ఆరోగ్యశ్రీ పథకంలో కూడా కమీషన్లు దండుకుంటారా?


 – పేద ప్రజలపై చంద్రబాబుకు ఎందుకింత వివక్ష
– ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్‌ నిర్వీర్యం చేస్తోంది
– బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి
– చినబాబుకు కమీషన్‌ అందడం లేదని బకాయిలు నిలిపేశారట
– రూ.500 కోట్ల బకాయిలు చెల్లించేందుకు ఎందుకు మనసొప్పడం లేదు
– చంద్రబాబు అనవసర పర్యటనల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు
– దోమలు, ఎలుకల పేరుతో దోపిడీ 
– వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు
– వైయస్‌ జగన్‌ సీఎం కాగానే ఆరోగ్యశ్రీలో మెరుగైన సేవలు
హైదరాబాద్‌: పేదల ఆరోగ్య పథకంపై కూడా కమీషన్లు దండుకుంటారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందన్న దుర్భుద్దితో ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన బకాయిలు చెల్లించడం లేదని, చినబాబుకు కమీషన్లు అందడం లేదనే ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.  ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకంతో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైద్యం కోసం ఏ రాజకీయ నాయకుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఆస్తులు, బంగారు వస్తువులు తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, గుండెపై చేయి వేసుకొని హాయిగా ఉండండని, ప్రభుత్వమై కార్పొరేట్‌ వైద్యం అందిస్తుందని భరోసా కల్పించారన్నారు. అయితే మహానేత మరణాంతరం ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. మా నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాలుగున్నరేళ్లుగా ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారన్నారు.  చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. 108 వాహనం ఎక్కడుందో ఎవరికి తెలియడం లేదన్నారు. వేల వాహనాలను మూలన పడేశారన్నారు. 104 వాహనం పరిస్థితి అలాగే ఉందన్నారు.  బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యాలు సేవలను రద్దు చేస్తున్నామని ప్రకటించారన్నారు. కిమో థెరపీ, డయాలసిస్‌ తప్ప అన్ని సేవలను నిలుపుదల చేస్తున్నామని ఆసుపత్రులు పేర్కొన్నాయన్నారు. గతంలో ఎలాంటి జబ్బు వచ్చినా కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందే పథకాన్ని నిర్వీర్యం చేసినందుకు చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. రూ.500 కోట్ల బకాయిలు చెల్లించేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీలో  630కి పైగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఆసుపత్రుల్లో కోటి 30 లక్షల కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేయాల్సి ఉందన్నారు. వీరంతా వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్న చంద్రబాబు కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని, ధర్మపోరాట దీక్షల పేరుతో పబ్లిసిటీ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని  విమర్శించారు. పేదవారి వైద్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీపై ఎందుకంత నిర్లక్ష్యమని ధ్వజమెత్తారు. 
ఉద్యోగులు, పెన్షనర్లు కడుతున్న  ఇన్సూరెన్స్‌ రూ.200 కోట్లకు పైగా వస్తుందని, మిగిలిన రూ.200 కోట్లు చెల్లించి వారికి వైద్య సేవలందించాల్సిన హక్కును కూడా చంద్రబాబు బకాయిలు చెల్లించకపోవడంతో వైద్యం అందడం లేదన్నారు. చిన్నబాబుకు కమీషన్లు అందకపోవడంతోనే ఆసుపత్రులకు రూ.500 కోట్ల బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. ఆయన ఎక్కువగా డిమాండు చేశారనో, చెప్పింది చేయకపోవడంతోనే బకాయిలు చెల్లించడం లేదన్నారు. గతంలో కూడా పెద్ద పెద్ద యంత్రాలు కొంటున్నామని కోట్లాది రూపాయలు దోచుకున్నారన్నారు. ఇందులో కమీషన్లు చిన్నబాబుకు చాలక ఈ రోజు ఆసుపత్రులకు బకాయిలు నిలిపివేశారన్నారు. పేదలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ పథకంలో కూడా కమీషన్ల కోసం ఇంత మక్కువ ఏంటని, ఇంత దౌర్భగ్య పరిస్థితి ఎందుకని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపివేసినా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న 1995– 2004 పరిస్థితులు ఎలా ఉన్నాయో అదే పరిస్థితి ఇప్పుడు దాపురించిందన్నారు. అప్పట్లో ప్రమాదాలకు గురై రోడ్లపైనే చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకునేది కాదన్నారు. మారుమూల ప్రాంతాల్లో ప్రసవాలు కష్టంగా ఉండేవన్నారు. ఇలాంటి పరిస్థితులను దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మార్చారన్నారు. చంద్రబాబుకు మంచి పనులు చేయడం చేతకాదు కానీ, చేసిన మంచి పథకాలను ఎప్పుడు నిర్వీర్యం చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన అన్నారు. దోమలపై దండయాత్ర అంటూ ప్రచారం చేసి అందులో కూడా కమీషన్లు దండుకున్నారన్నారు. ఆసుపత్రుల్లో ఎలుకలు ఉన్నాయని మేం అనేకసార్లు చెబితే..ఎలుకల పేరు చెప్పుకొని దోపిడీ చేశారన్నారు. ఓడీఎఫ్‌ పేరుతో టీడీపీ ప్రభుత్వం దోచుకుందన్నారు. రియల్‌ టైం గవర్నెస్‌ అంటున్న చంద్రబాబుకు ప్రజల ఇబ్బందులు కనిపించవా అని ఫైర్‌ అయ్యారు. రోమ్‌ నగరం తగులబడుతుంటే చక్రవర్తి ఫిడెల్‌ వాయించినట్లుగా చంద్రబాబు ఇంట్లో కూడా కూర్చోకుండా చెన్నై, బెంగుళూరు, రాజస్థాన్, కల్‌కత్తా తిరుగుతున్నారన్నారు. రాష్ట్రంలో దారుణమైన సమస్యలు నెలకొన్నాయన్నారు. మరోపక్క పెథాయ్‌ తుపాన్‌తో ప్రజలు భయంతో వణికిపోతుంటే చంద్రబాబు అర్థరాత్రి సమీక్షలు అంటూ పగలు పూట ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ఈ రాష్ట్రంపై, ఇక్కడి ప్రజలపై ఉన్న చిత్తశుద్ధి, నిబద్ధత అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఒక్కప్పుడు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ అంటే పేదవాడు ఆసుపత్రికి  వెళ్లి దండం పెట్టుకునే వారని గుర్తు చేశారు. ఈ రోజు రాజీవ్‌ ఆరోగ్యశ్రీని చంద్రన్న అవినీతి పథకంగా మార్చేశారని దుయ్యబట్టారు. వరుస మూడు నెలలు రేషన్‌ తీసుకోకపోతే ఆరోగ్యశ్రీ లేదని షరత్తులు పెట్టడం దుర్మార్గమన్నారు. వందలాది మంది మృత్యువాత పడుతున్న లెక్కలేని తనంతో చంద్రబాబు ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ వర్తించదని పేర్కొనడం దారుణమన్నారు. పేద ప్రజలు కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి ఇబ్బందులను గమనించిన మా పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారన్నారు. పేదవాడి వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఎక్కడికి వెళ్లినా ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చినట్లు చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీలో మెరుగైన సేవలందిస్తామన్నారు. మంత్రికి పంటి నొప్పి వస్తే సింగపూర్‌లో ప్రజల డబ్బుతో వైద్యం చేయించేందుకు జీవోలు విడుదల చేస్తారా అని నిలదీశారు. ఈ ప్రభుత్వానికి పేదవాడి ఆరోగ్యం పట్టడం లేదని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డికి పేరొస్తుందన్న దుర్భుద్దితో ఆరోగ్యశ్రీ పథకం బకాయిలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పథకాన్ని నిర్వీర్యం చేసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండు చేశారు.




 
Back to Top