"నారా"యణ నియమాల ఉల్లంఘన

క్రిమినల్  కేసు దాచిపెట్టి
పవర్ ను పట్టి..ఎన్నికల నియమావళి ఉల్లంఘన
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న ప్రోబ్

హైదరాబాద్:
ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఎన్నికల నియమావళిని
ఉల్లంఘించిన వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. శాసనమండలి సభ్యునిగా
ఎన్నికల నామినేషన్ పత్రంలో తప్పుడు సమాచారాన్ని దాఖలు చేయడం తాజాగా దుమారం
రేపుతోంది. క్రిమినల్ కేసులు నమోదై ఉన్నప్పటికీ నారాయణ వాటిని దాచిపెట్టి
ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించారన్నది ప్రధాన అభియోగం. 2010 లో కాపీరైట్
చట్టాన్ని ఉల్లంఘించి పుస్తకాలు ముద్రించి విక్రయించినందుకు ప్రభుత్వ సంస్థ
అయిన తెలుగు అకాడమీ.. నారాయణ విద్యాసంస్థల గ్రూపు అధిపతిగా ఉన్న నారాయణ పై
హైదరాబాద్‌లోని నారాయణగూడలో క్రిమినల్ కేసు (క్రైమ్‌నెంబర్ 356) నమోదు
చేసింది.
 
ఇంటర్ తదితర కోర్సులకు సంబంధించి
పాఠ్యపుస్తకాల ముద్రణ బాధ్యత తెలుగు అకాడమీకి ఇంటర్ బోర్డు  అప్పగించింది.
2008-09 లో ఫిజిక్సు, కెమిస్ట్రీ, మేథమెటిక్స్, బోటనీ, జువాలజీ,
పాఠ్యపుస్తకాల ముద్రణ, పంపిణీ బాధ్యతను తెలుగు అకాడమీకి ఇచ్చింది. కాపీరైట్ చట్టం ప్రకారం స్టడీ మెటీరియల్, పుస్తకాల ముద్రణ బాధ్యత మొత్తం
తెలుగు అకాడమీదే. కానీ నారాయణ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న ఎం/ఎస్ నిషిత
మల్టీమీడియా ఇండియా ప్రయివేటు లిమిటెడ్ సంస్థ అక్రమంగా తెలుగు అకాడమీకి
చెందిన స్టడీ మెటీరియల్‌లోని అనేక అంశాలను కాపీ చేసి పుస్తకాలను
పునర్ముద్రించి పంపిణీ చేయించింది. ఇలా ముద్రించడం ఇండియన్ కాపీరైట్‌
చట్టం-1957 ప్రకారం నేరం. 
 
క్రిమినల్ కేసులో ఏ1గా నారాయణ 
తెలుగు
అకాడమీ అప్పటి మేనేజర్ నారాయణగూడ పోలీసు స్టేషన్లో నిషిత మల్టీమీడియా
ఇండియా ప్రయివేటు లిమిటెడ్ సంస్థపై క్రిమినల్ కేసు పెట్టారు. అందులో ఏ1గా
పొంగూరు నారాయణ, ఏ2 గా పొంగూరు దేవి, ఏ3 గా పొంగూరు సింధూరలను
పేర్కొన్నారు. కేసు విచారణకు రాకుండా నారాయణ తన పలుకుబడిని ఉపయోగించి
అడ్డుకుంటున్నారు. దీనిపై  నారాయణ అప్పట్లో హైకోర్టును ఆశ్రయించినా కోర్టు
ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయలేదు. అయినా పోలీసులు ఈ కేసు విచారణను
చేపట్టలేదు. గత ఏడాది ఆగస్టు 6న నారాయణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానానికి
ఎంపిక చేసినపుడు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అఫిడవిట్ దాఖలు చేశారు.
 

సందర్భంగా అభ్యర్థికి సంబంధించి గతంలో ఏమైనా కేసులుంటే వాటిని అఫిడవిట్‌లో
స్పష్టంగా పేర్కొనాలి.  క్రిమినల్ కేసులు నమోదై ఉన్నా, శిక్షలు పడి ఉన్నా
ఆయా కేసులకు సంబంధించిన వివరాలను ఫారం-26 (రూల్-4ఏ)లో పొందుపర్చాలి. నారాయణ
మాత్రం తనపై నారాయణగుడ పోలీసు స్టేషన్లో ఉన్న కేసు గురించి ఆ అఫిడవిట్‌లో
పొందుపర్చలేదు. తనపై ఉన్నకేసులను తెలియపర్చకున్నా, తప్పుడు సమాచారాన్ని
ఇచ్చినా ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలి.
దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని ప్రోబ్ అనే సంస్థ నిర్ణయించింది.
నారాయణపై చర్యలు తీసుకోవాలని,  క్రిమినల్‌ కేసు విచారణ చేపట్టి తగిన శిక్ష
విధించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతోంది.
Back to Top