విజయవాడ: హిందూ ధర్మాన్ని కాపాడటంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని వైయస్ఆర్‌సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలని.. కానీ ఈ ప్రభుత్వంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు మల్లాది విష్ణు ఒక ప్రకటన చేస్తూ.. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ మండలం హనకనహాల్‌లో శ్రీరాముడి రథం దగ్ధం రామాలయ రథం దగ్ధం ఘటన ఇందుకు నిదర్శనమన్నారు. గతంలోనూ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2017లో పశ్చిమగోదావరి జిల్లా కె.పెంటపాడులో చారిత్రక శ్రీగోపాలస్వామి ఆలయ రథం దగ్ధమైందని గుర్తు చేసిన ఆయన, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ హిందూ ధర్మ పరిరక్షణలో చంద్రబాబు విఫలమవుతున్నారని ఆక్షేపించారు. దేవుళ్లకే ఈ ప్రభుత్వంలో దిక్కు లేకపోతే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హైందవ ధర్మంపై అడుగడుగునా దాడులు జరుగుతున్నాయని.. భక్తుల మనోభావాలు దెబ్బ తింటుంటే, ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినటు కూడా లేదని మల్లాది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు రామతీర్థంలో రాముని తల తీశారని నానా యాగీ చేసిన పెద్దలంతా ఇప్పుడేమైపోయారని నిలదీశారు. అనంతపురం ఘటనను తమ పార్టీకి ఆపాదించకుండా, అసలు నేరస్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకపోతే హిందూ సమాజం ఈ ప్రభుత్వాన్ని క్షమించదని.. వారికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని మల్లాది విష్ణు ఆ ప్రకటనలో హెచ్చరించారు.