<strong>మహిళలను మోసగిస్తున్న బాబు</strong>రుణమాఫీ విషయంలో లబ్దిదారుల సంఖ్యను రకరకాల కారణాలతో కుదించి రైతులను మోసగించినట్లే ఇపుడు డ్వాక్రా రుణమాఫీలోనూ లబ్దిదారులను కుదించి మహిళలకు మొండిచేయి చూపించాలని చంద్రబాబు పథకాలు పన్నుతున్నారు. రుణాలను సంపూర్ణంగా బేషరతుగా మాఫీ చేస్తానని అటు రైతులను, ఇటు డ్వాక్రా మహిళలను మభ్యపెట్టి అధికారానికి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఆ హామీలను అటకెక్కించేశారు. ప్రతి డ్వాక్రా మహిళకూ రు. 10 వేల సాయం అందిస్తామని ఇటీవలే చంద్రబాబు సర్కారు ఉత్తర్వులిచ్చింది. అయితే ఆర్ధికభారం తగ్గించుకోవడం కోసం లబ్దిదారుల సంఖ్యను కుదించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి రాష్ర్టంలో దాదాపు 91 లక్షల మంది మహిళలు డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉండగా అందులో 74 లక్షల మందినే రు. 10 వేల సాయానికి అర్హులుగా ఎంపిక చేశారు. అంటే మిగిలిన 17 లక్షల మంది మహిళలకు సాయంలో కోత విధించనున్నారన్నమాట. సంఘాల వారీగా ప్రభుత్వం ఇప్పటికే క జాబితాను రూపొందించింది. ఆ జాబితాను జిల్లాలకు పంపించారు కూడా. ఆధార్ సీడింగ్, డ్వాక్రా లావాదేవీల్లో క్రియాశీలకంగా లేని మహిళలను గుర్తించే ప్రక్రియ రెండు నెలలుగా కొనసాగుతున్నదని, వాటిలో తేలిన మేరకే తుది జాబితాను రూపొందించారని అధికారులు చెబుతున్నారు. అయితే జాబితా వెల్లడి కాగానే డ్వాక్రా మహిళలలో నిరసనలు వ్యక్తం కాకుండా ఉండడం కోసం చంద్రబాబు సర్కారు మరో ప్రణాళికను సిద్ధం చేసింది. డ్వాక్రా సంఘాల సమావేశాలలో అర్హులు, అనర్హుల జాబితాలకు ఆమోదం తెలుపుతూ తీర్మానాలు చేసేలా చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో నివాసం ఉండని వారు, చనిపోయినా సంఘాలలో సభ్యులుగా కొనసాగుతున్నవారి పేరిట 5 లక్షల పైచిలుకు సభ్యులను తొలగించారు. ఆధార్ అనుసంధానం ప్రక్రియలో 8 లక్షల మంది సభ్యులను తొలగించారు. ఆధార్ నమోదు చేసుకోని కారణంగా 3.5 లక్షల మందిని పక్కనపెట్టారు.