‘ఆ’ పేపర్ నుంచి చంద్రబాబుకి ఫోన్ వచ్చింది. ‘‘కష్టంగా ఉంది నాయుడుగారూ..’’ ‘‘పేపర్ నడపడానికేనా కష్టం. ఏమైనా పంపించమంటావా?’’ ‘‘పేపర్‌ని నడిపించడానికి కాదు, మిమ్మల్ని గెలిపించుకోడానికి కష్టంగా ఉంది. ఫీల్డు మీద మావాళ్లు చెబుతున్నారు కదా. జగన్ కాదు, మీరు ప్రతిపక్ష నాయకుడిలా ఉన్నారు. జగన్ కాదు, మీరు ప్రతిపక్ష నాయకుడిలా హామీలు ఇస్తున్నారు. జగన్ ఇస్తానన్నవి మీరూ ఇస్తాననడం దెబ్బ కొట్టేసింది. సీఎం అంటే ఎంత ధీమా ఉండాలి. అది మీలో లేదు. సీఎం అంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి. అది మీలో లేదు. జగన్ సభకు ఎర్రటి ఎండల్లో కూడా జనం వస్తున్నారు. మీరు చలువ పందిళ్లు వేసి, స్ప్రయిట్ ఇస్తున్నా జనం రావడం లేదు.’’ ‘‘ఆ సంగతి నాకూ తెలుసు. నా సంగతి నాకు చెప్పకుండా నువ్వేం చేస్తావో అది చెప్పు అన్నాడు’’ చంద్రబాబు విసుగ్గా. ‘‘అలా విసుక్కుంటే ఎలా నాయుడుగారూ? ఇప్పటికే జనాన్ని విసుక్కుని శత్రువైపోయారు. నాయకుల్ని విసుక్కుని జగన్‌కి స్నేహితుల్ని చేసేశారు. ఇప్పుడు నన్నూ విసుక్కుంటున్నారు. నన్ను విసుక్కుంటే నేనెక్కడికీ పోయేది లేదు కానీ.. ఈరోజు మన పేపర్ చూశారా .. ‘చంద్రబాబుకి మళ్లీ రాజయోగం’ అని మీ జాతక చక్రం వేయించాను. ‘బాబుకు గురుబలం అధికం’ అని బిజుమళ్ల బిందు మాధవ సిద్ధాంతి చేత చెప్పించాను. మీ జాతకంలో 9వ స్థానంలో గురు శుక్రులు, దశమంలో రాహువు, 11వ స్థానంలో రవి బుధులు ఉన్న కారణంగా మీరు తప్ప ఈ రాష్ట్రానికి వేరే భాగ్యం లేదని జ్యోతిష పండితులు చెప్పినట్లుగా మా స్పెషల్ డెస్క్ చేత రాయించాను. గ్రహబలం ప్రకారం మీరు సీఎం అవడం ఖాయం అని జనం అనుకుని మీకే ఓటేస్తారు..’’ చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘సీఎం అవుతానని అనుకుని ఓటేయడం ఏంటి! సీఎం అవ్వాలని అనుకుని కదా ఓటెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు’’ అన్నాడు. ‘‘ఏదో ఒకటి మాట్లాడాలి, మాట్లాడించాలి నాయుడుగారూ. మీకోసం మా టీమ్ మొత్తం డే అండ్ నైటు కష్టపడుతున్నాం. ఒక పాత్రికేయ భీష్ముడి చేత మాట్లాడించాం. ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడి చేత మాట్లాడించాం. ఒక ఆర్థిక నిపుణుడి చేత మాట్లాడించాం. రోజుకొక లీడర్‌కి ఫీడింగ్ ఇచ్చి మాట్లాడిస్తున్నాం. అయినా జనం కదలడం లేదు. ఇక లాభం లేదని పండితుల్ని పట్టుకొచ్చాం. ఏం చేసినా మిమ్మల్ని సీఎం చెయ్యడానికే నాయుడుగారూ..’’ ‘‘చాల్లేవయ్యా.. ‘నీదేమీ లేదు.. అంతా నాదే’ అనే కదా నాకు చెబుతున్నావ్. ఇంతకీ జగన్ గురించి మీ పండితులు ఏమన్నారో చెప్పు’’ అన్నాడు చంద్రబాబు. ‘‘మీకున్నట్లుగా జగన్‌కి గురుబలం లేదని రాయించాను నాయుడుగారూ..’’ ‘‘ఎందుకు! జగన్‌కి గురుబలం గ్రహబలం లేకపోయినా, జనం అనుగ్రహం ఉందని జనం అనుకోడానికా?! నాకు పనికొచ్చే ఐడియాలు వెయ్యమంటే.. జగన్‌కి పనికొచ్చే ఐడియాలు వేస్తావేంటయ్యా..’’ అన్నాడు చంద్రబాబు.. తలకొట్టుకుంటూ.