అద్దంలా అంకెలు.. అబద్ధాల రంకెలు!

నీతి ఆయోగ్‌ నివేదికలపై చంద్రబాబు తనదైన రీతిలో వక్రభాష్యాలు

ఈ ఆర్థిక ఏడాది ఇప్పటికే రూ.73 వేల కోట్లకుపైగా అప్పులు

రాజధాని అమరావతి అప్పులు దీనికి అదనం..

మూలధన వ్యయం కేవలం రూ.8,894.98 కోట్లే 

పోర్టులు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను సైతం ప్రైవేట్‌పరం చేస్తున్న బాబు

హామీలను ఎగ్గొడుతూ నిస్సిగ్గుగా గత ప్రభుత్వంపై నిందలు

మూలధన వ్యయం, సామాజిక రంగాలపై వ్యయం, సొంత పన్నుల రాబడి వైఎస్సార్‌సీపీ హయాంలోనే అధికం  

అమరావతి: బటన్‌ నొక్కి డీబీటీ ద్వారా నేరుగా రూ.2.73 లక్షల కోట్లకుపైగా ప్రజలకు పారదర్శకంగా అందించిన పాలకుడు విధ్వంసకారుడా? లేక ఐదేళ్లలో ఏమీ చేయకుండా మాటలతో మభ్యపుచ్చి సింగపూర్‌ గ్రాఫిక్స్‌ చూపించిన నాయకుడు విధ్వంసకారుడా? ఇచ్చాపురం నుంచి హిందుపురం దాకా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సచివాలయాలు, పది ఉద్యోగాలు, ఆర్బీకేలు, ఆస్పత్రులు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు తీసుకొచ్చిన వ్యక్తి విజన్‌ ఉన్న లీడరా? లేక 14 ఏళ్లు పాలించినా.. ఆంధ్రప్రదేశ్‌లోని 14 వేల పంచాయితీల్లో ఏ ఊరికి వెళ్లినా.. ఏ ఒక్క పథకమూ గుర్తు రాకుండా.. నాది అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న వారికి విజన్‌ ఉన్నట్లా?

ఒక ఆర్థిక వ్యవస్థ బాగుందని చెప్పేందుకు మూలధన వ్యయం, అప్పుల వృద్ధి తీరును కొలమానంగా పరిగణిస్తారు. ఆ లెక్కలన్నీ చూశాక ఆర్థిక క్రమశిక్షణతో ఎవరు పాలన సాగించారో ప్రతి ఒక్కరూ చెబుతారు. సూపర్‌ సిక్స్‌ హామీలను ఎగ్గొట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న సీఎం చంద్రబాబు వైఎస్సార్‌ సీపీ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ ఆరోపణలకు దిగారు. కానీ ‘కాగ్‌’ లెక్కలు, అధికారిక గణాంకాలను ఎవరూ దాచిపెట్టలేదు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టించడమంటే బాదుడే.. బాదుడు! 

ఆయన అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్తు చార్జీల భారాన్ని ప్రజలపై మోపారు. భావి తరాల కోసం గత ప్రభుత్వం సృష్టించిన విలువైన సంపద లాంటి మెడికల్‌ కాలేజీలు, పోర్టులను ప్రైవేట్‌కు బేరం పెడుతున్నారు. ఇవన్నీ దాచిపెట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కన్నార్పకుండా అబద్ధాలు వల్లిస్తున్నారు. 2023–24లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అత్యధికంగా మూలధన వ్యయం చేసిందని, అయితే దాన్ని వదిలేసి చంద్రబాబు ప్రజెంటేషన్‌ ఇవ్వడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు చేయాల్సిన పని కాదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

గతంలో చంద్రబాబు హయాంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో తక్కువగా అప్పులు చేయడమే కాకుండా మూలధన వ్యయం అధికంగా చేసింది. 2022–23లో వైఎస్సార్‌సీపీ రూ.67,985 కోట్లు అప్పు చేసి మూలధన వ్యయం రూ.7,244 కోట్లు మాత్రమే చేసిందని చంద్రబాబు తప్పుబట్టారు. మరి ఈ ఆర్థిక ఏడాదిలో రూ.73,635.92 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు మూలధన వ్యయం కేవలం రూ.8,894.98 కోట్లే చేసిన విషయాన్ని ఎందుకు దాచి పెడుతున్నారు?

⇒ వైయ‌స్ఆర్‌సీపీ పాలనకు సంబంధించి ఐదేళ్ల గణాంకాలు కాకుండా నాలుగేళ్ల లెక్కలతో సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే సామాజిక రంగంలో వైఎస్సార్‌సీపీ రెట్టింపు మూల ధన వ్యయం చేసింది. ఇక జీఎస్‌డీపీ వృద్ధి కన్నా వడ్డీ చెల్లింపుల వృద్ధి  పెరిగిందని చంద్రబాబు చెప్పారు. టీడీపీ గత ఐదేళ్ల పాలనలో జీఎస్‌డీపీలో అప్పుల సగటు వార్షిక వృద్ధి 17.51 శాతం ఉండగా జీఎస్‌డీపీ సగటు వార్షిక వృద్ది 13.48 శాతమే ఉందనే విషయాన్ని చంద్రబాబు చెప్పకుండా వదిలేశారు. అంటే 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో అప్పులు తీర్చే స్థోమత లేకుండా చేశారు. బాబు గత పాలనలోనే జీఎస్‌డీపీ వృద్ధి కన్నా వడ్డీల చెల్లింపు, అప్పుల వృద్ధి ఎక్కువగా ఉంది. 

⇒ 2019లో వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చే నాటికే అప్పులు తీర్చే పరిస్థితి సున్నాగా ఉందనే విషయాన్ని చెప్పకుండా చంద్రబాబు తనకు అనుకూలంగా అవాస్తవాలను వల్లించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వడ్డీల చెల్లింపు 15.42 శాతం మేర పెరగగా అదే సమయంలో జీఎస్‌డీపీ వృద్ధి  కేవలం 13.48 శాతమే ఉంది. అప్పులు తీర్చే స్థోమత సున్నా స్థాయికి చేరిన విషయాన్ని కావాలనే కప్పిపుచ్చారు. 

⇒ ఆర్థిక క్రమశిక్షణారాహిత్యంతో సాగించిన ఐదేళ్ల చంద్రబాబు దుష్పరిపాలన, కోవిడ్‌ సంక్షోభం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించాయి. చంద్రబాబు పాలనలో బడ్జెట్‌ అప్పులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా గ్యారెంటీ ఇచ్చిన అప్పులు, బకాయిలు కలిపి సగటు వార్షిక వృద్ధి 22.63 శాతం ఉండగా... కోవిడ్‌ సంక్షోభం ఎదుర్కొన్నప్పటికీ వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పుల సగటు వార్షిక వృద్ధి కేవలం 13.57 శాతమే ఉండటం గమనార్హం. దీన్ని కూడా చంద్ర­బాబు కప్పిపుచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలో ఉండగా రాష్ట్ర సొంత ఆదాయం తగ్గిపోయిందంటూ.. తన హయాంలోని 2018–19తో ఒక్క ఏడాదితో పోల్చుకుంటూ చంద్రబాబు మసి­బూసి మారేడుకాయ చేసేందుకు యత్నించారు. 

⇒ ఆర్థిక క్రమశిక్షణ, ద్రవ్య జవాబుదారీ బాధ్యతను చంద్రబాబు హయాంలో గాలికి వదిలేశారు. నిబంధనలు ఉల్లంఘించి.. తదుపరి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక చేయాల్సిన అప్పులను కూడా ముందే చేసేసిన ఆయన నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. 2014–19 మధ్య చంద్ర­బాబు ప్రభుత్వం ఆర్థిక సంఘం నిబంధనలకు మించి రూ.31,082 కోట్లు అధికంగా అప్పులు చేయడం గమనార్హం. చంద్రబాబు పాలనలో కోవిడ్‌ లాంటి సంక్షోభాలేమీ లేకపోయినప్పటికీ అనుమతికి మించి అప్పులు చేయడంతో... అనంతరం వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక రుణ పరిమితిని కేంద్రం దాదాపు రూ.17,000 కోట్లు తగ్గించింది.

Back to Top