తాడేపల్లి: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు కబుర్లతో కాలయాపన చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు గురువారం ఆయన ప్రభుత్వ తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగడుతూ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. వైయస్సార్‌సీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టాయి, వాహనాలను ధ్వంసం చేశాయి. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే, నేరం చేయాలంటేనే భయపడాలంటూ పైన ఉన్న చంద్రబాబు కబుర్లు చెప్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది? అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.