అసలు కథ చెప్పని ‘తండేల్‌’

2018లో 22 మంది రాష్ట్ర మత్స్యకారులను జైలులో పెట్టిన పాకిస్తాన్‌ 

వారి విడుదలపై పట్టించుకోని అప్పటి ప్రభుత్వ పెద్దలు 

వైఎస్‌ జగన్‌ చొరవతోనే పాక్‌ జైలు నుంచి విడుదల 

2018లో జగన్‌ పాదయాత్రలో ఉండగానే వారి విడుదలకు కృషి ప్రారంభం 

వైఎస్సార్‌సీపీ ఎంపీల ద్వారా విదేశాంగ శాఖపై ఒత్తిడి 

అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ఒత్తిడి 

కేంద్రం ఆర్టికల్‌ 370 రద్దుతో ఆశలు సన్నగిల్లినా పట్టు విడువని జగన్‌ 

ఎట్టకేలకు విడుదలకు పాక్‌ అంగీకారం.. 2020 జనవరి 6న విడుదల  

వాఘా సరిహద్దు వద్ద వారికి స్వాగతం పలికిన వైఎస్సార్‌సీపీ మంత్రులు 

విడుదలైన వారికి రూ.5 లక్షలు చొప్పున వైఎస్‌ జగన్‌ ఆర్థిక సాయం 

మత్స్యకారుల వలసలు ఆపేందుకు పలు చర్యలు చేపట్టిన జగన్‌ 

సీ పోర్టు, ఫిషింగ్‌ హార్బర్, జెట్టీ పనులు ప్రారంభం 

సినిమాలో చూపకపోయినా చెప్పాల్సిన బాధ్యత ఉందన్న బాధిత కుటుంబ సభ్యులు 

శ్రీకాకుళం: పద్నాలుగు నెలలు పాకిస్తాన్‌ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారులను విడుదల చేయించింది ఎవరు? వారిని వాఘా సరిహద్దుల నుంచి ఇంటి వరకు తీసుకొచ్చింది ఎవరు? వారి కష్టాలకు చలించిపోయి ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసిందెవ్వరు? ఇంకెవరూ వలస పోకుండా, ఎవరికీ అలాంటి దుస్థితి రాకుండా శ్రీకాకుళం జిల్లాలో పోర్టు, హార్బర్, జెట్టీల నిర్మాణం మొదలుపెట్టింది ఎవరు? వలస బతుకులకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ప్రయత్నించిందెవరు?... మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘తండేల్‌’ సినిమా ఈ ప్రశ్నలన్నింటినీ మరోసారి తెర ముందు ఉంచింది. 

సినిమాలో సగం నిజమే చెప్పినా.., చూపించని కోణాలు ఎన్నో ఉన్నాయి. బాధితులు మాత్రం మీడియా ముందుకు వచ్చి గుండె తెరిచి వాస్తవాలు వివరించారు. తమను విడిపించి తీసుకువచ్చింది, రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని విస్పష్టంగా చెప్పారు. తరాల తరబడి శ్రీకాకుళం జిల్లాను పాలిస్తున్న రాజకీయ కుటుంబాలు కలలో కూడా ఊహించని విధంగా జిల్లాలో పోర్టు పనులు ప్రారంభించడం, ఫిషింగ్‌ హార్బర్, జెట్టీ పనులు ప్రారంభించడం వైఎస్‌ జగన్‌ చలవేనని సోషల్‌ మీడియా మోతమోగిపోయేలా చెబుతున్నారు.  

ఇదీ జరిగింది.. 
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశంకు చెందిన 10 మంది, బడివానిపేటకు చెందిన ముగ్గురు, ముద్దాడకు చెందిన ఒకరు, విజయనగరం జిల్లా తిప్పలవలసకు చెందిన ఆరుగురు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఇలా మొత్తం 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం 2018 జూలైలో గుజరాత్‌ రాష్ట్రం వీరావల్‌కు వెళ్లారు. వీరంతా ఒక బృందంగా ఏర్పడి నాలుగు పడవల్లో అరేబియా సముద్రంలోకి వెళ్లారు. పడవలు సముద్రంలో తీవ్ర ఆటుపోట్లకు గురవడంతో పొరపాటుగా పాకిస్తాన్‌ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. 

2018 నవంబర్‌ 28న అక్కడి కోస్టు గార్డు అధికారులకు దొరికిపోయారు. పాకిస్తాన్‌ అధికారులు వారందరినీ కరాచీ సబ్‌ జైలులో పెట్టారు. అక్కడ సరైన తిండి, దుస్తులు లేక అక్కడ వారు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. జైలు అధికారులు ఉదయం ఒక్క రొట్టె ఇచ్చేవారు. మధ్యాహ్నం, రాత్రి రెండేసి రొట్టెలు ఇచ్చేవారు. వాటితోనే సరిపెట్టుకోమని చెప్పేవారు. రొట్టెలు వద్దంటే అన్నం ఇచ్చేవారు. 

ఆదివారం మాత్రం కొంచెం మాంసాహారం పెట్టేవారు. ఈద్‌ అనే స్వచ్ఛంద సంస్థ దుస్తులతో పాటు రూ.5 వేల నగదు ఇచ్చింది. అక్కడ కూలి పనులు చేస్తే కొంత డబ్బు వచ్చేది. ఆ డబ్బుతో జైల్లోనే విక్రయించే కిరాణా సరుకులు కొనుక్కొని వంట చేసుకునేవారు. అదీ అరకొర భోజనమే. ఇలా కష్టాలు అనుభవిస్తూ క్షణమొక యుగంలా గడిపారు. మరోపక్క వేటకు వెళ్లిన వీరి ఆచూకీ తెలియకపోవడంతో ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. 

చివరకు వారితో పాటు వేటకు వెళ్లిన మరో మత్స్యకారుడి ద్వారా వారంతా పాకిస్తాన్‌ అదుపులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ మత్స్యకారుల కుటుంబాలు తమ వాళ్ల కోసం గ్రామ సర్పంచ్‌ నుంచి ప్రభుత్వ పెద్దల వరకు అందరినీ ఆశ్రయించాయి. ఎవరూ పరిష్కారం చూపలేదు. పాకిస్తాన్‌లో మత్స్యకారులు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసి వారి కుటుంబీకులు తల్లడిల్లిపోయేవారు.  

ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌ హామీ 
ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న రామారావు అలియాస్‌ రాజు సతీమణి నూకమ్మ, బందీగా ఉన్న మరో మత్స్యకారుడు ఎర్రయ్య సతీమణి శిరీష మిగిలిన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గ్రామానికి చెందిన న్యాయవాది గురుమూర్తి సాయంతో జిల్లా యంత్రాంగానికి, నాయకులకు, ప్రభుత్వానికి విన్నపాలు అందజేశారు. అయినా ఫలితం లేదు. అదే సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. 2018 డిసెంబర్‌ 2న రాజాం నియోజకవర్గం లచ్చయ్యపేట గ్రామం వద్దకు వచ్చిన వైఎస్‌ జగన్‌ను బాధిత మత్స్యకార కుటుంబాలు కలిశాయి. 

పాకిస్తాన్‌ జైల్లో బందీలుగా ఉన్న తమ వాళ్లను విడిపించాలని కోరాయి. అప్పటి రాష్ట్ర మంత్రి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావును కలిసినా పట్టించుకోలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌ వెంటనే స్పందించారు. పాక్‌ చెరలో ఉన్న మత్స్యకారుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తమ ఎంపీలను పంపిస్తానని, మత్స్యకార కుటుంబ సభ్యులు విదేశాంగ శాఖ మంత్రిని కలిసేలా చేస్తానని చెప్పారు. అధికారంలోకి వస్తే వెంటనే విడిపిస్తానని భరోసా ఇచ్చారు. 

జగన్‌ పునర్జన్మనిచ్చారు 
తండేల్‌ సినిమా హీరో పాత్రకు మూలమైన రామారావు సోదరి ముగతమ్మ. ఈమె భర్త అప్పారావు, కొడుకులు కళ్యాణ్, కిషోర్‌ కూడా అప్పట్లో పాక్‌ జైల్లో బందీ అయ్యారు. ‘తండేల్‌’ సినిమాలో జగన్‌ ప్రస్తావన లేకపోవడాన్ని చూసి ముగతమ్మ తట్టుకోలేకపోయారు. సినిమా చూసి వచ్చిన వెంటనే హాల్‌ బయట తన మనసులో మాటను మీడియా ముందు స్పష్టంగా చెప్పారు. తమ వారిని విడిపించి తీసుకువస్తానని చేతిలో చేయి వేసి జగన్‌ చెప్పారని, చెప్పినట్టుగానే తీసుకుని వచ్చారని తెలిపారు. 

అంతేకాకుండా  ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. జగనన్నతో పాటు అప్పటి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్, గ్రామ సర్పంచ్, సర్పంచ్‌ కుమార్తె, న్యాయవాది గురుమూర్తి కృషి కూడా ఉందని తెలిపారు. సినిమాలో అవేవీ లేకపోయినా బయట చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే అన్ని విషయాలు వివరంగా చెబుతున్నానని అన్నారు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చొరవతో విడుదల  
పాదయాత్రలో ఉన్నప్పటికీ, వైఎస్‌ జగన్‌ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దీంతో 2019 ఫిబ్రవరిలో మత్స్యకారుల నుంచి కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రావడం మొదలైంది. ఇది కుటుంబ సభ్యులకు కొంత ఉపశమనం కలిగించినా, తిరిగి ఇంటికి వస్తారో, లేదో అన్న భయం వెంటాడుతూనే ఉండేది. 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల విడుదలకు కేంద్రంపై ఒత్తిడి మరింతగా పెంచారు.

ఆ తర్వాత కేంద్రం 370వ అధికరణం ఎత్తివేయడం, 35 (ఎ)తొలగింపు వంటి పరిణామాలతో వీరి విడుదలపై ఆశలు సన్నగిల్లాయి. అయినా వైఎస్‌ జగన్‌ పట్టువిడవకుండా ఎంపీల ద్వారా విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపారు. దీంతో మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్‌ ప్రభుత్వం అంగీకరించింది. 2020 జనవరి 6న మత్స్యకారులను విడుదల చేసింది. ఆరోజు సాయంత్రం 7 గంటల సమయంలో వాఘాలోని భారత్‌–పాక్‌ సరిహద్దు వద్ద 20 మంది మత్స్యకారులను అప్పగించింది. 

వారికి అప్పటి వైఎస్సార్‌సీపీ మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. మిగతా ఇద్దరు డాక్యుమెంట్లు, ఇతర సాంకేతిక కారణాల వల్ల తర్వాత విడుదలయ్యారు. విడుదలైన వారందరినీ వైఎస్సార్‌సీపీ నేతలు, అధికారులు ఢిల్లీ తీసుకొచ్చి అక్కడి నుంచి విమానంలో రాష్ట్రానికి తెచ్చారు. 

వారంతా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. జగన్‌ వారందరికీ స్వీట్లు తినిపించి, ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఇకపై మత్స్యకారులు ఇలా వలసలు వెళ్లే అవసరం లేకుండా రాష్ట్రంలోనే పోర్టు, జెట్టీ, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామని భరోసా ఇచ్చారు.

చెప్పినట్టుగానే హామీలు అమలు  
194 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మౌలిక సదుపాయాలు లేక మత్స్య­కారులు వలసపోయేవారు. దీన్ని నివారించేందుకు జిల్లాలోని మూలపేటలోనే ల్యాండ్‌ లార్డ్‌ మోడల్‌ విధానంలో రూ.2,949.70 కోట్లతో సీ పోర్టు తొలి దశ, బుడగట్లపాలెంలో రూ.366 కోట్ల­తో ఫిషింగ్‌ హార్బర్, మంచినీళ్లపేటలో జెట్టీ పనుల­కూ శ్రీకారం చుట్టారు. అధికారంలో ఉండగానే చాలా వరకు పనులు పూర్తి చేశారు. 

వేట నిషే­ధ కాలంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పేరి­ట 17,136 మందికి రూ.10 వేలు చొప్పున సాయం అంద­జేశారు. మత్స్యకారుల సంక్షేమం క్షేత్రస్థాయి­లో అందుతుందో తెలుసుకునేందుకు 66 మంది సాగర మిత్ర ఉద్యోగులను నియమించారు. గ్రామ సచివాలయాల్లో ఫిషరీస్‌ అసిస్టెంట్‌లను నియమించారు. ఫిష్‌ ఆంధ్రా షాపులను ఏర్పా­టు చేశారు. 

కరోనా సమయంలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టి గుజరాత్‌ తదితర రాష్ట్రాల నుంచి 3,064 మంది మత్స్యకారులను 46 బస్సుల ద్వారా తీసుకు వచ్చారు. ఇదంతా కళ్లెదుటే జరిగింది. అయి­నా ఇందులో ప్రధాన ఘట్టాలను సినిమాలో చూపించలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Back to Top