వైద్యం కోసం పేదలు అప్పులపాలు కాకూడదు, వైద్యం అందక పేదలు ప్రాణాలు పోకూడదనేది సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిశ్చలమైన సంకల్పం. ఆ సంకల్పం నేడు ఫలించి పదిహేనేళ్ల బాలుడికి పునర్జనను ప్రసాదించింది. తన సుదీర్ఘ పాదయాత్రలో ఎంతోమంది పేదలు అనారోగ్యంతో వైద్యం కోసం పడిన కష్టాలను కళ్లారా చూసిన వైయస్ జగన్.. ముఖ్యమంత్రి కాగానే వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆ సంస్కరణల్లో భాగంగానే తిరుపతిలో సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు నాడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.ఎస్.జవహర్‌రెడ్డి తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయించారు. 2021 అక్టోబర్ 11న సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభింపజేసి.. వైద్య సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పేద పిల్లలు తమకు దురదృష్టవశాత్తు వచ్చే గుండె జబ్బులకు పేదరికం కారణంగా జీవితం కోల్పోకుండా ఉండే విధంగా ఎందరో అభాగ్యుల కుజీవితాన్ని ఇస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం సారథ్యంలో గుండె జబ్బుల చికిత్స నిమిత్తం ఏర్పాటు చేసిన పద్మావతి హృదయాలయం.. నేడు పేద పిల్లలకు పునర్జన్మనిస్తుంది. సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో ప్రస్తుత సీఎస్ జవహర్‌రెడ్డి నాడు శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను అత్యాధునికంగా ఏర్పాటు చేయించారు. ఇదే ఆస్పత్రి అనేక మందికి `గుండెచప్పుడు`గా నిలుస్తోంది. ఇందుకు ఉదాహరణగా తాజా సంఘటన సజీవ సాక్ష్యంగా నిలిచింది. విశాఖకు చెందిన ఓ మహిళకు బ్రెయిన్ డెడ్ కావటంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. దీంతో ఆమె గుండెను ఈనెల 20వ తేదీన ప్రత్యేక విమానంలో తిరుపతికి తీసుకొచ్చి గుండెజబ్బుతో బాధపడుతున్న 15ఏళ్ల బాలుడికి ఆరోగ్యశ్రీ కింద శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సాలయంలో పూర్తి ఉచితంగా శస్త్రచికిత్స చేసి అమర్చారు. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ రైతుకూలీ నెలరోజుల క్రితం అనారోగ్యంతో ఉన్న తన 15 ఏళ్ల కుమారుడిని శ్రీపద్మావతి ఆస్పత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు అతని గుండెకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారించి మార్పిడి అనివార్యమని తేల్చిచెప్పారు. జీవన్‌దాన్ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి చికిత్స అందిస్తూ వస్తున్నారు. వారం క్రితం ఆ బాలుడి పరిస్థితి మరింత విషమించింది. రోడ్డు ప్రమాదంలో మహిళకు బ్రెయిన్ డెడ్ విశాఖపట్నంలోని భెల్ (హెచ్‌పీవీపీ)లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న జంజూరు ఆనందరావు భార్య సన్యాసమ్మ (48) టౌన్‌షిప్‌లో ఉంటున్నారు. సంక్రాంతి సందర్భంగా సన్యాసమ్మ పెందుర్తి సమీప గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ నెల 17న తన కుమారుడితో బైక్‌పై తిరిగి వస్తుండగా కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయమవడంతో షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు శుక్రవారం ఉదయం వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించటంతో వైద్యులు జీవన్‌దాన్ సైట్‌కు సమాచారమిచ్చారు. స్పందించిన సీఎంఓ.. సన్యాసమ్మ గుండె తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి అమర్చే అవకాశముందన్న సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం రెండు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, వైద్యులను అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక విమానంలో గుండెను తరలించేందుకు ఏర్పాట్లుచేసింది. తిరుపతి నుంచి ముగ్గురు వైద్యులతో కూడిన బృందం విశాఖకు వెళ్లి సన్యాసమ్మ గుండెను వేరుచేసి ప్రత్యేక బాక్సులో భద్రపరిచారు. దాన్ని శరవేగంగా తిరుపతి తరలించేందుకు అన్ని ఏర్పాట్లుచేశారు. నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు డీసీపీ ఆనంద్‌కుమార్, ట్రాఫిక్ ఏడీసీపీ శ్రవణ్‌కుమార్, నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, 33 మంది సిబ్బంది భద్రతా, ట్రాఫిక్ ఆంక్షలను పర్యవేక్షించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి బాక్స్‌ను టీటీడీ అంబులెన్స్‌లో 21.5 కి.మీ. దూరాన్ని 21 నిమిషాల్లో తిరుపతిలోని శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌కు తీసుకొచ్చారు. ఒక నిమిషంలోనే ఆస్పత్రిలోకి గుండెను చేర్చారు. అప్పటికే ఆపరేషన్‌కు అవసరమైన ఏర్పాట్లను ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో సిద్ధంచేసి ఉంచారు. ఆరుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం 4.15 గంటలపాటు శ్రమించి గుండె మార్పిడి శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తిచేసింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డకు ఆయుష్షు పోసిన సీఎం పది కాలాలపాటు చల్లగా ఉండాలని దీవించారు.