బాదుడే బాదుడు.. అర్థమైందా ఇప్పుడు!

 
 ‘ఓ రాజు తన రాజ్యంలోని ప్రజలందరికీ ఉన్ని కోటు ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. దీంతో ప్రజలందరూ ఆయన్ను పొగిడారు. ఓ అమాయకుడు మాత్రం ‘మహారాజా..! ఉన్ని కోటు కోసం అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు..?’ అని అడిగాడు. దానికి రాజు ‘ఇంకెక్కడి నుంచి మీ వద్ద నుంచే’ అని సమాధానమిచ్చారు.  ఎన్నిక‌ల హామీల‌ ఊసే ఎత్తని.. సంక్షేమ ప‌థ‌కాల‌ను గాలికొదిలేసిన కూట‌మి ప్రభుత్వం పన్నుల విధింపుపైనే ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. ‘పన్ను పెంపు.. ఖజానా నింపు’ అన్న చందాన వ్యవహరించింది. అప్పుల రాజ్యంలో ప్రజలు సమిధలవుతున్నారు. ఇవేం పన్నులు బాబోయ్‌ అంటూ.. నెత్తీనోరు బాదుకుంటున్నారు.
 

రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను వివిధ పన్నుల పేరిట ముక్కు పిండి ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ప్రభుత్వం వసూలు చేస్తోంది. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం, రకరకాల మాయ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఓట్లేసిన ప్రజలనే ముంచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మాట మార్చడం.. మాట తప్పడమే ఆయన నైజం. ఇటీవలి ఎన్నికల్లో ఆయనిచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలు, కరెంటు చార్జీలు పెంచబోమంటూ చెప్పిన మాటలను తుంగులో తొక్కేశారు. సంప‌ద పెంచాక సూప‌ర్ సిక్స్ అమ‌లు చేస్తామ‌ని ఆయన నైజాన్ని మరోసారి బయట పెట్టుకుంటున్నారు. 

షాక్ కొడుతున్న క‌రెంటు చార్జీలు:
ఎన్నికల సమయంలో ప్రతి చోటా మైకు పట్టుకొని గత ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచిందంటూ అబద్ధాలాడేశారు. అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచేది లేదని, అవసరమైతే వినియోగదారులే విద్యుత్‌ అమ్ముకునేలా చేస్తామని ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టి ఐదు నెలలు తిరక్కుండానే చార్జీల బాదుడుకు శ్రీకారం చుట్టారు.  కూటమి పాలనలో ప్రజలపై భారీ విద్యుత్‌ చార్జీల భారం పడింది. రూ.9,412.50 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీలను ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయనుంది. దీని ద్వారా ప్రతి యూనిట్‌కు రూ.0.92 అదనపు భారం ప్రజలపై పడుతుంది.  డిసెంబర్‌ వినియోగం నుంచే అంటే జనవరి నుంచి ప్రభుత్వం ఈ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం దీపావళి పండుగకే రాష్ట్ర ప్రజలపై రూ.6,072.86 కోట్ల భారం వేసింది. ఈ చార్జీలను యూనిట్‌కు రూ.1.27 చొప్పున ఈ నెల నుంచి వసూలు చేస్తున్నారు. తాజా చార్జీలతో కలిపి జనవరి నుంచి యూనిట్‌కు రూ.2.19 అదనంగా వినియోగదారులు చెల్లించాలి. గతంలో వేసిన రూ.6.072.86 కోట్లు, తాజాగా వసూలు చేస్తున్న రూ.9,412.50 కోట్లు కలిపి మొత్తంగా చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే రూ.15,485.36 కోట్ల భారం ప్రజలపై మోపింది.   

ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ
పండుగ పూట ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు బాదుడుకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా పండగకు సొంతూళ్లకు వెళ్తుంటారు. ఇదే అదునుగా ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సంక్రాంతి ముందు రవాణాశాఖ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి హెచ్చరించినా తీరు మార‌లేదు.  హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌, విశాఖ‌, అనంత‌పురం, క‌డ‌ప‌, తిరుప‌తి వంటి న‌గ‌రాల‌కు ప్ర‌తి రోజూ వంద‌లాది ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. సంక్రాంతి పండగ సందర్భంగా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సు సర్వీసులను వేసినా, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది.  దీంతో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఎలాగైనా సొంతూళ్లకు వెళ్లాలనే సంకల్పంతో ఉన్నవారు తప్పక అధిక ఛార్జీలు చెల్లిస్తున్నారు. మరోవైపు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మాత్రమే ప్రయాణికులు తీసుకెళ్లాలనే నిబంధనలున్నా స్టేజ్‌ క్యారియర్లగా తిప్పుతున్నా  రవాణాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదు. 

ఉదాహ‌ర‌ణ‌కు కడప నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ సూపర్‌లగ్జరీలో రూ.700, ఇంద్ర బస్సులో రూ.940, స్టార్‌లైన్‌లో రూ.990 టిక్కెట్‌ ఛార్జీ ఉండగా, ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు రూ.1,500 నుంచి రూ.2,500 వరకు వసూలు చేశారు.  కడప నుంచి బెంగళూరుకు సూపర్‌లగ్జరీలో రూ.540, ఇంద్ర బస్సులో రూ.650, అమరావతి బస్సులో రూ.850 ఛార్జీ ఉండగా, ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులు రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. బెంగళూరు నుంచి కడపకు ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ రూ.5 వేలు టిక్కెట్‌ ధర నిర్ణయిస్తూ ఆన్‌లైన్‌లో పెట్టింది. కడప నుంచి చెన్నైకు రూ.480 టిక్కెట్‌ ఛార్జీ ఉండగా, ప్రైవేటు ట్రావెల్స్‌ వారు రూ.1,500 నుంచి రూ.2 వేలు వరకు వసూలు చేస్తున్నారు. డిమాండు మేరకు ధరలు పెంచుకుంటూ పోతున్నారు. గత్యంతరం లేని వారు వేల రూపాయలు వెచ్చించి వెళ్లాల్సివస్తోంది. బెంగళూరులో ఎక్కువ సాఫ్ట్‌వేర్‌ నిపుణులుంటారు. వారందరూ సొంతూళ్లకు తప్పకుండా వస్తారు. దీంతో ఆ మార్గంలో రేట్లు ఎక్కువగా ఉన్నాయి.

40–50 శాతం పైనే పెరగనున్న రిజిస్ట్రేషన్‌ చార్జీలు

రాష్ట్రంలో నేటి నుంచి రిజిస్ట్రేషన్‌ చార్జీల బాదుడు మొదలవ్వనుంది. ఒక్క అమరావతి ప్రాంతంలో మినహా అన్ని చోట్ల రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపుపై తీవ్రంగా కసరత్తు చేసింది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వారీగా ఆస్తుల విలువ పెంచి, తద్వారా రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 

ఈ ప్రతిపాదనలకు జిల్లాల్లోని జేసీ కమిటీలు సైతం తాజాగా గురువారం ఆమోదం తెలపడంతో శని­వారం నుంచి పెరిగిన చార్జీలు అమలులోకి రాను­న్నాయి. ఇప్పుడున్న దానికంటే 40–50 శాతంపైగానే రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరగనున్నాయి. కూటమి ప్రభు­త్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రజలపై భారం మోపు­తోంది. మరోవైపు ప్రజలకు అందు­తున్న సంక్షేమ పథకా­లను నిలిపేసింది. బహిరంగ మార్కెట్‌లో నిత్యా­వసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతు­న్నా­యి. 

విద్యుత్‌ చార్జీల పెంపు, మద్యం దందాతో ప్రజల నడ్డి విరు­స్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు ప్రకృతి వైపరీ­త్యాలు జన జీవితాలను తీవ్రంగా దెబ్బతీ­శాయి. దీంతో సామాన్యుల్లో కొనుగోలు శక్తి క్షీణిస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ప్రభు­త్వం మరోసారి ప్రజ­లను బాదేందుకు సిద్ధ­మైంది. భూముల విలువతో పాటు నిర్మాణాల విలువలను భారీగా పెంచేసింది. పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లను సైతం వదిలి పెట్టకుండా ఆదాయం కోసం వాటి విలువలను పెంచేసింది. 

పర్యవసానంగా నగరాల్లో అపార్టుమెంట్లు, ప్లాట్లు కొనుగోలు చేసే వారిపై ఏకంగా రూ.లక్షల్లో భారం పడనుంది. ప్రాంతాలను బట్టి భూముల క్లాసిఫికేషన్‌ చేసి రేట్లు నిర్ధారించింది. గతానికి భిన్నంగా ప్రాంతాన్ని బట్టి కాకుండా, స్థలాన్ని బట్టి రేటు నిర్ణయించడం గమనార్హం. ఇకపై ఒకే ప్రాంతంలో రోడ్డుకు పక్కన స్థలం ఒకరేటు.. దానికి పక్కనున్న స్థలానికి ఇంకో రేటు, కాస్త లోపల ఉన్న స్థలానికి మరో రేటు ఉంటుంది. 

కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా తగ్గిపోవడంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి భారీగా గండి పడింది. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏడాదికి దాదాపు రూ.10 వేల కోట్లుగా ఉన్న ఆదాయం కూటమి కొలువుదీరాక రూ.6 వేల కోట్లకు పడిపో­యింది. దీంతో ఎలాగైనా సరే ఈ ఆదాయాన్ని భారీగా పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో రూ.13 వేల కోట్లు ఆర్జించాలని రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

Back to Top