ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల మనోభావాలు, వారి అనుభవాలు తెలుసుకునే శీర్షికన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వేదికః పప్పుగారి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన పార్టీనుంచి పోటీ విరమించుకున్న మంగళగిరి. సమావేశానికి 15 మంది హాజరయ్యారని విశ్వసనీయంగా అన్ని రాజకీయవర్గాలకు తెలిసింది. పోనీలే ఏదో వచ్చినవాళ్లతోనే మాట్లాడదాం అనుకుని సరిపెట్టుకున్న సేనానికి చిర్రెత్తుకొచ్చే ప్రశ్న ఎదురైంది. అందులో ఉన్న ఎవరో మరొకరితో ఇంతకీ మన బాస్ అంచనా ప్రకారం మనకు వచ్చే సీట్లెన్ని? అని. అది అధ్యక్షుడి చెవిలో పడింది. ఆయన వెంటనే చాలా అసహనానికి గురయ్యారట. ''ఏంటి.. లెక్కలెందుకు మీకు లెక్కలు. లెక్కలు అవసరమా? మనకి మన పార్టీకి లెక్కలు అవసరమా..'' అంటూ తనదైన శైలిలో ఊగిపోయేసరికి ఆ పదిహేనుమంది దిక్కులు చూశారట. అంతటిదో ఆగని పవన్ ఆవేశం ఇంకాస్త కొనసాగిందట. ''లెక్కలంటే నాకు సెడ్డ సిరాకు. అందుకే నేను ఎంపిసి తీసుకోలేదు..'' అన్నారట. దీంతో ఆయన చదివానని చెప్పిన గ్రూపులన్నీ గుర్తొచ్చాయట అక్కడున్నవాళ్లకి. ఇంకా మాట్లాడితే జలీల్‌ఖాన్ అవుతాడేమో అని భయపడి, ఇంతలోనే గుర్తొచ్చి ''మీడియా సమావేశం కాదు కాబట్టి సరిపోయింది'' అని ఊపిరి పీల్చుకున్నారట. పవన్ తన అభిప్రాయాన్ని కొనసాగిస్తూ.. ''మనం ఎన్ని సీట్లు గెలుస్తాం అనే మాట అస్సలు ఎవ్వరూ మాట్లాడొద్దు. మన వాళ్లను కూడా మాట్లాడొద్దు అని చెప్పండి. సీట్లు సంగతి జగన్, బాబు చూసుకుంటారు. ఆ పార్టీలు ఉండగా మనకెందుకు సీట్ల గొడవ. మనం మార్పుకోసం వచ్చాం...'' ఇలా కొనసాగుతుండగా ఆ పదిహేనుమందికి 2009 ఎన్నికల ప్రచారం గుర్తొచ్చిందట. ఆ మార్పు ఈ మార్పు ఒక్కటేనా? ఆ మార్పు అయినా బాగుండేమో ఇలా చెవులు కొరుక్కున్నారట. వాళ్లు వాళ్లే సీట్లు పంచుకుంటారు అనుకున్నప్పుడు మనం ఎందుకు నిలబడినట్టు? అనే ప్రశ్నలు కూడా వారి హావభావాల్లో పవన్‌కి కనిపించకుండా జాగ్రత్తపడ్డారట. ఇంతలో కల్యాణ్ బాబు ముగిస్తూ ముగిస్తూ, మనం కచ్చితంగా ఒక సుదీర్ఘ ప్రయాణం చేయాలి. దక్షిణ భారత దేశంపై ఉత్తర ఆధిపత్యం.. ఇలా చెప్పుకుంటూ పోతుండగా గ్లాసులో నీళ్లు, ప్లేటులో బిస్కెట్లతో ఎవరో వచ్చారట. అది చూసిన పవన్ నీళ్లగ్లాసు తీసుకుని సమావేశం ముగిసిందని ప్రకటించాడట. అదీ లెక్క మరి.