అమరావతి: రాష్ట్రంలో మహిళలు, పిల్లలపై అత్యాచారాలు, హత్యలు , దాడులకు సంబంధించి రోజుకు సగటున 48 కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం వచ్చిన జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 7,393 కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వమే స్వయంగా శాసనసభలో వెల్లడించిన లెక్కలివి. శాసనసభలో వైయస్ఆర్‌సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వం అధికారికంగా ఈ వివరాలు వెల్లడించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటినుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మితిమీరిపోయాయి. నిత్యం లైంగికవేధింపులు, హత్యాచారం, హత్య ఘటనలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలే లైంగికవేధింపులు, అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు సైతం వెలుగు చూశాయి. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయకుండా నిందితుల పక్షానే నిలబడుతున్న ఘటనలు అనేకం. కొన్ని సందర్భాల్లో బాధితులు రాజీ పడాలంటూ బెదిరింపులకు సైతం దిగుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణే లేకుండాపోయింది. ఆ ఆరోపణలను ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు బలపరుస్తున్నాయి. బయటకిరాని కేసులు మరెన్నో ఉన్నాయన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. జూన్ నుంచి రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరిగిన అఘాయిత్యాల్లో కొన్ని.. » సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ముస్లిం బాలికను అపహరించి హత్యకు పాల్పడ్డారు. నాలుగు రోజుల తరువాత బాలిక ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆ చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో చిన్నారి అదృశ్యమైన రోజే తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, ఆ బాలికను రక్షించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. విచారణ సరిగా చేయకపోవడంతో బాలిక ప్రాణాలే పోయాయి. సమీపంలోని అనుమానిత ప్రాంతాల్లో వెదకడంలోనూ పోలీసులు విఫలమయ్యారు. » ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. » అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడితో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ కుటుంబం ఆందోళన చేయడంతో ఎనిమిది రోజుల తర్వాత ఆగస్టు 2న పోలీసులు కేసు నమోదు చేశారు. » శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె జూన్ 14న మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దాంతో పోలీసులు జూన్ 16న కేసు నమోదు చేశారు. »కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్ రూమ్‌లలో రహస్య కెమెరాలతో విద్యా ర్థి నుల వీడియోలు తీసిన ఘటనతో యావత్ రాష్ట్రం హడలెత్తిపోయింది. వందలాది విద్యా ర్థి నులు అర్ధరాత్రి ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. అంతటి తీవ్రమైన ఉదంతాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేసింది. » నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో ఓ చిన్నారిని అపహరించుకునిపోయి అత్యాచారం చేసి హత్య చేసినా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. నేటికీ ఆ చిన్నారి మృతదేహం ఆచూకిని పోలీసులు కనిపెట్టలేకపోయారు. » సీఎం బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం పరిధిలో కామాంధులు అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.