కాకినాడ జిల్లా: చంద్రబాబు సిక్సర్ కొడితే లబ్ధిదారులు డకౌట్ అయినట్లుగా బడ్జెట్ ఉందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అలవిగాని అంకెలతో బడ్జెట్ నింపారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వీలుకాని అంకెల గారెడీ. సూపర్ సిక్స్, సంక్షేమానికి కేటాయింపులు లేవు. ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ లా ఉంది. వాస్తవ బడ్జెట్ కాదు.. గ్రాఫిక్ బడ్జెట్. అమరావతి ఊపిరి పీల్చుకో అని ఓ పత్రిక రాసింది. అమరావతి ఊపిరి పీల్చుకో అని రాశారు కాని.. ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకో అని రాయలేదు. దీని కన్నా దిగజారుడు ఇంకోకటి ఉంటుందా?’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు. సూపర్ సిక్స్ క్లీన్ బౌల్డ్: వెల్లంపల్లి విజయవాడ: సూపర్ సిక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్ ఒక పాచిపోయిన లడ్డూ బడ్జెట్.. వైయస్ జగన్ 14 లక్షల కోట్లు అప్పులు చేశాడని కూటమి నేతలు పదే పదే మాట్లాడారు. కానీ వాస్తవం ఏంటో బడ్జెట్‌లో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.. అప్పులు 6 లక్షల కోట్లు కూడా లేవు. తల్లికి వందనం, రైతు భరోసాకు అరకొర కేటాయింపులే చేశారు. దేశ చరిత్రలో 5 నెలలు తర్వాత బడ్జెట్ పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది’’ అని వెల్లంపల్లి అన్నారు.