హైదరాబాద్: రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతలపై గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం ఉదయం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో కలిసి గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నేతలపై జరుగుతున్న దాడులపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.<br/>అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ నేతలపై జరుగుతున్న దాడులు, హత్యలపై సీబీఐతో విచారణ చేయించాలని గవర్నర్ను కోరినట్లు చెప్పారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...డీజీపీతో కలిసి వైఎస్ఆర్ సీపీ నేతలను హత్యలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.<br/>అనంతపురం జిల్లాలో ఏప్రిల్ 29న భూమిరెడ్డి శివప్రసాదరెడ్డిని దారుణంగా హతమార్చారని, ఎమ్మార్వో కార్యాలయంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ అధికారుల ప్రమేయంతో హత్య జరిగిందని వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వం, అధికారులతో కలిసి వ్యక్తలను ఏరివేసే అరాచకాన్ని ఆపాలని గవర్నర్కు వివరించినట్లు చెప్పారు. గత నెల మార్చి 31న జిల్లాలో సింగిల్ విండో అధికారి విజయ్ భాస్కర్ రెడ్డిని కూడా కిరాతకంగా హత్య చేశారన్నారు. అనంతపురం జిల్లాలో ఇప్పటివరకూ హత్యలు జరిగాయని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.