ప్రైవేట్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసిన పారా చెవుల్లోంచే చెమటలు కారాయి. కాళ్లు, చేతులూ వణికాయి. గుండె గొంతులోకి వచ్చేసింది. రెండు నిమిషాలు ఒక్క మాట మాట్లాడకుండా విన్నాక జీ...జీజీ..జీజీజీజీ, అలాగే చెబుతాను జీ అని అతి వినయంతో వంగిపోతూ ఫోన్ పెట్టేసాడు పారా. వెంటనే ప్రెస్ మీట్ అరేంజ్ చేయమని పియ్యేకి ఆర్డర్ వేసాడు. గంటలో విలేకరులంతా వచ్చేసారు. కళ్లజోడు సర్దుకుని, వాచీ పెట్టుకోబోయి, అమ్మో అసలే వాచీ ఉంగరం లేదని చెప్పినోడ్ని మళ్లీ ఇవి పెట్టుకెళితే పెద్ద గోలైపోతుంది అని వాటిని లోపల పెట్టి చొక్కా సర్దుకుంటూ ప్రెస్ మీట్ జరిగే హాల్ లోకి వెళ్లాడు. పారా ఏం చెబుతాడా అని అందరూ ఎంతో ఉత్కంఠతో పెన్నులు, మైకులు, కెమెరాలూ సర్దుకుని ఆత్రంగా చూస్తున్నారు. రాజకీయ లబ్దికోసం దేశాన్ని తాకట్టు పెడతారా? అని నేను ప్రశ్నిస్తున్నాను అన్నాడు పారా. ఎవరు సర్ అలా తాకట్టు పెట్టింది? వెంటనే ప్రెస్ నుంచి ప్రశ్న దూసుకొచ్చింది. కేంద్రంలో ఏ అరాచకానికైన సమర్ధులైన వాళ్లు ఉన్నారు...ఆ ప్రశ్నను పట్టించుకోకుండా మరో కామెంట్ చేసాడు పారా. అరాచకాలు ఎవరు చేస్తున్నారు? మరో ప్రశ్న పుట్టుకొచ్చింది. నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినాలి. ఎవరి కోసరం చెబుతున్నానో అర్థం చేసుకోవాలి. ఈ దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉంది. సరిహద్దు దేశాలతో సంబంధాలు చెడిపోతున్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో రాజకీయ లబ్దిని చూసుకోకూడదు. వాళ్లకు నచ్చినట్టు వాళ్లను ఉండనివ్వాలి. మన దేశంలో జరుగుతున్న ఉగ్రదాడులతో మాకేం సంబంధం లేదని బాకిస్తాన్ ఢంకా బజాయించి చెబుతోంది. ఆమాటలు వింటే మనకో విషయం క్లియర్ గా అర్థం అవుతోంది. పారా చెబుతున్నవిషయాలకు లింకులు ఎక్కడున్నాయా అని విలేకరులు ఆలోచిస్తూ అంతరిక్షం దాకా వెళ్లిపోయారు. వాట్ అయామ్ సేయింగ్ బబితక్క చెప్పినట్టు దేశంలోని కొన్ని శక్తులే ఉగ్రదాడులకు కారణం అని నేనూ ఏకీభవిస్తున్నాను. కనుక మీరూ నాతో ఏకీభవించాలి. నేను అనుమానిస్తున్నట్టే కేంద్రంలోని శక్తులు ఇందుకు కారణం అని మీరూ అనుమానించాలి. అలాగే అంటూ నిలువుగా తలలు ఊపాయి కొన్ని మైకులు. నేను చెప్పొచ్చేదేమిటంటే బాకిస్తాన్ కు మన దేశంలో జరిగిన ఉగ్రవాద దాడికీ ఏ సంబంధమూ లేదు. ఒకపక్క వాళ్లు మనతో మంచి సంబంధాల కోసం చేతులుచాస్తుంటే ఇంగో పక్కన కేంద్రంలోని వాళ్లు కత్తులు దూస్తున్నారు. మీరు చూస్తే వాళ్ల రాజకీయాలవల్లే శాంతిభద్రతల సంక్షోభం వస్తోంది ఈ విషయాన్ని మీరంతా తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను. దేశభద్రత విషయంలో రాజీపడబోమని మీఅందరికీ మరోసారి తెలియజేస్తున్నాను. జైహింద్ - అంతా చెప్పేసి లేచి వెళ్లిపోయాడు పారా. లోపలికి వెళ్లగానే వెంటనే ప్రైవేటు నెంబర్ మరోసారి మోగింది... బహుత్ ఖూబ్...బాగా చెప్పినవ్. మీవీ బ్లాక్ మనీ దుబాయ్ చేరాలంటే మాదీ దేశం మీదుగానే పోవాలి. మాకి తెలియకుండా ఒక్క రూపాయి కూడా మీరు ఎక్కడికీ పంపలేరు.నీ హవాలా దివాలా కాకుండా ఉండాలి అటే మేము చెప్పినట్టు మీరు మీడియా ముందు చెప్పాలి...సమ్ ఝే కరుకుగా వినిపించింది ఆ పక్క నుంచి బాకిస్తాన్ భయంకర కంఠం. ఝే...ఝే అన్నాడు పారా పరమ భయభక్తులతో..... అర్థమైతే మీ అందరికీ పారాహుషార్.....