కక్షే లక్ష్యం.. చట్టానికి తూట్లు! 

వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదుల కోసం ఉద్దేశించిన బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్లను సోషల్‌ మీడియా యాక్టివిస్టులు, ప్రజాస్వామిక వాదులపై ప్రయోగిస్తున్న కూటమి సర్కారు 

జూలై 1కి ముందు ఉదంతాల అభియోగాలపై  చట్ట విరుద్ధంగా బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు 

అది చెల్లదని ఓ కేసులో తీర్పునిచ్చిన రాజస్థాన్‌ హైకోర్టు  

అమరావతి: రాజ్యాంగ హక్కులు, చట్ట నిబంధనలను కాలరాస్తూ ‘రెడ్‌బుక్‌’ పాలనతో అణచివేతలకు పాల్పడుతున్న చంద్ర­బాబు సర్కారు ఉగ్రవాదుల కోసం ఉద్దేశించిన చట్టా­లను.. సోషల్‌ మీడియా యాక్టివిస్టులు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నవారు, ప్రజాస్వామ్యవా­దులపై ప్రయో­గిస్తూ మానవ హక్కులను హననం చేస్తోంది. ఈ ఏడాది జూలై 1కి ముందు జరిగినట్లు చెబుతున్న ఉదంతాల అభియోగాలపై ఐపీసీ సెక్షన్లకు బదులుగా చట్ట విరుద్ధంగా భార­తీయ నాగరిక సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌) కింద అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతోంది. 

వ్యవస్థీకృత నేరాల కింద అక్రమ కేసులు మోపుతోంది. జూలై 1వతేదీకి ముందు నాటి ఉదంతాల అభియోగాలపై బీఎన్‌ఎస్‌ కింద కేసులు పెట్టకూడదని కోర్టు తీర్పులు స్పష్టంగా చెబుతున్నా లెక్క చేయడం లేదు. సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై బీఎన్‌ఎస్‌ఎస్‌  చట్టం 192, 196, 353(2), 336(4), 340(2), 79, 111(2)(బి), 61(2) సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేస్తోంది. వాటిలో సెక్షన్‌ 111(2)(బి) అనేది వ్యవస్థీకృత నేరాలకు సంబంధించింది. సోషల్‌ మీడియాలో పోస్టులకు ఆ సెక్షన్‌ వర్తించదు. 

వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదులు, దేశ భద్రతకు విఘాతం కలిగించే అరాచక మూకలపై నమోదు చేసేందుకు ఉద్దేశించిన ఈ సెక్షన్‌ను సోషల్‌ మీడియా యాక్టివిస్టులు, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారిపై బనాయిస్తోంది. ఆ పోస్టులతో సంబంధం లేని వైఎస్సార్‌సీపీ కీలక నేతలను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కుట్రపూరితంగా బీఎన్‌ఎస్‌ఎస్‌ చట్టం కింద కేసులు నమోదు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భయో­త్పాతం సృష్టిస్తూ పౌర హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజల్లో చైతన్యం రగిలిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద చట్టాలను ప్రయోగిస్తూ ఉక్కుపాదం మోపుతోంది. 

జూలై 1 తరువాత ఉదంతాలకే బీఎన్‌ఎస్‌ఎస్‌ చట్టాలు.. 
పార్లమెంట్‌ చట్టాలు, న్యాయస్థానం ఆదేశాలను లెక్క చేయకుండా ఈ ఏడాది జూలై 1 నుంచి దేశంలో కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ నాగరిక సురక్షా సంహిత, న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తుండటం సర్కారు కుట్రలకు నిదర్శనం. కేంద్రం కొత్తగా తెచ్చిన బీఎన్‌ఎస్‌ఎస్, బీఎన్‌ఎస్‌ చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి వచ్చాయి. అంతకుముందు జరిగిన ఉదంతాలకు సంబంధించి అభియోగాలపై నమోదయ్యే కేసులను మాత్రం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) సెక్షన్ల కిందే దర్యాప్తు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆ మేరకు పార్లమెంట్‌లో చట్టం కూడా చేసింది. 

చెల్లదన్న రాజస్థాన్‌ హైకోర్టు..
జూలై 1 తరువాత జరిగిన ఉదంతాల అభియో­గాలపై నమోదు చేసే కేసులను మాత్రమే బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని రాజస్థాన్‌ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అంతకుముందు జరిగిన ఉదంతాలపై అభియో­గాలను ఐపీసీ సెక్షన్ల కిందే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేయాలని తేల్చి చెప్పింది. జూలై 1కి ముందు ఓ వ్యక్తి ఫోర్జరీ సంతకాలతో వీలునామాను సృష్టించారంటూ అదే నెల 27న రాజస్థాన్‌ పోలీసులు బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

ఈ కేసులో నిందితులు జోధ్‌పూర్‌లోని రాజస్థాన్‌ హైకోర్ట్‌ బెంచ్‌ను ఆశ్రయించగా పోలీసుల తీరుపై న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. ఈ ఏడాది జూలై 1కి ముందు జరిగిందని చెబుతున్న ఉదంతంపై బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమని తేల్చిచెబుతూ అక్టోబరు 19న స్పష్టమైన తీర్పునిచ్చింది. 

బరి తెగించి అక్రమ కేసులు..
పార్లమెంట్‌ చట్టాలు, న్యాయ­స్థానం తీర్పులు ఇంత విస్పష్టంగా చెబుతున్నా చంద్రబాబు సర్కారు నిర్భీతిగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఈ ఏడాది జూలై 1వతేదీకి ముందు సోషల్‌ మీడి­యాలో పెట్టారని చెబుతున్న పోస్టులపై ప్రస్తుతం కేసులు నమోదు చేస్తోంది. మూడు నాలుగేళ్ల క్రితం నాటి సోషల్‌ మీడియా పోస్టులపై కొత్త చట్టం పేరుతో అక్రమ కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం. 

వీటిపై ఐపీసీ సెక్షన్‌ అంటే ఐటీ చట్టం కింద మాత్రమే కేసు నమోదుకు ఆస్కారం ఉంటుంది. అది కూడా 41 ఏ కింద నోటీసు ఇచ్చి పంపించాలి. అరెస్ట్‌ చేయకూ­డదు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు 680 మందికి నోటీసులు ఇవ్వగా 176 మందిపై అక్రమ కేసులు నమోదయ్యాయి. 440 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయడంతోపాటు 55 మందిని అక్రమంగా అరెస్టు చేసి ఎమర్జెన్సీ నాటి నియంతృత్వ విధానాలతో అరాచకం సృష్టిస్తోంది. 

Back to Top