హైదరాబాద్: అనంతపురం జిల్లాకు చెందిన సీఐ గోరంట్ల మాధవ్ ఇవాళ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మాధవ్ వైయస్ఆర్‌సీపీలో చేరారు. ఆయనకు వైయస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇటీవల మాధవ్ సీఐ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలకు ఆకర్శితులై పార్టీలో చేరినట్లు మాధవ్ ప్రకటించారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పార్టీని చేరువ చేయడానికి కృషి చేస్తానని, అనంతపురం జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానన్నారు. కదిరి సీఐగా పనిచేసే సమయంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డికి పోలీసుల పవరేంటో చూపిస్తానని గోరంట్ల మాధవ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ వివాద నేపథ్యంలో జేసీ.. పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన సీఐ గోరంట్ల మాధవ్.. నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. ‘మేము మగాళ్లం’ అంటూ మీడియా ఎదుట మీసం తిప్పారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి, అనంతపురం జిల్లా నాయకులు పాల్గొన్నారు.