తాడేపల్లి: ‘‘ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని, చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను సైతం లెక్క చేయకుండా నా కోసం గంటల కొద్దీ రోడ్డుపై సహనంతో నిరీక్షించారు. మీరు నాపై చూపిస్తున్న ఆప్యాయతకు, వెలకట్టలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ కోసమే, మీతోనే నా ప్రయాణం’’ అంటూ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. వినుకొండ పర్యటనకు వచ్చిన వైయస్ జగన్‌కి గుంటూరు, పల్నాడు జిల్లాల ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. తాడేపల్లి నుంచి వినుకొండకు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఏడున్నర గంటలు పట్టిందంటే ప్రజల స్పందన ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. రెండు రోజుల కిందట హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న జగన్‌కు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. నరసరావుపేట నియోజకవర్గంలో జోరువానలోనూ జనం ఎదురు చూశారు. గ్రామ గ్రామాన అపూర్వ స్వాగతం పలికారు. బసికాపురం, ఎస్‌ఆర్‌కెటి జంక్షన్, ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం మీదుగా వైయస్ జగన్ కాన్వాయ్ బాపట్ల జిల్లా సంతమాగులూరు చేరుకుంది. సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద వేలాది మంది అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలు స్వాగతం పలికారు.