తాడేపల్లి: నవరత్నాల సంక్షేమాన్ని పేదవాడికి పంచుతూ, వారి కనీస అవసరాలు తీర్చుతూ, వారికి విద్యను, ఆరోగ్యాన్ని, ఆర్థిక మెరుగుదలను, ఉపాధిని, భద్రతను, భవితను గత ఐదేళ్ల పరిపాలనలో సీఎం వైయస్ జగన్ చూపించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణమురళీ అన్నారు. అదే చంద్రబాబు దృష్టిలో పేదలంటే ఐదేళ్లకోసారి ఓట్లు అమ్ముకునే జీవశ్చవాలు లాంటివారని చెప్పారు. సంపద సృష్టిస్తాం అంటూ చంద్రబాబు చెబుతున్నాడే.. ఆయన ముఖ్యమంత్రి అయ్యినప్పటి నుంచీ దిగిన వరకు ప్రతీ బడ్జెట్‌లో రెవెన్యూ లోటు.. రెవెన్యూలోటు కనిపిస్తుందని, మరి, సంపద ఎక్కడ సృష్టించాడని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్రకార్యాలయంలో పోసాని కృష్ణమురళీ విలేకరుల సమావేశం నిర్వహించారు. వైయస్‌ఆర్‌సీపీ నేత పోసాని కృష్ణమురళీ ఇంకా ఏమన్నారంటే.. ఎన్నికలు జరుగుతోన్న తరుణంలో పెద్దపెద్ద నగరాలు, అర్బన్ ప్రాంతాల్లో అందరూ మా పార్టీకి ఓట్లేయండి.. అంటూ ఎవరికి వాళ్లు అడుగుతూ ఉన్నారు. అలాగే, నేనూ కొంత మందిని ఓటును సద్వినియోగం చేసుకోండని అడిగాను. మీరు వైయస్‌ఆర్‌సీపీకి ఓటేయమంటారు కదా..? మరి, వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వ ఖజానా సొమ్మును పేదలకు పప్పుబెల్లాల్లా పంచారు కదా.. ఇది ఎంతవరకు సబబండీ..?అని అడిగారు. దానికి నా సమాధానం ఏమంటే, వైయస్ జగన్ ప్రభుత్వ ఖజానా ధనాన్ని పేదప్రజలకు పంచకపోతే.. ఈపాటికి చంద్రబాబులాంటి అవినీతిపరుల చేతుల్లో పేదవాళ్ళు నాశనమైపోయుండేవారు. ఎందుకంటే, చంద్రబాబుకు పేదవాళ్లను ఇంకా పేదవాళ్లుగా మిగల్చడమే తెలుసు. సిమెంట్ స్థంభాల్లో అభివృద్ధి లేదు.. మానవనిర్మితంలో ఉంది అభివృద్ధి ఎక్కడ..? అభివృద్ధి ఎక్కడ.?అని ప్రశ్నించేవారికి నా సమాధానం ఏమిటంటే.. ఎత్తైన సిమెంట్ స్థంభాలతో గానీ.. పెద్ద పెద్ద బిల్డింగులతో అభివృద్ధి ఏమీరాదు. బేసిక్‌గా మానవ నిర్మాణం జరగాలి. మనిషనేవాడు జీవశ్చవం స్థాయి నుంచి నేనొక మనిషిని అని రోడ్డుమీదకొచ్చి చెప్పుకోగలగాలి. అలా మనిషి తనను తాను చెప్పుకునే పరిస్థితికి చంద్రబాబు తన జీవితంలో తేలేడు. ఆ పని చంద్రబాబుకు చేతగానిది. చంద్రబాబుకు తెలిసింది ఓటుకు నోటు పంచడమే అధికారంలో ఉన్నన్నాళ్లూ పేదల ఆర్థికపరిస్థితేంటి..? వారి కుటుంబాల జీవనప్రమాణాలేంటనేది చంద్రబాబుకు అవసరంలేని సంగతి. ఆయనకు తెలిసిందల్లా ఐదేళ్లకోసారి ఎన్నికలనగానే పేదలు, కూలీల దగ్గరకు వచ్చి.. వారి ఓటుకు విలువ కట్టడమే. ఓటుకు రూ.వెయ్యి చొప్పున, ఇద్దరికి రూ.2 వేలు, ముగ్గురికి రూ.3వేలు చొప్పున కుటుంబాలకు పంచడమే తెలుసు. మరి, అప్పటిదాకా ఈ పేదవాడి పరిస్థితేంటి..? పూరిగుడిసె, నాగరికత లేదు. డబ్బుల్లేవు. అప్పులు. చుట్టూ పేదరికం, పిల్లలకు విద్యలేదు. తింటానికి తిండిలేదు. కట్టుకోవడానికి బట్ట లేదు. ఇలాంటి వాడికి చంద్రబాబులాంటోడు రూ.వెయ్యి నోటు చూపెట్టి.. ఇదిగో నాకు ఓటేస్తే, ఈ నోటు నీదేనంటూ ఆశపెట్టి.. దశాబ్దాలుగా ఓట్లకు నోట్ల రాజకీయం చేయడమే ఆయనకు తెలుసు. పేదవాడు జీవశ్చవం కాకూడదనే.. వైయస్ జగన్ ‘నవరత్నాలు’ తెచ్చారు ఎన్నికల్లో చంద్రబాబులాంటోడు పంచిన రూ.వెయ్యి చొప్పున ఆరుగురు సభ్యులకు కుటుంబానికి రూ.6వేలు తీసుకుని ఓటేస్తే.. మళ్లీ ఏడాది వరకూ వాళ్లను పట్టించుకునే నాథుడులేడు. తీసుకున్న డబ్బులు ఒక వారం, పదిరోజులకు ఆ డబ్బులు ఖర్చైపోగా.. మళ్ళీ ఐదేళ్లవరకూ ఎన్నికలెప్పుడొస్తాయా..? అంటూ ఎదురుచూడటమే పేదవాడి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఏ పేదవాడికి వద్దన్నది వైయస్ జగన్‌మోహన్ రెడ్డి సిద్ధాంతం. ఈ డబ్బుల సంస్కృతి వద్దు. పేదవాడు ఐదేళ్లపాటు ఎవడో ముష్టిగా విసిరే నోట్ల కోసం ఎదురుచూసే జీవశ్చవం కాదు అంటూ ‘నవరత్నాలు’ సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టి వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో దమ్ముగా అమలు చేశారు. ఈ నవరత్నాల సంక్షేమాన్ని పేదవాడికి పంచుతూ.., వారి కనీస అవసరాలు తీర్చుతూ, వారికి విద్యను, ఆరోగ్యాన్ని, ఆర్థిక మెరుగుదలను, ఉపాధిని, భద్రతను, భవితను చూపించారు గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. పేదల్ని ఆదుకునే మనసురావడానికి వైయస్ జగన్ స్ఫూర్తి మరి, నగరాలు, పట్టణాలు, అర్బన్‌ప్రాంతాల్లో ఆర్థికంగా స్థిరపడిన ధనవంతులు కొందరు తమ కులాల్లో పేదలను వివిధ సందర్భాల్లో ఆదుకుంటారు. కమ్మవాళ్లు కమ్మోళ్ల పిల్లల్ని, కాపులు కాపుల పిల్లల్ని మెరిట్ ఆధారంగా వారికి డబ్బు సాయం చేసి ఉన్నతచదువుల కోసం ప్రోత్సహిస్తూ ఉంటారు. నేనొక కమ్మకులంలో పుట్టిన విద్యార్థిగా 7వ తరగతి పెదకాకానిలో ఆర్డినరీ ప్రభుత్వ స్కూల్‌లో చదువుతుంటే.. పాసయ్యాక మా నాన్న నన్ను మోతడక గ్రామంలో పెట్టి వీడ్ని చదివించడానికి నా దగ్గర ఆర్థికస్థోమత లేదంటే, మా వాళ్లంతా తలోచేయ్యేస్తే పదోతరగతి ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. అప్పుడు మా పెదకాకానిలో మారుపూడి కోటేశ్వరరావు నన్ను తీసుకెళ్లి గుంటూరు జేకేసీ కాలేజీలో చేర్పించాడు. ఇప్పుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలాంటి పేదవాళ్లకు కడుపులను ఎలా నింపుతున్నాడో.. అలాగే, గుంటూరు కొత్తపేటలో పరంధామయ్య గారనే డాక్టర్ నన్ను డిగ్రీ, ఎంఏ చదివించాడు. ఎంతోమంది తమ ట్రస్టుల ద్వారా పేదలకు విద్యా దానం చేస్తున్నారు. మరి, ఈరోజు అర్బన్‌ప్రాంత్లాల్లోని ధనవంతులు మాట్లాడుతున్నట్లు.. ఆరోజు డాక్టర్ పరంధామయ్యలాంటోళ్ళు .. నాలాంటి పేదవిద్యార్థికి సాయం చేయడం ఎందుకంటే.. ఈరోజు పోసాని కృష్ణమురళీలాంటి విద్యావంతుడు ఎదిగేవాడు కాదు. ఎక్కడో బరిగొడ్లు కాసుకునేవాడు. నేను ఆర్థికంగా ఎదిగాక, ఎంతోమందిని కులం, మతం చూడకుండా లక్షల్లో ఖర్చుపెట్టి చదివించాను. పెళ్లిళ్లు చేయించాను. గుండెకు రంధ్రం పడిన ఎంతోమంది పేద చిన్నారులకు హైదరాబాద్ స్టార్ హాస్పిటల్‌లోనే నేను ఆపరేషన్లు చేయించాను. అదేంటండీ.. పేదవాళ్లు ఎటుపోతే మనకేంటి..? వాళ్లకు ఆపరేషన్లు మనం ఎందుకు చేయించాలని నా భార్య అడ్డుకుంటే.. చాలామంది పిల్లలు చనిపోయేవాళ్లు. ఆర్థికంగా ఎదిగిన ధనవంతులు తమ కులాల్లోని పేదలకు డబ్బులు సాయం చేయడానికీ.. మరి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ పేదల ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ చేసి వారి బతుకులు మార్చడానికి ఏమైనా తేడా ఉందా..? కులం, మతం , ప్రాంతం, రాజకీయం అనేది చూడకుండా ప్రభుత్వ సొమ్మును పేదవాడికి పంచి వారి జీవనప్రమాణాల్ని పెంచడమనే విధానం మంచి సాంప్రదాయం. నాలాంటి ఎంతోమంది ధనవంతులకు పేదవాడిని ఆదుకోవాలనే మనసు రావడానికి వైయస్ జగన్ స్ఫూర్తి. వైయస్ జగన్ చేసిన మానవనిర్మితం కంటే గొప్ప అభివృద్ధి ఎక్కడా జరగలేదు చాలామంది ఓట్లకోసమే వైయస్ జగన్ పేదవాళ్లకు డబ్బులు అకౌంట్లలో వేశారంటారు. అది ముమ్మాటికీ తప్పు. నాలాంటి పేదోళ్ల పిల్లల్ని కొందరు మహానుభావులు ఆర్థికసాయం చేసి చదివించారంటే.. మేమేదో పెద్దయ్యాక రాజకీయ నాయకులవుతామని.. వారికి ఉపయోగపడతామని ఊహించి సాయం చేశారా..? కాదు. ఏ స్వార్థం లేకుండా డబ్బులిచ్చి ప్రోత్సహించారు. అంతేమాదిరిగా, ఏ స్వార్థం లేకుండా పేదలు వారి ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకుని బాగుపడతారని మానవత్వంతో.. ఆర్థిక అసమానతల్లో మార్పు తేవాలనే చిత్తశుద్ధితో వైయస్ జగన్ పేదల ఖాతాల్లో డీబీటీ రూపంలో ప్రభుత్వ సంక్షేమాన్ని జమచేశారు. ఇదే ఆయన లాజిక్. కూలోళ్ల పిల్లల్ని బడికి పంపాలంటే.. నీ కూలి డబ్బులు నేనిస్తా.. పిల్లల్ని పంపాలని అమ్మఒడి ఇచ్చాడు. నాడు నేడు కార్యక్రమంతో బడుల్ని బాగు చేసి మరీ.. ఆడపిల్లలకు టాయిలెట్లు కట్టించి, గవర్నమెంటు స్కూళ్ళలో అన్ని వనరుల్ని సమకూర్చా డు. పిల్లలకు స్కూల్‌బ్యాగుల దగ్గర్నుంచీ పుస్తకాలు, బెల్టులు, బూట్లు దాకా అన్నీ ఉచితంగా అందించాడు. ట్యాబ్‌లిచ్చి, స్మార్ట్‌క్లాసులు నడిపి ఇంగ్లీషు మీడియంతో నాణ్యమైన విద్యను పేదలకు అందించిన మహాను భావుడు వైయస్ జగన్. ఇలా వైయస్ జగన్ అందించిన మానవ నిర్మితం కంటే ఇండియా చరిత్రలోనే గొప్ప అభివృద్ధి జరగలేదు. నీ బతుకంతా రెవెన్యూలోటే.. సంపద సృష్టించిందెక్కడ బాబూ..? సంపద సృష్టిస్తాం అంటూ చంద్రబాబు చెబుతున్నాడే.. ఆయన ముఖ్యమంత్రి అయ్యినప్పటి నుంచీ దిగిన వరకు రాష్ట్రబడ్జెట్‌ను చూడండి. ప్రతీ బడ్జెట్‌లో రెవెన్యూ లోటు.. రెవెన్యూలోటు కనిపిస్తుంది. రెవెన్యూ లోటును చూపించేవాడివి.. ఎలా నువ్వు సంపదను క్రియేట్ చేయగలవు..? నా ఇంట్లో రూపాయి లేకుండా ఎలా నేను బిల్డింగ్ కడతాను..? నీ బతుక్కి ఎప్పుడూ రెవెన్యూలోటుతోనే బడ్జెట్ నడిపిస్తావు. సంపద అనేదే ఉండదు. మళ్లీ.. పేదలకు తెలియదని ఎన్నో ఊకదంపుడు ప్రసంగాలు చేస్తాడు. ఇంత మోసం చేస్తూ ఆయన రాజకీయ జీవితం మొత్తం బతుకుతూ వచ్చాడు. అర్బన్ ఓటర్లంతా బాబు మోసాల్ని గుర్తుంచుకోవాలి అర్బన్ ఓటర్లంతా చంద్రబాబు మోసం గుర్తుకుతెచ్చుకుని.. వైయస్ జగన్ ఇప్పటి వరకూ మిమ్మల్ని ఏం మోసం చేశాడో ఆలోచన చేయండి. వైయస్ జగన్ పేద, మధ్యతరగతి వర్గాలను అన్నివిధాలుగా పైకి తేవాలని పనిచేయడం తప్పా..? ఎవర్నీ మోసం చేయలేదు. దగా చేయలేదు. పెత్తందార్లకు ఆయన నచ్చడేమో.. కానీ, పేదలపాలిట ఆయన దేవుడు. మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ కూడా రైతులు, పేదల పట్ల దేవుడై నిలిచాడు కదా..? తాను ఎన్నికల్లో గెలిస్తే బ్యాంకుల్లో రుణాలు తీసుకుని అప్పులు కట్టలేని రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. అధికారంలోకి రాగానే రైతుల్ని రుణవిముక్తులను చేశాడు. అప్పుడు అందరూ ఆయన్ను అభినందించారు కదా.. మరి, అప్పుడాయన్ను ఏ ఒక్కరూ రైతులకు పప్పుబెల్లాల్లా పంచిపెట్టారని అనలేదుకదా..? వైయస్ జగన్ చేసింది ఇప్పుడు అదే. మానవనిర్మాణం.. ప్రభుత్వం అనేది ఒకటుందని పేదలను ఆదుకోవడానికి, వారిని అభివృద్ధిలోకి తేవడమే దాని బాధ్యత అని నిరూపించారు. చిరంజీవి ప్రజారాజ్యం అమ్మేసుకున్న బిజినెస్‌మెన్ పవన్‌కళ్యాణ్‌ను గెలిపించమని చిరంజీవి అన్నాడా..? ఎలా అంటాడండీ..? చిరంజీవి అనే వ్యక్తి ఒక బిజినెస్‌మేన్. ప్రజలంటే ఆయనకు లెక్కలేదు. సినిమాల్లో ఒకప్పుడు టాప్ మెగాహీరో. ఇప్పటికీ అలాగేనంటే సరే.. మరి, ఆయన ఒకప్పుడు ప్రజాసేవ చేస్తానని ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. ఆ పార్టీ తరఫున 18 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఎప్పుడైనా, ఆయన తన 18 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ సమస్యలున్నాయి. వాటిని తీర్చాలని ఆయన అన్నాడా..? అన్లేదు. ఆయన అలా చేసి ఉంటే, రాష్ట్రప్రజలెంతగా చిరంజీవిని నమ్మేవాళ్లు. ఆయనకు రాజకీయం, సినిమా ఒకటే రాజకీయం కూడా సినిమానే అనుకున్నాడు. డబ్బులు గానీ, అధికారం గానీ వస్తే చేద్దాం. లేకపోతే, ఐదేళ్లు ఖాళీగా ఉండాల్సిన ఖర్మేంటని 18 మంది ఎమ్మెల్యేలను అడ్డంగా అమ్మేసుకుని పోయాడు. ఆయన పక్కా పొలిటికల్ బిజినెస్ చేశాడు కనుక ప్రజలంటే లెక్కలేకుండా పార్టీని మూసేసుకున్నాడు. పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినందుకు ప్రతిఫలంగా రాజ్యసభ సీటు తెచ్చుకున్నాడు. కేంద్ర సహాయ మంత్రి అయ్యాడు. పోనీ, అక్కడైనా ఉన్నాడా..? అంటే, మళ్ళీ సినిమాలన్నాడు. ఆయన నిర్ణయం గుడ్. మంచిదే. ప్రజల్ని వెన్నుపోటు పొడిచి తమ్ముడ్ని గెలిపించమంటావా..? మరి, ఇప్పుడు మళ్ళీ మీకు, పవన్‌కళ్యాణ్‌ను అడ్డంపెట్టుకుని రాజకీయాలెందుకు..? ఏంటి మీ స్ట్రాటజీ..? జీవితంలో ఎప్పుడైనా నువ్వు ప్రజల దగ్గరకెళ్లొచ్చా..? మా తమ్ముడికి ఓట్లేసి గెలిపించండని ప్రజల్ని నువ్వు కోరుతావా..? ప్రజలకు వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా..? ముఖ్యంగా కాపు సోదరులకు వెన్నుపోటు పొడిచింది నిజం కాదా..? తప్పు తెలుసుకోని రాజకీయ అనర్హుడు చిరంజీవి మీరన్నా.. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆర్నెల్లైనా ప్రజల్ని నమ్మించారు. మీ తమ్ముడు జనసేన పార్టీని పెట్టి ఒక నెలరోజులు కూడా నమ్మించలేక పోయాడే..? ఏమో.. మోరల్స్, ఎథిక్స్‌లేని మీరు రాజకీయాల్లో ఏమైనా అవుతారేమో..., ఎందుకంటే, మీ దృష్టిలో గుర్రం ఎగరా వచ్చు. మీ కల నెరవేరదు. మీది తప్పుడు విధానం అన్నోడిని మాత్రం ల.. భాషతో ఇష్టానుసారంగా తిడతారు. బెదిరిస్తారు. ఒకసారి తప్పుచేసి ప్రజల ముందు దోషిగా నిలబడ్డ మీరు, మరోసారి అదే ప్రజలను ఏమీ కోరకూడదనే ఇంగితజ్ఞానం కూడా మీకు లేదు. ఎందుకంటే, మీకు మీరుచేసిన తప్పును తెలుసుకునే జ్ఞానం కూడా లేదు కాబట్టి.. నాలాంటోడు ప్రశ్నిస్తే.. మీకు కోపం వస్తుంది. సమాధానం చెప్పరు. ఎందుకంటే, మీరు రాజకీయాలకే అనర్హులు కాబట్టి..అనేది నా అభిప్రాయం.