వంశధార ప్రాజెక్టును మనమే పూర్తిచేద్దాం

నరన్నపేట (శ్రీకాకుళం జిల్లా) :

'వంశధార రెండవ దశ ప్రాజెక్టు పనులను మనమే పూర్తిచేద్దాం. రాజన్న కన్నకలలు నిజం చేద్దామ'ని మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చెప్పారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం నరసన్నపేట వైపు నడుస్తూ బ్రిడ్జి పైన నిలబడి నదిని ఆమె పరిశీలించారు. గతంలో వైయస్‌ఆర్ ఇచ్చిన హామీలు, నిధుల విడుదల గురించి నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదా‌స్ ఆమెకు వివరించారు. ‌కృష్ణదాస్ చెప్పిన మాటలు సావధానంగా విన్న శ్రీమతి షర్మిల మనం అధికారంలోకి రాగానే వంశధార నది రెండవ దశ పనులను పూర్తిచేద్దామని అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని 12 మండలాలకు చెందిన 104.24 కిలోమీటర్ల పొడవున వంశధార ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాలువ హిరమండలంలో ప్రారంభమై పలాస చివరి వరకు వెళుతుంది. 1,48,230 ఎకరాలకు సాగునీరు, 398 గ్రామాలకు తాగునీరు అందించేందుకు వీలుగా ఈ కాలువను డిజైన్‌ చేశారు. వరదలను తట్టుకొని కాలువ నిలబడేందుకు వీలుగా రెండవ దశ పనులు వైయస్ఆర్ హయాంలో ప్రారంభించారు. ప్రాజెక్టు ఎడమ కాలువ కింద నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట, హిరమండలం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, వజ్రపుకొత్తూరు, పలాస, ‌మెళియాపుట్టి మండలాలు ఉన్నాయి.

వరద కరకట్టల నిర్మాణం, కాలువ మరమ్మతులకు రూ. 933.90 కోట్లతో 2004-05లో ( 25-02-2005న జీఓ ఎంఎస్ నంబ‌ర్ 33 ప్రకారం) వై‌యస్ హయాంలో ఉత్తర్వులు జారీచేశారు. ఇందుకు గాను రూ. 636.59 కోట్లు ఖర్చు చేశారు. 2012 మే 15 నుం చి పను‌లను నిలిపివేశారు. వ్యయం పెరగడం, స్థానికుల నుంచి వ్యక్తమైన కొన్ని అభ్యంతరాలను అధికారులు ఉన్నతాధికారులకు పంపినప్పటికీ అనుమతి రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. వైయస్ఆర్ మంజూరు చేసిన రూ. 933 కోట్లు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పనులు జరిగితే ఒక ప్యాకే‌జ్ ద్వారా 25 వేల ఎకరాల ధాన్యం ఉత్పత్తికి, 20 వేల ఎకరాల చెరకు ఉత్పత్తికి దోహద పడుతుంది.

Back to Top