యురేనియం తవ్వకాలకు అనుమతిచ్చింది చంద్రబాబే

ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరూపాక్షి స్పష్టీకరణ 

జీవో నెం.3 పై కూటమి ప్రభుత్వం మాట మార్చింది

పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆక్షేపణ

ఏజెన్సీ భూముల పరిరక్షణ యాక్ట్‌–107 పక్కాగా అమలు చేయాలి
 
అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం డిమాండ్‌

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు బూసినె విరూపాక్షి (ఆలూరు), రేగ మత్స్యలింగం (అరకు), మత్స్యరాస విశ్వేశ్వరరాజు (పాడేరు) మీడియా స‌మావేశం

 తాడేపల్లి: కర్నూలు జిల్లాలో యురేనియమ్‌ తవ్వకాలపై విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం చంద్రబాబు అనుమతి ఇస్తే.. ప్రస్తుత అదోని బీజేపీ ఎమ్మెల్యే అసత్యాలు చెబుతూ.. ఆ తవ్వకాలకు గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని నిందిస్తున్నారని ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరుపాక్షి ఆక్షేపించారు. ఆ మేరకు టీడీపీ ప్రభుత్వం 2015, జూన్‌ 23న జారీ చేసిన జీఓ చూపిన ఆయన, యురేనియమ్‌ తవ్వకాలను ఎవరు, ఎప్పుడు ప్రారంభించారన్నది కావాలంటే క్షేత్రస్థాయిలో చూపిస్తానని వెల్లడించారు. మీడియా ప్రతినిధులు వస్తానంటే స్వయంగా తన కారులో తీసుకెళ్లి స్థానిక ప్రజలతోనే మాట్లాడిస్తానని చెప్పారు. ఇంకా కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసి అన్ని పార్టీల నాయకులతో కలిసి యురేనియం తవ్వకాలు జరిపే ప్రాంతాలకు వెళ్దామని సవాల్‌ చేశారు.
    
యురేనియం తవ్వకాలను అడ్డుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ దాదాపు 150 మందిపై కేసులు నమోదు చేశారని, దీంతో గ్రామస్తులంతా తిరగబడితే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని విరూపాక్షి తెలిపారు. యురేనియం తవ్వకాలు జరిగితే నాలుగు నియోజకవర్గాలు.. ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు పరిధిలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అక్కడ ఎప్పటికీ యురేనియమ్‌ తవ్వకాలు అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలపై కూటమి ప్రభుత్వానికి చిత్తుశుద్ధి ఉంటే యురేనియమ్‌ తవ్వకాలపై నాడు జారీ చేసిన జీఓ వెంటనే ఉపసంహరించాలని ఎమ్మెల్యే విరూపాక్షి కోరారు.
    
గిరిజన ప్రాంతాల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలకు సంబంధించిన జీఓ నెం.3పై కూటమి ప్రభుత్వం మాట మార్చిందని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆక్షేపించారు. గత ఎన్నికల సమయంలో అరకు  ప్రచారానికి వచ్చిన చంద్రబాబు జీఓ నెం.3ను పునరుద్ధరించడం లేదా ప్రత్యామ్నాయంగా మరో జీవో తెచ్చి గిరిజన ప్రాంతాల్లో స్థానికులకే 100 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చాక, మాట తప్పిన చంద్రబాబు, ప్రత్యేక డీఎస్సీ లేదా మెగాడీఎస్సీ అంటూ మాట్లాడుతూ, గిరిజన బిడ్డల్ని ఏమార్చాలని చూస్తున్నారని ఆగ్రహించారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రశ్నించిన వారిని జైల్లో పెట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారో గిరిజనులకు ఇచ్చిన హామీ విషయంలోనూ ఇదే విధానంతో చంద్రబాబు ముందుకెళ్తున్నారని దుయ్యబట్టారు. గిరిజన ప్రాంతాల్లో అటవీ, వైద్య–ఆరోగ్య శాఖల్లో ఇతరులకు ఉద్యోగాలిస్తే సహించేది లేదని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు హెచ్చరించారు. 
    
ఏజెన్సీ ప్రాంతంలో భూమలు ఇతరులు కొనుగోలు, అమ్మకం లాంటివి చేయకుండా ప్రవేశపెట్టిన 107 యాక్టును పటిష్టంగా అమలు చేయాలని అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం డిమాండ్‌ చేశారు. చాలా కాలంగా అరకు లోయ వంటి ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనేతరులు భూములు కొనుగోలు చేసి వారి కబంధ హస్తాల్లో పెట్టుకుంటున్నారన్న ఎమ్మెల్యే, టీడీపీ హయాంలోనే ఇలాంటి భూలావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి 107 యాక్టును పటిష్టంగా అమలు చేయాలని కోరారు. లేదంటే తమ హక్కుల కోసం ఆదివాసీలంతా తిరగబడి ఉద్యమాలు చేయాల్సి వస్తుందని ఎమ్మెల్యే మత్స్యలింగం హెచ్చరించారు.

Back to Top