మైదుకూరులో పార్టీ కార్యాలయం ఆరంభం

మైదుకూరు:

వైయస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. విజయదశమి నాడు ఏర్పాటైన ఈ కార్యక్రమంలో పార్టీ  కన్వీనర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి బయటకు వస్తే తమకు మనుగడ ఉండదన్న భయంతో కుమ్మక్కై దుష్ట రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల చర్యలను ప్రజలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కేసీ కెనాల్ ఆయకట్టుకు ప్రభుత్వం క్రాప్‌హాలిడే ప్రకటించిందన్నారు. రైతుల పక్షాన దువ్వూరు నుంచి కడప వరకు రెండు రోజుల పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వంపై వత్తిడిని తెచ్చిన ఘనత వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీదేనన్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులతో కలసి కేసీ నీటి విడుదలపై సీఎంను కలసి విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ సీజన్ ఆరంభమైనప్పటికీ కేసీకీ నీరు విడుదల చేసే విషయంలో ఎలాంటి ప్రకటన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వివక్షత చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్ కోసం రెండు రోజుల పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దీక్ష చేపట్టారని, ప్రజల సమస్యలు తెలుకునేందుకు, అధికార, విపక్ష పార్టీల కుట్రలను ప్రజలకు వివరించేందుకు వైయస్‌ఆర్ కుమార్తె షర్మిల 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారన్నారు. ప్రజల కష్టాలు, కడగండ్లపై స్పందించే ఏకైక పార్టీ తమదేనని వారు తెలిపారు. వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేస్తే చాలు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. రాజశేఖర్‌రెడ్డి అడుగుజాడల్లో నడిచి రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని వారు తెలిపారు. వైయస్‌ఆర్ పాదయాత్రను చంద్రబాబు నాయుడు అనుకరిస్తున్నారని విమర్శించారు. ఒక మతాన్ని కించపరస్తూ వ్యాఖ్యలు చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికావల్సి వస్తుందని హితవు పలికారు. రానున్న కాలం వైయస్‌ఆర్‌సీపీదేనని, జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవుతారని, పేదలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ  నాయకులు ఇరగంరెడ్డి తిరుపాలురెడ్డి, డి శ్రీనివాసులురెడ్డి, మదీనా దస్తగిరిసాహెబ్, ధనపాలజగన్, శ్రీమన్నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top