అక్కచెల్లెళ్ల మానానికి రక్షణ లేదు.. పసిబిడ్డల ప్రాణాలకు విలువలేదు. హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యం. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఓ మూల ఓ అభాగ్యురాలి గావుకేక.. పట్టించుకునేవారులేక ఓ చిట్టితల్లి ఘోష బదిర శంఖారావమై ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. వ్యవస్థల కాళ్లూచేతులు కట్టి వ్యక్తిగత అజెండా అమలుకు వినియోగించుకుంటున్న పాలకుల చేతుల్లో రాష్ట్రంలో మధ్యయుగాలనాటి సంస్కృతి జడలు విప్పుతోంది. హత్యలు, అత్యాచారాలూ పట్టించుకునేంత పెద్ద నేరాలుగా కనిపించని ప్రభుత్వ పెద్దలు రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు మాత్రం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదుచేయకపోతే సహించేది లేదని పోలీసులకు తేలి్చచెబుతున్నారు. వేధించని అధికారులపై వేటేస్తున్నారు. బాబు మార్కు పాలనపై విశ్లేషకులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. వరుస హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అట్టుడుకుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు కూడా అనిపించడంలేదు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన నాలుగు నెలల్లోనే రికార్డుస్థాయిలో హత్యలు, అత్యాచారాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వరుస దాడులు, దౌర్జన్యాలతో విధ్వంసకాండ యథేచ్ఛగా సాగుతోంది. టీడీపీ గూండాలు కర్రలు, కత్తులతో గ్రామాలపై పడి బీభత్సం సృష్టిస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 177 మందిని హత్య చేశారు. 500కుపైగా హత్యాయత్నాలకు తెగబడ్డారు. 2 వేలకుపైగా దాడులతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. టీడీపీ గూండాల దాడులతో భీతిల్లి దాదాపు 3 వేల కుటుంబాలు గ్రామాలు విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాయి. ఇక రాష్ట్రంలో అత్యాచార పర్వానికి అంతూపొంతూ లేకుండా పోతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఆశించినస్థాయిలో స్పందన లేకపోవడం విభ్రాంతి కలిగిస్తోంది. ఇళ్లల్లో ఉండే చిన్నారులు, పాఠశాలకు వెళ్లే విద్యారి్థనులు, యువతులపై అత్యాచారాలతో రాష్ట్రంలో జరుగుతున్న అరాచక కాండతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 110 మందిపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. వారిలో 11 మందిని అత్యాచారం చేసి హత్య చేశారు. అయినా సరే శాంతిభద్రతల పరిస్థితి తమకేం పట్టనట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలను అరికట్టేందుకు ఆయన పోలీసు శాఖకు స్పష్టమైన మార్గనిర్దేశం కూడా చేయలేదు. పోలీసుల వైఫల్యంపై సమీక్షించలేదు...ఒక్క ఉదంతంలో కూడా బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోలేదు. ⇒ చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ముస్లిం బాలికను అపహరించుకుపోయిన ఉదంతంలో పోలీసు వైఫల్యం స్పష్టమైంది. కేవలం పుంగనూరు వరకే గాలింపు చర్యలు చేపట్టి పోలీసులు మిన్నకుండిపోయారు. నాలుగు రోజుల తరువాత పుంగనూరుకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆ చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. పుంగనూరుకు 5 కిలోమీటర్ల పరిధిలో గాలింపు చర్యలు చేపట్టి ఉంటే ఆ చిన్నారిని రక్షించగలిగేవారు. కానీ పోలీసులకు ఆ ఆలోచనే తట్ట లేదు. అయినా సరే ఆ పోలీసు అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎందుకంటే తమ రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు ఏరికోరి నియమించుకున్న పోలీసు అధికారులు వారు. కాబట్టి ప్రజల ప్రాణాలు రక్షించలేకపోయినా ఫర్వాలేదన్నది ప్రభుత్వ ఉద్దేశం. ⇒ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇటీవల టీడీపీ నాయకుడు జాన్ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ⇒ అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ కుటుంబం ఆందోళన చేయడంతో ఎనిమిది రోజుల తర్వాత ఆగస్టు 2న పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ కేసు ఉపసంహరించుకోవాలని బాధితురాలి కుటుంబాన్ని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. పోలీసుల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినా సరే వారిపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎందుకంటే అత్యాచారానికి పాల్పడింది టీడీపీ వర్గీయుడు కాబట్టి. ⇒ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమె జూన్ 14న మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దాంతో పోలీసులు జూన్ 16న కేసు నమోదు చేశారు. ఈ ఉదంతంలోనూ సంబంధిత పోలీసు అధికారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేదు. ⇒ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలోని బాత్ రూమ్‌లలో రహస్య కెమెరాలతో విద్యార్థినుల వీడియోలు తీసిన ఘటనతో యావత్ రాష్ట్రం హడలెత్తిపోయింది. వందలాది మంది విద్యారి్థనులు అర్ధరాత్రి ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. అంతటి తీవ్రమైన ఉదంతాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేసేసింది. నిందితులను గుర్తించనే లేదు. అక్రమ కేసులు పెట్టకపోతే కఠిన చర్యలే హత్యలు, అత్యాచారాలు యథేచ్ఛగా జరుగుతున్నా స్పందించని చంద్రబాబు ప్రభుత్వం... సోషల్ మీడియా యాక్టివిస్టులపై మాత్రం అక్రమ కేసులు నమోదు చేయాల్సిందేనని పోలీసులకు స్పష్టం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ మరీ అక్రమ కేసులు నమోదు ప్రక్రియను ప్రభుత్వ పెద్దలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దాంతో పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే 106 అక్రమ కేసులు నమోదు చేశారు. తాము చెప్పినవారిపై అక్రమ కేసులు నమోదు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏకంగా మంత్రిమండలి సమావేశం వేదికగా వ్యాఖ్యానించడం గమనార్హం. టీడీపీ నేతలు చెప్పినట్టుగా అక్రమ కేసులు నమోదు చేయని వైఎస్సార్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం 24 గంటల్లోనే బదిలీ చేయడంతోపాటు ఓ సీఐని సస్పెండ్ చేసింది. టీడీపీ పెద్దలకు వీర విధేయ పోలీసు అధికారి, కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ను హుటాహుటిన కడపకు పంపించి మరీ అక్రమ కేసులు నమోదు బాధ్యతను పర్యవేక్షించమని ఆదేశించింది. తద్వారా శాంతిభద్రతల పరిరక్షణ కంటే అక్రమ కేసుల నమోదే తమ ప్రాధాన్యమని చంద్రబాబు ప్రభుత్వం తన దుర్నితిని నిర్భీతిగా వెల్లడించింది.