కృష్ణా జిల్లా: తాను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి శిష్యుడినని, ప్రాణం ఉన్నంత వరకు వైయస్ జగన్ వెంటే ఉంటానని ఎమ్మెల్యే మేక ప్రతాప్ అప్పారావు పేర్కొన్నారు. ఎంతో మంది అడ్డుపడినా త్రిపుల్ ఐటీని నూజివీడులో స్థాపించిన ఘనత వైయస్ రాజశేఖరరెడ్డిదే అన్నారు. సముద్రం 75 కిలోమీటర్లు ఉన్నా..వైయస్‌జగన్ రాకతో నూజివీడు జనసంద్రమైందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి నాలుగు సార్లు నూజివీడుకు వచ్చారన్నారు. త్రిబుల్ ఐటీ కాలేజీని ప్రారంభించేందుకు వైయస్ రాజశేఖరరెడ్డి వచ్చారని గుర్తు చేశారు. నూజివీడు పట్టణానికి మంచినీరు ఇచ్చేందుకు కృష్ణానది నుంచి సరఫరా చేయించిన ఘనత మహానేతదే అన్నారు. నూజివీడులో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటల్లిందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వర్షాలు కురవడం లేదని తెలిపారు. మామిడి రైతులను ఆదుకోవాలని వైయస్ జగన్‌ను కోరారు. రాబోయే కాలంలో వైయస్ జగన్ సీఎం కావడం తధ్యమని, సూర్యుడిని అరచేతిని అడ్డుపెట్టి ఆపలేరని తెలిపారు. వైయస్ జగన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాను ఎదురించిన ధీరుడని, పులి ఎప్పుడు పారిపోదని చెప్పారు. పులి కడుపున పులే పుడుతుందని చెప్పారు. కక్షతో సోనియాగాంధీ కేసులు పెట్టించిందని, ఇప్పుడు ఆమె ఎక్కడుందో ఎవరికి తెలియదన్నారు. వైయస్ జగన్ 150 సీట్లకు పైగా సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 30 ఏళ్లు సీఎంగా వైయస్ జగన్ కొనసాగుతారని దీమా వ్యక్తం చేశారు. మన కష్టాలు కొద్ది రోజులే అని, టీడీపీతో పోరాడుదామని పిలుపునిచ్చారు. రాత్రిళ్లు ఫ్లెక్సీలు చించడం తప్ప టీడీపీ నేతలు ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు. టీడీపీని బంగాళఖాతంలో కలిపేద్దామని పిలుపునిచ్చారు. నూజివీడును రాజధాని చేస్తామని మాట చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారన్నారు. ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని వైయస్ జగన్‌ను కోరారు.