అది శ్వేతపత్రం కాదు.. పచ్చపత్రం

వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై నిందల పత్రం

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజం

శ్వేతపత్రం పేరుతో వైయ‌స్‌ఆర్‌సీపీపై చంద్రబాబు నిరాధార ఆరోపణలు

అమరావతి ప్లాన్‌ నాది, విజన్‌ నాది అన్న చంద్రబాబు ఎందుకు నిర్మించలేదు?

టీడీపీ హయాంలో అమరావతికి ఖర్చు చేసింది కేవలం 5 వేల కోట్లే

రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతల 4 వేల ఎకరాల భూపందేరం వాస్తవం కాదా?

రైతులకు రిటర్నబుల్‌ ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి

బాబు చేసిన అప్పులను తీరుస్తూ అమరావతి అభివృద్ధి చేసింది వైయస్ఆర్‌ సీపీ ప్రభుత్వమే

సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు నిర్మాణం, లైట్లు వేసింది మా ప్రభుత్వమే

ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్, అంగన్వాడీ సెంటర్లు, స్కూళ్లు, వెల్నెస్‌ హెల్త్‌ సెంటర్లు, రోడ్లు నిర్మించాం

వెస్ట్రన్‌ బైపాస్‌ను చంద్రబాబు అడ్డుకున్నారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో నిర్మాణం పూర్తికావొచ్చింది. ఇది వాస్తవం కాదా?

అమరావతి ప్రాంతానికి ఇతర ప్రాంతాలతో ఈ వెస్ట్రన్‌ బైపాస్‌ ద్వారా అనుసంధానం జరిగింది వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలోకాదా?

అమరావతి సాకుతో విజయవాడ, గుంటూరు సహా ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లోని పట్టణాలను నిర్లక్ష్యం చేయడ వాస్తవం కాదా?

వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందలేదా?

మీరు అసంపూర్తిగా వదిలేసిన ఫ్లైఓవర్లను పూర్తిచేసి, మరోదాన్ని కొత్తగా నిర్మించలేదా?

 కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ పూర్తిచేసింది మా ప్రభుత్వమే కదా?

అమరావతిలో పేదలకు ఇచ్చిన ఇళ్లపట్టాల గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడరు?

వాస్తవాలు దాచి ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని చంద్రబాబుకు హితవు

తాడేపల్లి: రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసినది శ్వేతపత్రం కాదని, అది పచ్చపత్రం, వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మీద నీలాపనిందలు వేసే పత్రం అని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. నిరాధార ఆరోపణలతో అభియోగాలు మోపుతూ 5 ఏళ్ల కాలంలో వైఎస్‌ఆర్‌సీపీ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందంటూ అసత్య పత్రం విడుదల చేశారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

అమరావతిపై బాబు ఎందుకు ఖర్చు చేయలేదు?

అమరావతిపై చంద్రబాబు ప్రజెంటేషన్‌ ఆధారాలు లేకుండా రాజకీయ కోణంలో సాగిందని ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా పని చేసిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి హయాంలో అమరావతిలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆక్షేపించారు. వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో అనేక నిర్మాణాలు చేశామన్నారు. ఒక ప్లాన్‌ ప్రకారం అమరావతి స్మార్ట్‌ సిటీ, కోర్‌ క్యాపిటల్, ఆలిండియా సర్వీసెస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం, రోడ్లు.. ఇవన్నీ ముందుకు తీసుకెళ్లామని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం తీర్చకుండా పోయిన అప్పులు, బకాయిలు తీర్చే కార్యక్రమం చేశామన్నారు. ఈ ప్లాన్‌ నాది, ఈ విజన్‌ నాది అని చెప్పిన చంద్రబాబు.. అమరావతి పూర్తి చేయడానికి ఎందుకు పరిపూర్ణంగా నిధులు ఖర్చు పెట్టలేదని సురేష్‌ ప్రశ్నించారు. ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ పై ఆధారాలతో చూపించామన్నారు. చంద్రబాబు పదే పదే సంపద సృష్టిస్తానంటున్నారని, అందరికా, కొందరికే సృష్టిస్తారా? ఇది అందరి రాజధానా? కొందరికేనా అని నిలదీశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల విధానాన్ని ప్రకటించి, అందులో అమరావతికూడా భాగం చేసి అభివృద్ధి దిశగా అడుగులేశామన్నారు. 

కొత్త ఎస్టిమేషన్లతో బాబు మాయాజాలం

మళ్లీ కొత్తగా రూ.54 వేల కోట్లతో ఎస్టిమేషన్‌ ను చంద్రబాబు తాజాగా తీసుకొచ్చారని సురేష్‌ తెలిపారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా నీతి ఆయోగ్‌ కు రూ.1.09 లక్షల కోట్లతో ఎస్టిమేట్‌ తయారు చేసి గ్రీన్‌ ఫీల్డ్‌ క్యాపిటల్‌ నిర్మాణం చేస్తామని చెప్పారన్నారు. అప్పటికి లక్ష కోట్లుపైనే అని, ఇది ఇవ్వాళ్టికి మరింత పెరిగిందని, రానురాను పెరుగుతూ పోతుందన్నారు. రాష్ట్రంలో ఒకచోటే ఇంత డబ్బు పెట్టలేమని తాము చెప్పాని, అమరావతి అభివృద్ధితోపాటు, ఇతర ప్రాంతాల అభివృద్ధినీ ఆకాంక్షించామన్నారు. ఆదిశగా తాము ముందుకు అడుగులేశామన్నారు. కాని ఆ ఐదేళ్లలో చంద్రబాబు ఏమీ చేయలేకపోయారన్నారు. రాజధానిలో భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ, ల్యాండ్‌ పూలింగ్‌ లో ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా రిటర్నబుల్‌ ప్లాట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయారన్నారు. దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. రోడ్లు, వాటర్‌ సప్లయ్, మౌలిక సదుపాయాలను డెవలప్‌ చేయలేకపోయారని, పేపర్‌ పైన రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే రైతులు చేసుకోబోమని చెప్పారన్నారు. రాజధాని కడతానన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చివరకు రైతులకు ప్లాట్లు కూడా ఇవ్వలేకపోతే ఆ తప్పు ఎవరిదని ప్రశ్నించారు. ఇది ఎవరి చేతగాని తనం, ఎవరిని నిందిస్తారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ప్రజెంటేషన్‌ లో రూ.51,687 కోట్లతో ఎస్టిమేట్లు వేసి ఇంత కావాల్సి వస్తుందని చెప్పారన్నారు. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్న దానిపై మౌనం దాల్చారన్నారు. రాజధాని ప్రాంతంలో నేటి పరిస్థితికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది పూర్తిగా టీడీపీనే అన్నారు. 

అప్పుల భారం మోపిన చంద్రబాబు
 
అమరావతి తాము నిర్మిస్తామని లక్ష కోట్లు ఎస్టిమేషన్‌ వేసి రూ.50 వేల కోట్ల డీపీఆర్‌ లు తయారు చేసి చివరకు వాళ్లు ఖర్చు చేసింది 4900 కోట్ల వరకు ఖర్చు చేశారని, 2 వేల కోట్లు అందులో బకాయిలు పెట్టారని గుర్తు చేశారు. హడ్‌ కో నుంచి మాస్టర్‌ ప్లాన్, రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి రూ.1151.59 కోట్లు తీసుకురావడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి ఏడాదికి రీపేమెంట్‌ రూ.100 కోట్లు తమ ప్రభుత్వం కట్టిందని సురేష్‌ గుర్తు చేశారు. అమరావతి బాండ్స్‌ అమ్మేసి మరో రూ.2 వేల కోట్లు తీసుకొచ్చారని, మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి అని పేర్కొన్నారన్నారు. కానీ ఎలాంటి సదుపాయాలు కల్పించారో అందరూ చూశారన్నారు. దీనికి రీపేమెంట్‌ దాదాపు రూ.286 కోట్లు అన్నారు. కన్సార్షియం ఆఫ్‌ బ్యాంక్స్‌.. యూబీఐ, ఐబీ, బీఓవీ 3 బ్యాంకుల నుంచి సుమారు రూ.1955 కోట్లలోన్లు తీసుకున్నారన్నారు. ఇవన్నీ కలిపి సుమారు 5 వేల కోట్లు అప్పులు తెచ్చారని, దానికి రీపేమెంట్‌ తమ ప్రభుత్వంలోనే కట్టామని స్పష్టం చేశారు.

టీడీపీ నేతల భూముల కొనుగోలు నిజం కాదా? 

2014 జూన్‌ 1 నుంచి 2014 డిసెంబర్‌ దాకా రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ప్రకటన జరిగేంత వరకు ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని వాడుకుని పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయా? లేదా? అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, అమరావతి, తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చందర్లపాడు మండలాల్లో భూముల లావాదేవీలు జరిగాయని, ఇది వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. 2014 జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు గుంటూరు జిల్లాలో రాజధాని, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో 2279.91 ఎకరాల భూములు కొనుగోలు జరిగాయన్నారు. అదీ రాజధాని రాకముందే జరిగాయన్నారు. కృష్ణా జిల్లాలో 1790 ఎకరాలు, 2014 జూన్‌ లో 530.69 ఎకరాలు, జూలైలో 685.34 ఎకరాలు, ఆగస్టులో 353.03 ఎకరాలు, సెప్టెంబర్‌ లో 567.26 ఎకరాలు, అక్టోబర్‌ లో 564.91 ఎకరాలు, నవంబర్‌ లో 836.81 ఎకరాలు, డిసెంబర్‌ లో 531.90 ఎకరాలు.. ఇలా అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం సుమారు 4069.95 ఎకరాలు కొనుగోలు చేశారని, ఇది వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల పేర్లతో కొన్న భూములపై విచారణ జరుగుతోందని, శ్వేతపత్రంలో ఇవన్నీ చెప్పి ఉంటే బాగుండేదన్నారు. 

అమరావతిపై మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఇదీ..

రాజధానిలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పూర్తి చేయలేదని, కరకట్ట వద్ద రోడ్డు విస్తరణ జరగలేదని, చివరకు సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు మీద లైట్లు కూడా వేయకుండా చంద్రబాబు అప్పుడు వెళ్లారన్నారు. ఆ లైట్లు తమ ప్రభుత్వంలో వేసి సుమారు రూ.10 కోట్లు వెచ్చించి పూర్తి చేశామన్నారు. అయితే, చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు ఈనాడులో ఫొటో వేసి కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి రోడ్లు ధగధగ లాడుతున్నాయని చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. గత 5 సంవత్సరాల కాలంలో జ్యుడీషియరీ కాంప్లెక్స్‌ వద్ద  అదనంగా హైకోర్టు భవనాన్ని నిర్మించామన్నారు. సుమారు రూ.46 కోట్లతో హైకోర్టు అదనపు భవనాలను నిర్మించామన్నారు. చంద్రబాబు సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని చెప్పినా పోరాడి ఆర్‌5 జోన్‌ ను క్రియేట్‌ చేసి సుమారు 1400 ఎకరాల భూమిని ఒక్కొక్కరికి ఒక సెంటు చొప్పున 51,392 మందికి వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టాలిచ్చిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇది శ్వేతపత్రంలో లేదన్నారు. ఆలిండియా సర్వీస్‌ అధికారులు, ఎమ్మెల్యే క్వార్టర్స్‌ పనులు కూడా పూర్తి దశలో ఉన్నాయన్నారు. ముగింపు పనుల కోసం సుమారు 28 కోట్లు వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. అమరావతి స్మార్ట్‌ సిటీ అభివృద్ధిలో భాగంగా అంగన్‌ వాడీ హెల్త్‌ సెంటర్ల కోసం దాదాపు రూ.134 కోట్లు ఖర్చు చేయాలని నిర్దేశించుకోగా అందులో 17 సెంటర్లు రూ.32 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేసింది వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వమేనన్నారు. హెల్త్, వెల్‌ నెస్‌ సెంటర్ల కోసం రాజధాని ప్రాంతంలో రూ.40 కోట్లు ఖర్చు చేశామన్నారు. అమరావతి ప్రాంతంలో రూ.40 కోట్లతో 14 స్కూళ్లు అభివృద్ధి చేసింది వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వమేనన్నారు. ఇవి కాకుండా ఆధునిక శ్మశాన వాటికల నిర్మాణం చేపట్టామని, ఇప్పుడు ఆ పేదలందరినీ ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డులో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ రూ.18 కోట్లతో పూర్తి చేశామన్నారు. 

అమరావతికి మంచి చేసింది ఎవరు?

ఇవన్నీ వాస్తవాలని, వాళ్లలా గ్రాఫిక్స్‌ చేసి చూపించలేదన్నారు. కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జి ఏమైపోయిందంటున్నారని, అది గ్రాఫిక్స్‌ అని, కానీ రియల్‌ బ్రిడ్జిని తాము కట్టించి చూపించామన్నారు. వెస్ట్‌ బైపాస్‌ రోడ్డు కృష్ణా రివర్‌ మీద జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా అమరావతి మీదుగా పోతోందన్నారు. విశాఖ, విజయవాడ, చెన్నై, హైదరాబాద్‌ మధ్య కనెక్టివిటీ ఉన్న అద్భుతమైన రోడ్డు అని, ఇది చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అలైన్‌ మెంట్‌ కోసం సమకూర్చుకున్న భూములను రిటర్నబుల్‌ ప్లాట్లుగా కేటాయించి ఆ బ్రిడ్జిని రానీయకుండా, బైపాస్‌ రోడ్డు రానీయకుండా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకున్నారా? లేదా? అన్న విషయం శ్వేతపత్రంలో చెప్పి ఉంటే బాగుండేదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఫికల్టీస్‌ ను అధిగమించి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా దానిపై దృష్టిపెట్టి సుమారు రూ.24 కోట్ల పెండింగ్‌ నిధులను సమకూర్చి అలైన్‌ మెంట్‌ సమస్య తీర్చామన్నారు. ఆ బ్రిడ్జి మరో 3 నెలల్లో పూర్తి కాబోతోందన్నారు. ఈ సమస్యలన్నీ తీర్చేసి అమరావతి ప్రాంతాన్ని బయటి ప్రపంచంతో అనుసంధానం చేసే హైవేను తీసుకువచ్చామన్నారు. ఇది వైసీపీ ప్రభుత్వం చేసింది కాదా? దీన్ని విధ్వంసం అంటారా? అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతానికి మంచి చేసింది చంద్రబాబా? జగన్‌ మోహన్‌ రెడ్డి గారా? అనేది రాష్ట్ర ప్రజలు నిర్ణయించాలన్నారు. స్మార్ట్‌ సిటీ నిర్మాణం, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్, అంగన్వాడీ సెంటర్లు, స్కూళ్లు, వెల్‌ సెన్‌ హెల్త్‌ సెంటర్లు, రోడ్లు, రోడ్ల మీద లైటింగ్‌.. ఇవన్నీ ఎవరు చేశారో వాళ్లే చెప్పాలన్నారు. 

రైతులకు మేలు చేసింది వైయ‌స్ జగన్‌ గారు

రైతులను తాము ఇబ్బంది పెట్టినట్లు అభూత కల్పన చేశారని, రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు చాలా ఉదారంగా వ్యవహరించారన్నారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలు ఎక్కడా పెండింగ్‌ పెట్టలేదన్నారు. 2019–20 కాలానికి 24336 మంది రైతులకు రూ.170 కోట్లు యాన్యుటీ చెల్లించామన్నారు. 2020–21కి సంబంధించి 23694 మంది రైతులకు రూ.176.71 కోట్లు, 2021–22కు సంబంధించి 23105 మంది రైతులకు 185.35 కోట్లు, 2022–23 సంవత్సరానికి 26043 మందికి రూ.192.84 కోట్లు చెల్లించామన్నారు. 2023–24 సంవత్సరానికి 23915 మందికి రూ.191.73 కోట్లు అయితే అందులో రూ.16.64 కోట్లు చెల్లింపులు జరిగాయని, మిగతా రూ.175.09 కోట్లు ఎన్నికల కోడ్‌ కారణంగా సీఎఫ్‌ఎంఎస్‌ లో పెండింగ్‌ ఉందన్నారు. మొత్తంగా రూ.741.86 కోట్లు చెల్లించామని, మిగతా 175 కోట్లు పెండింగ్‌ లో ఉందన్నారు. అలాగే వ్యవసాయ కూలీలకు రూ.2500 ఇస్తామన్న పెన్షన్‌ ఎక్కడా క్రమం తప్పకుండా చెల్లింపులు చేశామన్నారు. 2019–20కి గానూ 20,706 కుటుంబాలకు రూ.61.79 కోట్లు, 2020–21కి 19,532 కుటుంబాలకు రూ.58.41 కోట్లు, 2021–22కు సంబంధించి 19425 కుటుంబాలకు రూ.57.75 కోట్లు, 2022–23కు సంబంధించి 19118 కుటుంబాలకురూ.53.73 కోట్లు, 2023–24కు సంబంధించి 17391 మందికి రూ.56.35 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. మొత్తం 5 సంవత్సరాల కాలంలో వాళ్లకు ఇవ్వాల్సిన పెన్షన్‌ రూ.283 కోట్లు చెల్లించామన్నారు. మొత్తంగా యాన్యుటీ, పెన్షన్లు కలిపి రూ.1204 కోట్లు రైతులకు, కూలీలకు అందించామన్నారు. సీఆర్డీయే పరిధిలో భూమిలేని నిరుపేదలకు నెలనెలా పెన్షన్‌ రూ.2500 నుంచి రూ.5000కు పెంచిన ఘనత వైయస్సార్‌ సీపీ ప్రభుత్వానిదేనన్నారు. నెలవారీ వాలంటీర్ల ద్వారా ఇంటికే పంపించామన్నారు. కౌలుకు సంబంధించి 10 ఏళ్ల పాటు కౌలు ఇస్తామని తెలుగుదేశం పార్టీ వాళ్లు చెబితే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మరో 5 ఏళ్లు వైయ‌స్‌ఆర్‌సీపీ పెంచిందన్నారు. మరి రైతులకు మేలు చేసింది వైయ‌స్‌ఆర్‌సీపీ కాదా? అని ప్రశ్నించారు. 

రైతులను రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన టీడీపీ

తెలుగుదేశం పార్టీ అమరావతిని అడ్డు పెట్టుకుని అధికారంలో ఉన్నప్పుడు విజయవాడను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. 5 ఏళ్ల కాలంలో విజయవాడలో తమ ప్రభుత్వం రోడ్లు, ఫ్లై ఓవర్లు, కనెక్టివిటీని ఎలా పూర్తి చేశామో విజయవాడ వాసులందరూ చూస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో మంగళగిరిని నిర్లక్ష్యం చేశారన్నారు. కానీ తమ ప్రభుత్వంలో మంగళగిరి మున్సిపాలిటీని ఎలా ముందుకు తీసుకెళ్లామో అందరికీ తెలుసన్నారు. గుంటూరు, తెనాలిని నిర్లక్ష్యం చేశారని, ఏకంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. అమరావతిలోనే భూములు కొనాలని, భూములు కొన్న వారికి మంచి రేట్లు రావాలని, దీని కోసం రెండు జిల్లాల పరిధిలో జోన్లు క్రియేట్‌ చేశారన్నారు. గ్రీన్‌ జోన్, రెడ్‌ జోన్, ఆరెంజ్‌ జోన్‌ అంటూ రైతులను రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పట్టణాల్లో కూడా ఆస్తుల విక్రయాలు, కొనుగోలు ప్రక్రియలను జరగకుండా రిజిస్ట్రేషన్‌ ఆఫీసుల్లో అడ్డుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పిల్లల చదువుల కోసం పెళ్లిళ్లు చేయలేక చాలా మంది ఇబ్బందులు పడ్డ విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 

ఇవన్నీ వాళ్లు చేసి వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందని శ్వేతపత్రం విడుదల చేయడం, భ్రమ కలిగించేలా, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మట్టి నీరు తప్ప చంద్రబాబు ఏమీ తీసుకురాలేకపోయారని, ఇది వాస్తవమన్నారు. ఈరోజు కేంద్రంలో భాగస్వామ్యంలో ఉన్నారని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిధులు తీసుకురావాలన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల సొమ్ము వృధా కాకుండా ప్రజల గొంతుకను వినిపిస్తామన్నారు. వాయిస్‌ లెస్‌ పీపుల్‌ వాయిస్‌ ను తాము వినిపిస్తామన్నారు. అమరావతి అందరి రాజధాని కావాలని, కొందరి రాజధాని కాకూడదన్నారు. రిటర్నబుల్‌ ప్లాట్లను రైతులకు అందించాలన్నారు.

Back to Top