అన్నదాత ఆక్రందన

వరుస వైపరీత్యాలు, చీడపీడలు, తెగుళ్లతో పడిపోయిన దిగుబడులు 

ఏ పంటకూ మద్దతు ధర దక్కని దుస్థితి.. మిరప, పత్తి రైతులు విలవిల 

క్వింటా కాదు.. కనీసం కిలో కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయని కూటమి సర్కారు 

ఎక్కడ చూసినా నకిలీలు.. 

ఎరువులకూ దిక్కు లేదు.. బస్తాకు రూ.100 నుంచి రూ.500 వరకు బాదుడు 

వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న రైతులకు నేటికీ అందని పంట నష్టపరిహారం 

ఉచిత పంటల బీమాకు మంగళం.. అందని బీమా పరిహారం 

సీజన్‌ ముగుస్తున్నా పైసా పెట్టుబడి సాయాన్ని విదల్చని కూటమి ప్రభుత్వం 

వైయ‌స్ జగన్‌ హయాంలో సీఎం యాప్‌ ద్వారా మార్కెట్‌ ధరలపై నిరంతరం సమీక్ష 

ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద మద్దతు ధరకు కొనుగోలు 

కేంద్రం మద్దతు ధర ప్రకటించని మిరప, పసుపు, ఉల్లి, అరటి, బత్తాయికి ఎమ్మెస్పీని ప్రకటించి ఆదుకున్న వైయ‌స్ జగన్‌       

 అమ‌రావ‌తి : చంద్రబాబు పాలన అంటేనే కరువు కాటకాలకు పుట్టినిల్లంటారు! అన్నదాతలు భయపడినట్లుగానే టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది మొదలు ఓవైపు కరువు.. మరోవైపు తుపాన్లు, వరదలు, అకాల వర్షాలు.. ఒకటేమిటి వరుస వైపరీత్యాలతో రైతన్నలు హతాశులయ్యారు! ఇక ఎటు చూసినా కల్తీలు రాజ్యమేలుతున్నాయి. 

నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. చివరికి చేతికొచ్చిన పంటకూ మద్దతు ధర దక్కక విలవిల్లాడి పోతున్నారు. మిర్చి నుంచి టమాటా వరకు.. ధాన్యం నుంచి కంది దాకా ఏ పంట చూసినా మద్దతు ధర లభించక.. పెట్టుబడి  ఖర్చులూ దక్కక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 

ప్రధాన పంటలకూ మద్దతు ధర దక్కని దుస్థితి నెలకొన్నా.. మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద టన్ను కాదు కదా.. కనీసం క్వింటా పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసిన పాపాన పోలేదు. అన్నదాతా సుఖీభవ పెట్టుబడి సాయం లేదు.. కరువు సాయం లేదు.. పంట నష్ట పరిహారం జాడ లేదు... పంటల బీమా రక్షణ లేదు... వెరసి ‘కాల కూటమి’ పాలనలో రైతన్నల బతుకు దుర్భరంగా మారింది!

16 లక్షల ఎకరాలు సాగుకు దూరం
ఈ దఫా ఖరీఫ్‌ సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలు కాగా, అతికష్టమ్మీద 70 లక్షల ఎకరాల్లోపు పంటలు సాగయ్యాయి. దాదాపు 16లక్షల ఎకరాలు సాగుకు దూరమయ్యాయి.ప్రకృతి వైపరీత్యాలతో 10 లక్షల ఎకరాల్లో పంట తుడిచి పెట్టుకుపోయింది. రాయలసీమలో దాదాపు వందకు పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకోవడంతో సుమారు10 లక్షల ఎకరాలు బీడువారి పోయాయి. 

మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం మినహా ప్రభుత్వం పైసా పరిహారం విదిల్చలేదు. 14.80 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన వేరుశనగ కేవలం 6.75 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఆరు లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన మిరప 3.72 లక్షల ఎకరాల్లోనే పరిమితమైంది.

కాకి లెక్కలతో రైతు నోట్లో మట్టి
కష్టకాలంలో రైతన్నకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కాకి లెక్కలతో వారి నోట్లో మట్టికొట్టింది. సూపర్‌సిక్స్‌లో ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయంలో పైసా విదిల్చిన పాపాన పోలేదు. ఖరీఫ్‌–23లో 2.37లక్షల మందికి చెల్లించాల్సిన రూ.164.05 కోట్లతోపాటు రబీ–2023–24 సీజన్‌లో 1.54 లక్షల మందికి జమ కావాల్సిన రూ.163.12 కోట్ల కరువు బకాయిలు ఊసెత్తడం లేదు. చివరకు గత జూలైలో కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన 32 వేల మందికి రూ.31.53 కోట్లు నేటికీ జమ చేయలేదంటే రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో తేటతెల్లమవుతోంది.

ఎరువులకూ దిక్కు లేదు..
ఎరువుల కొరత రైతులను అడుగడుగునా వేధించింది. చంద్రబాబు పాలనలో ఆనవాయితీగా రైతులు మండల కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తూ బస్తాపై రూ.100–400 వరకు వసూలు చేస్తూ డీలర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. పుండుమీద కారం చల్లినట్టుగా కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను కంపెనీలు బస్తాకు రూ.255 వరకు పెంచాయి. నాసిరకం ఎరువుల నిర్వాకం సాక్షాత్తూ పౌరసరఫరాల మంత్రి తనిఖీల్లోనే బట్టబయలైంది.

దిగజారిన దిగుబడులు.. దక్కని మద్దతు
ధాన్యం సహా ఈ ఏడాది ప్రధాన పంటల దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. సాధారణంగా దిగుబడులు  తగ్గినప్పుడు మార్కెట్‌లో మంచి రేటు పలకాలి. కానీ ఈ ఏడాది ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కని దుస్థితి నెలకొంది.  

ఏటా ముందస్తు ధరలను అంచనా వేసే ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్కెటింగ్‌ కేంద్రం సైతం ఈ ఏడాది ఖరీఫ్‌ పంట ఉత్పత్తులకు ఆశించిన ధరలు లభించడం లేదని తేల్చి చెప్పింది. అధిక వర్షాలతో పంట నాణ్యత దెబ్బతినడంతో పాటు గోదాముల్లో పేరుకున్న నిల్వల కారణంగా మిరప, పత్తి ధరలు దారుణంగా క్షీణించాయని తేల్చింది.

రూ.20,000 సూపర్‌ సిక్స్‌లో ఇస్తామని ఎగ్గొట్టిన పెట్టుబడి సాయం 
2019–24 మధ్య విత్తనాలు, ఎరువులకు ఇబ్బంది పడని రైతులు.. కూటమి పాలనలో పడరాని కష్టాలు పడుతున్నారు. రైతు సేవా కేంద్రాల్లో నాన్‌ సబ్సిడీ విత్తనాల సరఫరా నిలిచిపోయింది. సబ్సిడీ విత్తనాలు అరకొరగానే ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏటా సగటున 4 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేస్తే.. కూటమి సర్కారు మాత్రం చేతులెత్తేసింది. కృత్రిమ కొరత సృష్టిస్తూ బస్తాపై  వంద నుంచి 400 వరకు డీలర్లు దండుకున్నారు. కాంప్లెక్స్‌ ఎరువుల ధర బస్తాకు రూ.250 వరకు పెంపుతో రైతులకు పెనుభారంగా మారింది.

» కనీస మద్దతూ కరువు
» ధాన్యం బస్తాకు దక్కాల్సింది  రూ.1,725 
» దళారులు చెల్లిస్తున్నదిరూ.1,350–రూ.1,550 

టమాట మీద నిలవని మంత్రి అచ్చెన్న 
టమాట పంట ధరలు పతనమై అన్నదాతలు గగ్గోలు పెట్టగా.. కిలో రూ.8కి కొంటామని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తర్వాత డబ్బుల్లేవని మాట మార్చారు. మార్కెట్‌లో టమాట ప్రస్తుతం కిలో రూ.20 ఉంది. రైతులకు దక్కుతున్నది రూ.3నుంచి రూ.5. 

మిర్చి, పత్తి మినుముధరల పతనం
2023–24 సీజన్లో క్వింటా రూ.21 వేల నుంచి రూ.27 వేలు పలికిన మిర్చి... ప్రస్తుతం సగటున రూ.8 వేలు–రూ.11 వేలు కూడా లేదు. నిరుడు పత్తి క్వింటా రూ.10 వేలకు పైగానే పలకగా.. నేడు రూ.4 వేల నుంచి రూ.5,800కు పరిమితమైంది. మినుముల ధర గత సీజన్‌ లో క్వింటా రూ.10 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.6 వేల నుంచి రూ.7,000 మాత్రమే.

నిరుడు దిలాసా.. నేడు లాస్‌ 
డ్రాగన్‌ ఫ్రూట్‌ టన్ను నిరుడు రూ.1.80 లక్షలు పలకగా, నేడు రూ.1.20 లక్షలకు పడిపోయింది. అరటి రూ.25 వేలు, ద్రాక్ష రూ.40 వేలు, బొప్పాయి రూ.11 వేలు, పుచ్చకాయలు రూ.7 వేలు, కర్బూజా రూ.12 వేలకు మించడం లేదు.  

దిగుబడి లేక దిగాలు.. పరిహారం అందక కుదేలు
2.80 ఎకరాల్లో వరి సాగు చేశా. తుపాన్‌తో రూ.50 వేలకు పైగా నష్టపోయా. పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం మా మండలంలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఎకరాకు రూ.5వేలు నష్టపోతున్నా.     – భాస్కర్, పీవీ పురం, సత్యవేడు మండలం, తిరుపతి జిల్లా

ఎకరాకు రూ.లక్ష నష్టం
ఖరీఫ్‌లో ఆరు ఎకరాల్లో మిరప వేశా. ఎకరానికి రూ.లక్షన్నర వరకు ఖర్చుపెట్టా. బొబ్బర తెగులుతోపంట దెబ్బతింది. ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చేలా కనిపించడం లేదు. నిరుడు క్వింటా రూ.20 వేలు వరకు ఉంటే ఈ ఏడాది రూ.10 వేలకు కూడా కొనేవారు లేరు. ఎకరానికి రూ.లక్ష వరకు నష్టం వాటిల్లుతోంది. మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది.– వెన్నపూసల జగన్మోహన్‌రెడ్డి, కాచవరం, కారంపూడి మండలం, పల్నాడు జిల్లా 

గత ఐదేళ్లూ బాగుంది..
8 ఎకరాల్లో 1,500 చీనీ చెట్లు సాగు చేశా. కూలీలు, మందులు, ఇతర పెట్టుబడి కింద రూ.6.50 లక్షలు ఖర్చు చేశా. హెక్టారుకు 25 టన్నుల దిగుబడి ఆశిస్తే వాతావరణం దెబ్బకొట్టింది. 10 టన్నుల  దిగుబడే వచ్చింది. గత నాలుగైదు సంవత్సరాలు మంచి వర్షాలు కురిశాయి. దిగుబడులు బాగా వచ్చాయి. టన్ను రూ.50 వేలకు తక్కువ కాకుండా ధర పలకడంతో లాభాలు ఆర్జించా. వైఎస్‌ జగన్‌ హయాంలో ఉచిత పంటల బీమా కింద పరిహారం రూపంలో కూడా లబ్ధి పొందా. – రైతు నాగన్న, ముకుందాపురం, గార్లెదిన్న మండలం, అనంతపురం జిల్లా

పత్తి రైతు చిత్తు
రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 14.91 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 9.82 లక్షల ఎకరాల్లో సాగైంది. వరదలు, వర్షాలకు తోడు గులాబీ తెగులు ప్రభావంతో ఎకరాకు 4–6 క్వింటాళ్లకు మించిరాలేదు. గతేడాది క్వింటా రూ.10 వేలకు పైగా పలికిన పత్తి... ప్రస్తుతం గ్రేడ్‌ను బట్టి రూ.4 వేల నుంచి రూ.5,800 మించి పలకని పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల్లో సైతం గరిష్టంగా క్వింటాకు రూ.6,500 మించి ధర లేదని రైతులు చెబుతున్నారు. 

పెసర పంటకు కేంద్రం మద్దతు ధర రూ.8,558 ప్రకటించినా, ప్రస్తుతం మార్కెట్‌లో రూ.6 వేల నుంచి రూ.6,500 మించి పలకడం లేదు.  2023–24లో క్వింటా రూ.10 వేలు పలికిన మినుముకు ఈ ఏడాది రూ.7 వేలకు మించి ధర లేదు. టమాటా రైతులకు తొలి కోత నుంచే కష్టాలు మొదలయ్యాయి. మార్కెట్‌లో కిలో రూ.20 పలుకుతున్నా రైతులకు మాత్రం రూ.3–5కు మించి దక్కడం లేదు. 

ధర లేకపోవడంతో చీని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏలూరు, పశ్చిమ, తూర్పు గోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సాగయ్యే కోకో పంటకు ఈసారి ధర లేకుండా పోయింది. చామంతి గతేడాది కిలో రూ.130 పలుకగా, ప్రస్తుతం కిలో రూ.20–30కి మించని పరిస్థితి నెలకొంది.

మిర్చి రైతు కంట్లో కారం
మిరప రైతులు తెగుళ్లు, చీడపీడలతో ఆశించిన దిగుబడులు రాక, మార్కెట్‌లో గిట్టుబాటు «ధర లేక తీవ్రంగా నష్టపోయారు. 2023–24 సీజన్‌లో 5.92 లక్షల ఎకరాల్లో మిరప సాగవగా, 2024–25లో కేవలం 3.94 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఎకరాకు రూ.2.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. జెమినీ వైరస్, నల్లతా­మర, ఇతర తెగుళ్ల ప్రభావంతో ఎకరాకు 10–15 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాని పరిస్థితి. 

2023–24 సీజన్‌లో క్వింటా రూ.21 వేల నుంచి రూ.27 వేల వరకు పలకగా, ప్రస్తుతం సగటున క్వింటాకు రూ.8 వేల నుంచి రూ.11 వేలకు మించి రావడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి తేజ రకానికి క్వింటాకు రూ.8 వేల నుంచి రూ.12 వేలు.. లావు రకాలకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు.. మధ్యస్థ రకాలకు రూ.10–11 వేలకు మించి ఇవ్వడం లేదు. 

తెల్లకాయలు గతంలో క్వింటా రూ.10వేలు  నుంచి రూ.13 వేలు పలికితే ప్రస్తుతం రూ.3వేల నుంచి రూ.4 వేలకు మించి కొనడం లేదు. రాష్ట్రంలోని గిడ్డంగుల్లో 27 లక్షల బస్తాల నిల్వలు పేరుకుపోయాయి. గతంలో టీడీపీ హయాంలో 12 లక్షల టన్నుల మిరప ఎగుమతులు జరగగా వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా, రికార్డు స్థాయిలో 16.10 లక్షల టన్నులను ఎగుమతి చేయడం గమనార్హం.

రైతు కష్టం..పశువుల పాలు  
టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి కూరగాయల మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.3 నుంచి రూ.5 మధ్య పలికింది. 27 నుంచి 30 కిలోల బరువున్న టమాటా ట్రే ధర రూ.100 నుంచి రూ.150 మాత్రమే. కూలి, రవాణా ఖర్చులు పోగా, రైతులకు ఒక్కో ట్రేకు రూ.70 కూడా మిగలడం లేదు.

చివరికి ఆ ధరకు కూడా మంగళవారం కొనుగోలు చేసేవారు లేకపోవడంతో పలువురు రైతులు తాము తెచి్చన టమాటా పంటను మార్కెట్‌లోనే పశువులకు పారబోసి వెనుదిరిగారు. ఉద్యాన, కూరగాయల రైతులను ఆదుకుంటామని చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం పత్తా లేకుండా పోయిందని, తమకు కష్టాలు తప్పడంలేదని రైతులు వాపోయారు.           – బొబ్బిలి  

నాడు ప్రతీ పంటకు ‘మద్దతు’
ఎన్నికల హామీ మేరకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. సీఎం యాప్‌ ద్వారా మార్కెట్‌ ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పతనమైన ప్రతిసారీ జోక్యం చేసుకుని వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర దక్కేలా చేసింది. పొగాకు, పత్తి, పసుపుతో సహా సజ్జలు, కొర్రలు, రాగులు, శనగ,  పెసలు, కంది, వేరుశనగ, జొన్నలు, ఉల్లి, టమాటా, బత్తాయి, అరటి రైతులకు అండగా నిలిచింది. 

కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి వంటి పంటలకు సైతం ఎమ్మెస్పీని ప్రకటించి ఐదేళ్లూ ఆ ధరకు ఒక్క రూపాయి తగ్గకుండా చూసింది. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌ హయాంలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796.47 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేశారు.

అంటే.. రెట్టింపు కన్నా అధికం. ఇక చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన 3,403 టన్నుల పత్తి,  రూ.18 కోట్ల విలువైన 8,459.56 టన్నుల టమాటాను సైతం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. 

ఖజానాలో సొమ్ములు లేకపోయినా..
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఖజానాలో రూ.100 కోట్లకు మించి డబ్బులు లేకున్నా పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టారు. రైతులను ఆదుకోవా­లన్న సంకల్పంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. 

శనగలు, మొక్కజొన్న, పత్తి, కందులు, పసుపు.. ఇలా తొలి ఏడాదిలోనే 14 రకాల ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు సేకరించారు. 3,76,902 మంది రైతుల నుంచి రూ.4354.11 కోట్ల విలువైన 11,02,105 టన్నుల పంట ఉత్పత్తులను సేకరించి చిత్తశుద్ధిని చాటుకుంది.  

Back to Top