విత్త‌న‌మో రామ‌`చంద్రా`

శనగ విత్తనం కోసం రైతుల ఎదురుచూపులు
 
ముందస్తు రబీకి 2.64 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరం 

అందుబాటులో ఉన్నది 26 వేల క్వింటాళ్లే 

స్పందన లేని సర్కారు.. గతేడాది ఈపాటికే జోరుగా విత్తనాల పంపిణీ 

ఇప్పుడు విత్తనాల కోసం రైతుల ఇక్కట్లు

అమరావతి :  వర్షాభావంతో పంటలు దెబ్బతిన్న రాయలసీమ జిల్లాల్లో రైతులు ముందస్తు రబీకి సిద్ధమైనా, ప్రభు­త్వం నుంచి సహకారం లభించడంలేదు. ముందస్తు రబీలో అవసరమైన విత్తనాలు, ముఖ్యంగా శనగ విత్తనం కోసం రైతులు కళ్లల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. గతేడాది ఈపాటికే విత్తనం సరఫరా అవగా రైతులు పంటలు వేసుకున్నారు. ఈ ఏడాది అవసరమైన విత్తనంలో పదో వంతు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో రైతులు రైతు సేవా కేంద్రాల్లో రిజి్రస్టేషన్‌ చేయించుకొని, విత్తనం కోసం ప్రదక్షిణాలు చేస్తున్నారు.

ఖరీఫ్‌లో రాయలసీమ జిల్లాల్లో 7 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 4 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు సాగవలేదు. సాగైన ప్రాంతాల్లోనూ వర్షాల్లేక సగాని­కి­పైగా ఎండిపోయాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలులో ప్రభుత్వం విఫలమైంది. ఈ రబీ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 57.67 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యంగా నిర్దేశించారు. ప్రధానంగా 19.87 లక్షల ఎకరాల్లో వరి, 11.17 లక్షల ఎకరాల్లో శనగ, 8.45 లక్షల ఎకరాల్లో మినుము, 5.27 లక్షల  ఎకరాల్లో మొక్కజొన్న, 2.75 లక్షల ఎకరాల్లో జొన్నలు, 2.47 లక్షల ఎకరాల్లో పెసలు, 2.52 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగు చేయనున్నారు.

ఇందు కోసం రూ.94.96 కోట్ల సబ్సిడీతో 3.85 లక్షల టన్నుల విత్తనం అవసరమని అంచనా వేశారు. గతేడాది మాదిరిగానే విత్తన రాయితీలు ఇవ్వాలని కోరుతూ అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ముందస్తు రబీకి 17 జిల్లాల్లో 2.64 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనం అవసరం కాగా, ఇప్పటివరకు 6 జిల్లాలకు 26 వేల క్వింటాళ్లే చేరాయి. 

గతేడాది ఈపాటికే పంపిణీ.. 
వాస్తవానికి  అక్టోబర్‌ 1వ తేదీ నుంచి శనగ విత్తనం, 15వ తేదీ నుంచి మిగిలిన విత్తనాల పంపిణీ చేయాలి. గత ఏడాది ప్రణాళిక ప్రకారం పంటల సాగు సాఫీగా సాగిపోయింది. గతేడాది సెపె్టంబర్‌ మూడో వారం నుంచే రిజి్రస్టేషన్స్‌ చేపట్టగా, అక్టోబర్‌ 1 నుంచి తొలుత శనగ విత్తనం, 12వ తేదీ నుంచే మిగిలిన విత్తనాల పంపిణీ మొదలెట్టారు. 

ఈ ఏడాది ఆ పరిస్థితి కన్పించడం లేదు. సోమవారం నుంచి పంపిణీ మొదలు పెడతామని చెబుతున్నప్పటికీ, గ్రామాలకు విత్తనాలే చేరలేదు. గతేడాది వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు వేసుకోలేని ప్రాంతాల్లో 80 శాతం సబ్సిడీపై విత్తనం పంపిణీ చేశారు. కానీ ఈసారి ఆర్థిక భారం సాకుతో సబ్సిడీకి భారీగా కోత పెట్టే అవకాశాలున్నాయని చెబుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

Back to Top