తెలంగాణా ఎన్నికలయ్యాక చంద్రబాబుకు రిటర్న్ గిఫ్టు ఇస్తానన్న కేసీఆర్ ఎప్పుడు ఇస్తారో, ఎలా ఇస్తారో, ఏది ఇస్తారో అంటూ రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే ఆ రిటర్న్ గిఫ్టు ఆల్రెడీ చంద్రబాబుకు చేరిపోయిందని, అదేమిటి అనేది చంద్రబాబు గుర్తుపట్టేసారని ఇవాల్టివరకూ తెలియలేదు. అసలైతే ఆ గిఫ్టును ఏపీ సీఎం అందుకున్నట్టే అనిపిస్తోంది బాబుగారి మాటలు చూస్తుంటే. ఐటి గ్రిడ్ కంపెనీపై తెలంగాణా లో విచారణ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు కేసీఆర్ పై ఒంటికాలిపై లేస్తున్నారు. ఇందుకోసం రోజూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ కంపెనీని వెనకేసుకొస్తున్నారు. ఈ సందర్భంలోనే కేసీఆర్ తనకు రిటన్ గిఫ్ట్ ఇచ్చేసిన విషయాన్ని బయటపెట్టారు. ఓటుకు నోటు కేసు పార్టు 2, డేటా చోరీ కేసుల్లో టీడీపీ డొంక కదలుతుండటం ఇరు రాష్ట్రాల్లోనూ సంచలనం అయ్యింది. ఎక్కడే కుట్రలు బయటపడ్డా, ఎక్కడ సిబిఐ, ఐటీ రైడులు జరిగినా చంద్రబాబు ఉలిక్కిపడి పోవడం, ఆంధ్ర ప్రజల ప్రయోజనాలు నాశనం అవుతున్నాయని గుండెలు బాదుకోవడం జరుగుతోంది. అలాంటిది తిన్నగా చంద్రబాబు రెండుకాళ్లకీ బంధనాల్లాగా వచ్చిన ఓటుకునోటు, డేటా చోరీ వ్యవహారాలపై కక్కలేక మింగలేక ఉన్నారు టీడీపీ అధ్యక్షులు. ఐటీ గ్రిడ్ కంపెనీని పై కేసులు పెట్టడం అంటే ఏకంగా హైదారాబాద్ లోని ఆంధ్రులను భయపెట్టడం అంటూ హుంకరించారు. తెలంగాణా ముఖ్యమంత్రికి అసలేం అధికారం ఉంది అంటూ ఊగిపోయారు. వస్తానన్నారుగా రానీయండి, కేసీఆర్ కేటీఆర్ ఇంకెవ్వరు వచ్చినా రానీయండి అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఇదంతా చూస్తుంటే బాబుగారికి కేసీఆర్ రిటర్న్ గిప్టు అందినట్టే అనిపించడం లేదూ.