నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి రైతువ్యతిరేకి అని వైయస్ఆర్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు క్యాంప్ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాడు వ్యవసాయం దండుగ అన్నాడు, నేడు ఏకంగా సాగునీటి కాలువలనే ప్రైవేటుపరం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ హయాంలో విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు అండగా నిలిచిన ఆర్బీకేలను చంద్రబాబు కక్షసాధింపులో భాగంగా పూర్తిగా నిర్వీర్యం చేశాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మిర్చి రైతులు రేటు లేక కన్నీరు పెడుతుంటే చంద్రబాబు దళారీలకు కొమ్ముకాస్తున్నడని ఆక్షేపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... కూటమి సర్కార్ అసమర్థత, నిర్లక్ష్యం, రైతు వ్యతిరేక విధానాలు రైతుల పాలిట శాపంగా మారాయి. రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వైయస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు అండగా నిలిచిన ఆర్బీకే వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. గత వైయస్సార్సీపీ పాలనలో రైతుల కోసం మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, ఆక్వాఫీడ్, సీడ్, సంపూర్ణ దాణా వంటి సాగు ఉత్పాదకాలన్నీ ఆర్బీకేల ద్వారా నిర్వహించారు. గిట్టుబాటు ధర కల్పించడం, నష్టం జరిగినప్పుడు పరిహారం చెల్లించడంలో ఆర్బీకేలు రోల్ మోడల్‌గా పనిచేశాయి. ఆర్బీకే సేవలను దేశంలో ఉన్న వివిధ రాష్ట్ర బృందాలు పరిశీలించడంతోపాటు ఇథియోపియో, వియత్నం వంటి దేశాల నుంచి బృందాలు వచ్చి పరిశీలించాయి. వారి దేశాల్లో ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించాయి. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థగా ఉన్న ఫుండ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, నీతి అయోగ్, ఆర్బీఐ, ఐసీఐఆర్ వంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఆర్బీకేలను ప్రశంసించాయి. కూటమి ప్రభుత్వంలో కుదేలైన ఆర్బీకేలు కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను ఎలా దోచుకోవాలనే ఆలోచన తప్ప, వ్యవసాయ రంగాన్ని గాడిన పెట్టాలన్న చిత్తశుద్ధి కనిపించడం లేదు. రైతు ఏవిధంగా నష్టపోతున్నాడనే విషయంపై ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రికి కానీ అస్సలు పట్టడం లేదు. సమీక్షలు నిర్వహించి రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవడం లేదు. వైయస్ జగన్ తీసుకొచ్చిన ఆర్బీకే విధానం ఉండకూడదు, ఆయన పేరు వినిపించకూడదన్న కుట్రతో రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చేసి వదిలేశారు. గతంలో సీఎం యాప్ ద్వారా పలానా గ్రామంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు, ఎంత దిగుబడి వచ్చింది అనే వివరాలతో పాటు ఏరోజు ధరలు ఆరోజు చూసుకునే వెసులుబాటు ఉండేది. రైతుల కష్టనష్టాలపై గ్రామ స్థాయి అధికారే నేరుగా మఖ్యమంత్రికి రిపోర్టు ఇచ్చే వ్యవస్థ ఉండేది. ఆర్బీకేలను నిర్వీర్యం చేసిన కారణంగా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు వచ్చాయి. రైతులకు ఖర్చులు పెరిగి, దిగుబడి తగ్గిపోయింది. మద్దతు ధర లభించడం లేదు. గిట్టుబాటు ధర లేక రైతుల అరణ్య రోదన గత ఏడాది ఇదే సమయంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరులో పుట్టి ధాన్యం రూ. 25వేలకు అమ్మితే, నేడు సీజన్ ప్రారంభంలోనే రూ. 15 వేలు కూడా పలకడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలును ఏర్పాటు చేశామని కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకోవడమే తప్ప వాస్తవంగా ఈ కేంద్రాలు రైతులకు అందుబాటులో లేవు. ఎక్కడా గిట్టుబాటు ధరకు కొనుగోళ్ళు జరగడం లేదు. మిర్చి రైతుల పరిస్థితి అరణ్య రోదనగా ఉంది. గత ఏడాది వైయస్ జగన్ పాలనలో క్వింటా మిర్చికి రూ.24 వేలు ధర ఉంటే, నేడు రూ.9 వేలు కూడా లేదని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒక్కో ఎకరాకు రైతు దాదాపు రూ.3 లక్షలు ఖర్చు చేస్తే, రాబడి కనీసం రూ. లక్షన్నర కూడా దక్కని పరిస్థితి నెలకొంది. అంటే ఒక్కో ఎకరాకు మిర్చి రైతు రూ. 1.5 లక్షలు నష్టపోతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల ఎకరాల్లో మిరప పంటను సాగుచేస్తే, మద్దతు ధర లేని కారణంగా సుమారు రూ.6 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. అలాగే మిగిలిన పంటల పరిస్థితిని చూస్తే... కంది కనీస మద్దతు ధర రూ. 7,600 ఉంటే, రైతుల నుంచి రూ.5,500లకు కొనుగోలు చేస్తున్నారు. సుబాబుల్ టన్ను రూ.7,500ల మద్దతు ధర అయితే నేడు మార్కెట్ లో రూ.5500లకు కొనుగోలు చేస్తున్నారు. ఇక జామాయిల్ టన్ను కొనుగోలు ధర రూ. 4500లకు పడిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ. 270 ఉన్న యూరియా బస్తా రూ. 350 నుంచి రూ. 400 పలుకుతోంది. ఈ ప్రభుత్వం రైతులను ఎలాగూ పట్టించుకోదు కాబట్టి మనం యథేచ్ఛగా దోచుకోవచ్చనే భావనతో దళారులు రెచ్చిపోతున్నారు. అయినా ప్రభుత్వం చూసీచూడనట్టే ఊరుకుంటోంది. సాగునీటి కాల్వల నిర్వహణకు మంగళం చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణ. ప్రభుత్వం బాధ్యతతో అందించే ప్రతి సేవను ప్రైటుపరం చేయడం ఆయనకు అలవాటు. ఇప్పటికే మెడికల్ కాలేజీలు, రోడ్లు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు ఇలా కనిపించిందల్లా ప్రైవేటుపరం చేసి తన వాళ్లకు వాటిని చంద్రబాబు దారాదత్తం చేస్తున్నాడు. తాజాగా వ్యవసాయానికి కీలకమైన సాగునీటి కాలువల వ్యవస్థను కూడా ప్రైవేటుపరం చేసేందుకు సిద్దమయ్యారు. ఇకపై ప్రైవేటు వ్యక్తుల కనుసన్నల్లోనే సాగునీటి కాలువలు ఉంటాయి. సాగునీటి కాలువలకు ప్రభుత్వం చేసే కేటాయింపుల నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందా? ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో రైతులపై భారం ఎలా మోపబోతున్నారో కూడా చంద్రబాబు చెప్పాలి. ఇటువంటి రైతు వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పకపోతే రైతు ఉద్యమాన్ని చంద్రబాబు చవిచూడాల్సి వస్తుంది.