రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామీణ పేద కూలీలకు ‘ఉపాధి’లో భారీగా కోతపడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనుల కల్పన బాగా తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరం(2023–24)లోని జూన్–జనవరి మధ్య కల్పించిన పని దినాలకు, ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లోని జూన్–జనవరి మధ్య కల్పించిన పనిదినాలను పోలిస్తే ఏకంగా 2.69 కోట్ల పనిదినాలు తగ్గాయి. దీనివల్ల గ్రామీణ పేదలు వేతనాల రూపంలో రూ.700 కోట్ల మేరకు నష్టపోయారు. దీనిలో ఎక్కువగా నష్టపోయింది ఎస్సీ, ఎస్టీలే. ఈ విషయాలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ కారణాలతో పనికి ఎసరు! కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధి హామీ పథకం అమలులో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్లే పేదలకు పనుల కల్పన తగ్గిపోయినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది జూన్‌లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే... ఆయా పార్టీల ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఉపాధి హామీ పథకంలో కీలకమైన ఫీల్డ్ అసిస్టెంట్లను పెద్ద ఎత్తున తొలగించేలా చేశారు. క్షేత్రస్థాయిలో కూలీలకు పనులు కల్పించే ప్రక్రియలో కీలకంగా వ్యవహరించే ఫీల్డ్ అసిస్టెంట్లుగా తమ పార్టీల కార్యకర్తలను నియమించుకున్నారు. కొత్తగా వచ్చిన వారికి ఉపాధి హామీ పథకం అమలుపై అవగాహన లేకపోవడంతోపాటు వాళ్లు గ్రామాల్లో రాజకీయాలకు ప్రభావితమై తమకు ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరులకు పనుల కల్పనకు ఇష్టపడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యల వల్ల రాష్ట్రంలోని పేదలు ఆరు నెలల్లోనే రూ.700 కోట్ల వరకు నష్టపోవాల్సి వచి్చంది. ఉపాధి పనుల కల్పన ఇలా.. ⇒ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న గత ఆర్థిక సంవత్సరంలోని 2023 జూన్ నుంచి 2024 జనవరి మధ్య రాష్ట్రంలోని గ్రామీణ పేదలకు 10.87 కోట్ల పని దినాలపాటు పనులు కల్పించారు. ⇒కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆర్థిక సంవత్సరంలోని 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు కేవలం 7.18 కోట్ల పనిదినాలు మాత్రమే పనులు కల్పించారు. ⇒ గత ఆర్థిక సంవత్సరంలో జూన్ నుంచి జనవరి వరకు ఎస్సీలకు 22.41 శాతం పని దినాలు కల్పించారు. అదే కాలానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 21.87 శాతానికి తగ్గిపోయింది. ⇒ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా 2024 ఏప్రిల్, మే నెలల్లో కూడా 12.72 కోట్ల పనిదినాలు కల్పించడం విశేషం. ⇒ ప్రస్తుతం ఉపాధి కూలీలకు సగటున రోజుకు రూ.255 చొప్పున వేతనాలు లభిస్తున్నాయి. ⇒ కూటమి ప్రభుత్వం గత ఏడాది మాదిరిగా పనులు కల్పించినా గ్రామీణ పేదలకు రూ.700 కోట్ల వరకు లబ్ధి కలిగేది.