అమరావతి : రాష్ట్ర ప్రజలకు మరో పిడుగులాంటి వార్త. ఇప్పటికే కరెంట్ ఛార్జీలతో ఎడాపెడా బాదేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు ఇప్పుడు మరో భారీ బాదుడుకు కొరడా ఝుళిపిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధంచేసింది. తద్వారా ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని మోపేందుకు చకచకా ఏర్పాట్లుచేస్తోంది. సాధారణ రివిజన్‌లో భాగంగా 20 శాతం మాత్రమే పెరుగుదల ఉంటుందని పైకి చెబుతున్నా దానికన్నా రెండు రెట్లు ఎక్కువ ఉండేలా భూముల విలువలను సవరించేందుకు చాపకింద నీరులా కసరత్తు జరుగుతోంది. భూముల క్లాసిఫికేషన్ల ప్రకారం కాకుండా వాటిని మార్చి అందులో రెండో విలువను జోడించడం ద్వారా దొడ్డిదారిన ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎత్తుగడ వేశారు. ఇందుకోసం కొత్తగా లేయర్లు, గ్రిడ్ల విధానాన్ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో భూములను పలు రకాలుగా వర్గీకరించారు. వ్యవసాయ భూమి అయితే మెట్ట, మాగాణి, కన్వర్షన్ చేసిన భూమి.. ఇళ్ల స్థలాలు, జాతీయ రహదారుల ఆనుకుని ఉన్న భూమి.. ఇలా పలు రకాలుగా విభజించారు. ఉదా.. ఒక ఏరియాలో మెట్ట భూముల విలువ రూ.5 లక్షలుగా, మాగాణి భూముల విలువ రూ.10 లక్షలుగా నిర్థారిస్తారు. ఎప్పుడైనా మార్కెట్ విలువలను వాటి ప్రకారమే పెంచడం ఆనవాయితీ. కానీ, ఇప్పుడు ఆ క్లాసిఫికేషన్లను మారుస్తున్నారు. రూ.5 లక్షలున్న మెట్ట భూమిలో ఒకచోట రూ.5 లక్షలు, దీని పక్కనే ఉన్న దానికి రూ.7 లక్షలు నిర్ణయిస్తున్నారు. అంటే.. ప్రతీ క్లాసిఫికేషన్‌లోనూ కొత్తగా రెండో రేటును ప్రవేశపెడుతున్నారు. అలాగే, జాతీయ రహదారి పక్కనున్న భూములకు ఒక క్లాసిఫికేషన్, వాటి వెనుక లోపలున్న భూములను మరో క్లాసిఫికేషన్‌లో పెడుతున్నారు. దీనికి కొత్తగా ‘లేయర్’ విధానమని పేరు పెట్టారు. ఈ విధానంలో ఒకే ప్రాంతంలోని రోడ్డుపై ఉన్న భూమికి ఒక రేటు, దానికి అనుకుని ఉన్న భూమికి మరో రేటు, వాటి వెనకున్న వాటికి మరో రేటు నిర్ణయిస్తున్నారు. అలాగే, అర్బన్ ప్రాంతాల్లోనూ క్లాసిఫికేషన్లు మార్చి రోడ్ల పక్కనున్న స్థలాలకు ఒక రేటు, సందుల్లో వాటి వెనుకున్న స్థలాలకు మరో రేటు నిర్ణయిస్తున్నారు. ఇక వాణిజ్య స్థలాలకు సంబంధించిన క్లాసిఫికేషన్లను రకరకాలుగా మార్చి గ్రిడ్లు, లేయర్లు పెడుతున్నారు. ఒక ఏరియాలోనే గతంలో మాదిరిగా ఒక క్లాసిఫికేషన్‌లో ఉన్న భూమికి ఒక రేటు కాకుండా ప్రతీదాని రేటును మార్చేస్తున్నారు. తద్వారా ఒకే ప్రాంతంలో ఉన్న భూమి మార్కెట్ విలువను వీలును బట్టి రెండు, మూడు రకాలుగా పెంచుతున్నారు. 50–60 శాతం పెరిగే అవకాశం.. ఇలా చేయడంవల్ల ప్రజల నెత్తిన మోయలేని భారం పడనుంది. దాదాపు ప్రతి వ్యవసాయ, నివాస, వాణిజ్య భూములతోపాటు అర్బన్ ప్రాంతాల్లోని అన్ని స్థలాల మార్కెట్ విలువలు అమాంతం పెరిగిపోనున్నాయి. ఏరియా ప్రాతిపదికన కాకుండా సంబంధిత భూమి ప్రాతిపదికన రేటు పెట్టడంతో అన్ని భూముల విలువలకు రెక్కలు రానున్నాయి. దీంతో.. ప్రస్తుతమున్న మార్కెట్ విలువలు 50–60 శాతం పెరగనుండడంతో క్రయవిక్రయాలు జరిగినప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీల వడ్డన భారీగా ఉండనుంది. పైకి మాత్రం ఇది కేవలం 20 శాతం మాత్రమే పెరుగుదల ఉంటుందని చెబుతున్నా క్లాసిఫికేషన్లు మార్చడం ద్వారా ఈ బాదుడు భారీగా ఉండనుంది. అన్ని జిల్లాల్లో దాదాపు కసరత్తు పూర్తి.. ఇక ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే అన్ని జిల్లాల్లో చాలావరకు పూర్తయింది. రెండు నెలలుగా రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్లతో వారం, వారం సమీక్షలు జరిపి ఎలా చేయాలి, ఎంత పెంచాలో దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామ, ఏరియా మ్యాప్ తీసుకుని దాని ఆధారంగా రేట్లు పెంచేశారు. గ్రిడ్లు, లేయర్ల విధానంవల్ల కొన్నిచోట్ల ఇబ్బంది వస్తుందని కిందిస్థాయిలో అభ్యంతరాలు వచ్చినా లెక్కచేయలేదు. ప్రతీ భూమి విలువను పెంచాలి్సందేనని ఆదేశాలు అందడంతో అందుకనుగుణంగా సబ్ రిజిస్ట్రార్లు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ భారం ప్రజలపై వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక ఒక పక్క వర్షాలు, వరదలతో జనం అల్లాడుతుంటే మార్కెట్ విలువలు పెంచడం ద్వారా ప్రజల నెత్తిపై ఇంకా భారాలు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.