హామీలు అమలు చేయమంటే అరెస్టులా?

అవినీతిని ప్రశ్నిస్తే వేధింపులా?

కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి , ఎస్సీ సెల్ అధ్యక్షు సుధాకర్ బాబు.

పోలీసులు రాజకీయ ప్రలోభాలకు లొంగవద్దు.

అత్యుత్సాహం ప్రదర్శిస్తే వదిలిపెట్టేదిలేదు.

న్యాయపరంగా పోరాటం చేస్తాం.  

వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల‌కు పార్టీ అండ‌గా ఉంటుంది.

వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై పెట్టిన అసభ్య పోస్టుల వివరాలిస్తాం.

వారిపై కేసులు నమోదు చేసి నిజాయితీ నిరూపించుకొండి.

చెత్తబుట్టలో వేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు.

మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు హెచ్చరిక. 

తాడేప‌ల్లి: ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌మ‌ని అడిగినందుకో, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకో సోష‌ల్ మీడియా కార్యక‌ర్త‌ల‌ను అరెస్ట్ చేస్తూ, ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికి విఘాతం క‌లిగిస్తున్న అధికారులందరిపై కంటెమ్ట్ ఆఫ్ కోర్టు కింద కేసులు వేసి న్యాయ‌స్థానాల్లో పోరాడుతామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ అధ్య‌క్షుడు మ‌నోహ‌ర్‌రెడ్డి హెచ్చ‌రించారు. వీటిపై అవ‌స‌ర‌మైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్ర‌యిస్తామ‌ని తెలిపారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ఆయన... వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల‌ను అర్థరాత్రి అరెస్ట్ చేసి వేధించ‌డంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. సోషల్ మీడియా కార్యకర్తలు పోలీసులకు దొరకని సందర్భాల్లో వారి కుటుంబ స‌భ్యుల‌ను  తీసుకెళ్లి బెదిరిస్తూ, కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర డీజీపీ సైతం రాజ‌కీయ నాయ‌కుడి మాదిరిగా ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడ‌టంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వ‌ర్రా ర‌వీంద్ర‌రెడ్డి విష‌యంలో జిల్లా ఎస్పీని ట్రాన్స‌ఫ‌ర్ చేసిన ప్రభుత్వం... తాము చెప్పినట్లు వినకపోతే ఎస్పీలను సైతం బదిలీ చేస్తూ వారి స్థానాల్లో నాన్ కేడ‌ర్ ఎస్పీల‌ను వేస్తామ‌ని బెదిరింపుల‌కు గురిచేస్తున్నారని తెలిపారు.  పోలీస్ వ్య‌వ‌స్థ  రాజ‌కీయ ప్ర‌లోభాల‌కు లొంగి ప‌నిచేస్తే సామాన్యుల‌కు పోలీసుల‌పై ఎలా న‌మ్మ‌కం ఏర్ప‌డుతుందని  ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ ఒత్తిడికి లొంగి పోలీస్ వ్య‌వ‌స్థ ప‌నిచేస్తున్నందునే శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా గాడిత‌ప్పాయ‌ని  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్లు వేశాం 
నాలుగు రోజుల క్రితం చిల‌క‌లూరిపేట నియోజ‌వ‌ర్గానికి చెందిన పెద్దింటి సుధారాణి అనే మ‌హిళా కార్య‌క‌ర్త‌ను, భర్త పిల్లలతో సహా అరెస్టు చేసిన పోలీసులు... వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నారని మనోహర్ రెడ్డి మండిపడ్డారు. 
దీనిపై హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్ వేసి ప‌ల్నాడు ఎస్పీ కె. శ్రీనివాస‌రావుతో సహా  అక్క‌డ డీఎస్పీ సీఐల‌ను పార్టీలుగా చేర్చామ‌ని చెప్పారు. ఈ విష‌యం తెలిసి మ‌రో నాలుగు త‌ప్పుడు కేసులు ఆమెపై పెట్ట‌డానికి సిద్దపడుతున్నారని ఆక్షేపించారు. 

మ‌రో కేసులో అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటికి చెందిన కె హన్మంత‌రెడ్డిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని, ఎక్క‌డున్నాడో కుటుంబ స‌భ్యుల‌కు చెప్ప‌క‌పోవడంతో ఎస్పీ విద్యాసాగ‌ర్ నాయుడును ప్రైవేటు పార్టీగా చేర్చి హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్ వేశామ‌న్నారు. దీంతో హన్మంతరెడ్డి మదనపల్లెలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారన్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను, అవినీతిని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్నించిన వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌లు ఒక్కొక్కరిపై నాలుగైదు కేసులు బ‌నాయించి, సుప్రీంకోర్టు నిబంధ‌న‌ల‌కు భిన్నంగా 41ఏ నోటీసులు ఇవ్వ‌కుండా వేధించి పై అధికారుల మెప్పు పొందాల‌ని చూస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.  

మా ఫిర్యాదుల‌ను కూడా స్వీక‌రించండి..
ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్నించిన వారిని అరెస్ట్ చేయడం రాజ్యాంగం క‌ల్పించిన భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను హ‌రించ‌డమేన‌ని మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాక‌ర్ బాబు  ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ వ్య‌వ‌స్థ సైతం వారికి వ‌త్తాసు ప‌ల‌క‌డాన్ని ఆయ‌న ఆక్షేపించారు. వైఎస్సార్సీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. కార్య‌క‌ర్త ఒంటి మీద చేయి వేసినా, అక్ర‌మంగా కేసు పెట్టినా ఊరుకునేది లేద‌ని తెలిపారు. అలా పోలీసులు వేధింపులకు గురైన వారు ఆ వివ‌రాల‌ను పార్టీ  సూచించిన నెంబ‌ర్లకు స‌మాచారం అందించాల‌ని కోరారు.

వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌తోపాటు, పార్టీ మ‌హిళా నాయ‌కులపై టీడీపీ శ్రేణులు పెట్టిన అస‌భ్య పోస్టుల వివ‌రాల‌తో వ‌స్తామ‌ని వాటిపై కూడా కేసులు న‌మోదు చేసి డీజీపీ నిజాయ‌తీని నిరూపించుకోవాల‌ని సుధాక‌ర్ బాబు డిమాండ్ చేశారు. అందుకు సంబంధించిన సాక్ష్యాల‌ను పార్టీ లీగ‌ల్ సెల్ ద్వారా పోలీసుల దృష్టికి తీసుకొస్తామ‌ని, ఒక‌వేళ వాటిని చెత్త‌బుట్ట‌లో ప‌డేస్తే అందుకు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

Back to Top