుకుని తిర‌స్క‌రించినోళ్లు కాకుండా జ‌న‌సేన త‌యారు చేసిన నాయ‌కులు ఎంత‌మంది ఉంటారో చెప్పండి.  అదంతా ప‌క్క‌న పెడితే అధికారంలోకి వ‌చ్చాక సూప‌ర్ సిక్స్ లో ఎన్ని హామీలు అమ‌లు చేశారో ఎందుకు చెప్ప‌లేక‌పోతున్నారు?  జ‌య‌కేత‌నం స‌భ‌లో  ఎన్నిక‌ల్లో ఇచ్చిన 143 హామీల ఊసెత్త‌డం లేదు ఎందుకు?  రాజ‌కీయాల్లో స‌మృద్దిగా ధ‌నం సంపాదించుకుని ఆరోగ్యం చెడగొట్టుకున్నాన‌ని చెబుతున్నాడు.  పిఠాపురంలో స‌భ పెట్టి అన్ని అబ‌ద్దాలు చెప్పాడు. మొన్న‌టి దాకా ఆదర్శాలు గురించి చెప్పి ఇప్పుడు డాక్ట‌ర్ కాబ‌ట్టి చేగువేరా ఫొటో పెట్టుకున్నాన‌ని చెబుతాడా?  మానాన్న హేతువాది, దీపారాధ‌న‌లో సిగిరెట్ వెలిగించుకునేవాడ‌ని చెప్పిన ఈ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నిన్న‌టి స‌భ‌లో మాత్రం మా ఇంట్లో నిత్యం రామ నామ స్మ‌ర‌ణ వినిపిస్తుంద‌ని జ‌నం చెవుల్లో క్యాబేజీ పూలు పెడుతున్నాడు. ఎందుకిలా పూట‌కో మాట చెప్ప‌డం.. త‌న‌ను తాను గొప్ప‌గా ప్రొజెక్టు చేసుకునేందుకు తండ్రిని కించ‌ప‌రిచేలా దిగజార‌డం అవ‌స‌ర‌మా? . ద‌క్షిణాది మీద ఉత్త‌రాది వారి పెత్త‌నం, అహంకారం అని మొన్న‌టిదాకా అరిచి గ‌గ్గోలు పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ష‌డ‌న్‌గా కాషాయం ధ‌రించి యూట‌ర్న్ తీసుకున్నాడు. గతంలో ఈ పెద్ద మ‌నిషే విప్లవ భావాలతో తుపాకీ ప‌ట్టుకోవాల‌ని చెప్పేవాడు. ఏదో ఒక నిర్ణ‌యం మీద నిల‌బ‌డ‌కుండా నిత్యం ఎటు గాలికొడితే అటు కొట్టుకుపోవ‌డం త‌ప్ప‌, ఆయ‌న‌కంటూ ఒక నిర్ణ‌యం మీద నిల‌బ‌డే స‌త్తా లేదు. 

మీ పార్టీ ఎమ్మెల్యేల దోపిడీపై నోరెత్త‌రా? 
 కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక మెడిక‌ల్ కాలేజీలు, పోర్టుల‌ను చంద్ర‌బాబు ప్రైవేటుకు ధారాద‌త్తం చేస్తుంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం నోరెత్త‌డం లేదు. పైకి మాత్రం తాను నిజాయితీపరుడిన‌ని చెప్పుకుంటాడు.. జ‌న‌సేన ఎమ్మెల్యేలు దోపిడీలు, అవినీతికి పాల్ప‌డుతుంటే ఆయ‌న కంటికి క‌నిపించ‌డం లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ప్రియాతి ప్రియ‌మైన మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ రేష‌న్ దోపిడీకి అడ్డే ఉండ‌టం లేదు. జ‌న‌సేన ఎమ్మెల్యేలు డాక్ట‌ర్ల‌ను బెదిరించినా తిట్టినా ఆయ‌న కంటికి క‌న‌ప‌డ‌దు. నాలుగైదు భాష‌ల్లో చ‌దివి త‌న‌కు తానే ద‌క్షిణాది త‌ర‌ఫున ఉత్తరాది నాయ‌కుడిన‌ని ప్ర‌క‌టించుకున్నాడు. కుటుంబ రాజ‌కీయాలు, వార‌స‌త్వ రాజ‌కీయాలు ఏంట‌ని ప్ర‌శ్నించాడు. నాయ‌కులు ప్ర‌జ‌ల నుంచి పుట్టాలంటాడు.. ఇన్ని మాట‌లు చెప్పి చివ‌రికి వ‌చ్చిన ఒక ఎమ్మెల్సీ ప‌దవిని అన్న నాగబాబుకే ఇచ్చుకున్నాడు. అవ‌కాశవాద రాజ‌కీయాల‌లో ప‌వ‌న్ క‌ళ్యాన్.. చంద్ర‌బాబునే మించిపోయాడు. 

వ‌ర్మను వాడుకుని వ‌దిలేశారు

 అధికారం ఉంది కాబ‌ట్టి జనం వ‌చ్చార‌ని గుర్తుంచుకోవాలి.. అధికారంలో ఎవ‌రున్నా జ‌నం వ‌స్తార‌ని తెలుసుకోవాలి. ప‌వ‌న్ కళ్యాణ్ సీఎం అవుతార‌ని ఇన్నాళ్లు కాపులు అనుకున్నారు.. ఇప్పుడిప్పుడే చంద్ర‌బాబుకి ఊడిగం చేయ‌డానికి పార్టీ పెట్టార‌ని తెలుసుకుంటున్నారు. న‌న్ను గెలిపించే బాధ్య‌త నీదేనని సీటు త్యాగం చేయించుకుని గెలిచిన త‌ర్వాత నీవ‌ల్ల గెల‌వ‌లేద‌ని వ‌ర్మ‌ను ఎగ‌తాళి చేశారు. అక్క‌రు గ‌డుపుకుని మోసం చేయ‌డంలో చంద్ర‌బాబునే మించి పోయారు ప‌వ‌న్‌. త‌న‌ను గెలిపించిన వర్మను నీ ఖ‌ర్మ అనేలా విర్ర‌వీగ‌డం మంచిది కాదు. పిఠాపురంలో మొద‌టిసారే గెలిచార‌నే సంగ‌తి కూడా మ‌రిచిపోవ‌ద్దు. చంద్రబాబు, జ‌గ‌న్‌లా వ‌రుస‌గా గెలిచిన చ‌రిత్ర మీకు లేదు. నోరుజారి ఇలాగే మాట్లాడితే ఖ‌ర్మ మీరు అనుభవిస్తారు. 

పార్టీ మారినంత మాత్రాన నోరు జారితే ఎలా

 వైవీ సుబ్బారెడ్డి లేక‌పోతే బాలినేని శ్రీనివాస‌రెడ్డి రాజ‌కీయాల్లో ఇంత‌కాలం నిల‌బ‌డగ‌లిగేవారా?  వైయ‌స్ కుటుంబం  ద‌య‌లేక‌పోతే ప‌ద‌వులు వ‌చ్చేవా?  ఎక్క‌డో ఆస్తులు పోగొట్టుకుని వ‌చ్చి, రాజ‌కీయాల్లో పోగొట్టుకున్నాన‌ని చెప్ప‌డం సిగ్గుచేటు. ఆస్తులు ఎక్క‌డ పోయాయో ఒంగోలు ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు.  అధికారం ఉన్నంత‌కాలం విజ‌య‌సాయిరెడ్డి, బాలినేని శ్రీనివాస‌రెడ్డి పెత్త‌నం చెలాయించి పార్టీ ఓడిపోవ‌డంతో అన్యాయం జ‌రిగింద‌ని చెప్పుకోవ‌డం సిగ్గుచేటు. ఇలాంటి బాలినేనిని న‌మ్మి ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాలు చేశాడంటే నాశ‌నం కావ‌డం త‌థ్యం. వైయ‌స్సార్, జ‌గ‌న్‌ ద‌యాదాక్షిణ్యాల‌తో ఎంపీ అయిన బాల‌శౌరి కూడా వేదిక దొరికింది క‌దా అని రెచ్చిపోవ‌డం త‌గ‌దు. ఆయ‌న జీవితం మొత్తం ప్ర‌జ‌ల‌కు తెలుసు. నాలుగేళ్ల త‌ర్వాత ప‌రిస్థితులు మారతాయ‌ని గుర్తుంచుకుంటే మీకే మంచిది. దుర్మార్గ‌మైన రాజ‌కీయాలు చేస్తే భ‌విష్య‌త్తులో మీకు నూక‌లు కూడా మిగ‌ల‌వ‌ని గుర్తంచుకోవాలి.  కొత్తగా ఎమ్మెల్సీ అయిన నాగ‌బాబు కూడా జ‌గ‌న్ గురించి నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నాడు..  ఎవ‌రిదో ద‌యాదాక్షిణ్యాలుంటే త‌ప్ప గెల‌వలేని అన్న‌ద‌మ్ములు.. ఢిల్లీ కొట‌ను ఢీకొట్టిన జ‌గ‌న్ గురించి మాట్లాడే స్థాయి ఉందేమో ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలి. జ‌గ‌న్ ఓట‌మి ఎరుగ‌ని ధీరుడు. పార్టీ పెట్టిన ప‌దేళ్ల‌లో వైయ‌స్సార్సీపీని అదికారంలోకి తెచ్చాడని చ‌రిత్ర చూసి తెలుసుకోవాలి.  వైయ‌స్ కొడుకు కాక‌పోయుంటే అని వైయ‌స్ జ‌గ‌న్ గురించి మాట్లాడే మంత్రి కందులు దుర్గేష్‌.. అల్లు రామ‌లింగయ్యకి అల్లుడు కాక‌పోయుంటే చిరంజీవి ఏమ‌య్యేవాడో, ఆయ‌న కుటుంబం ఎలా ఉండేదో ఊహించుకోవాలి`` అంటూ అంబ‌టి రాంబాబు చుర‌క‌లంటించారు.

Back to Top