మద్యం మార్జిన్‌ పెంపులో మరో అవినీతి

ప్రభుత్వానికి ఏటా రూ.3 వేల కోట్ల నష్టం

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ధ్వజం

లిక్కర్‌ సిండికేట్‌తో చంద్రబాబు లాలూచీ

ఆయన జేబులోకి ఏకంగా రూ.1000 కోట్లు

మందుబాబులకు చంద్రబాబు మార్క్‌ దగా

మద్యం ధరల బాదుడు షురూ చేసిన ప్రభుత్వం

10 నుంచి 20 శాతం పెంచేలా కేబినెట్‌ నిర్ణయం

ఒక్కో బాటిల్‌పై రూ.10 నుంచి రూ.50 వరకు బాదుడు

మార్జిన్‌ 14 శాతానికి పెంచుతూ ఏఆర్‌టీ సవరణ

ఇది ఏ మాత్రం తగిన నిర్ణయం కాదు

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన కాకాణి గోవర్థన్‌రెడ్డి

నెల్లూరు: ఏఆర్టీ సవరణ చేసి మార్జిన్‌ 14 శాతానికి పెంచడం ద్వారా ఏకంగా రూ.1000 కోట్లు తన నివాసానికి వెళ్లేలా సీఎం చంద్రబాబు రూట్‌ మ్యాప్‌ వేసుకున్నారని నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. మార్జిన్‌ పెంపు ద్వారా ప్రభుత్వ ఆదాయానికి రూ.3 వేల కోట్లు గండి కొట్టిన చంద్రబాబు, ఆ డబ్బంతా ఎల్లో సిండికేట్‌ జేబుల్లోకే వెళ్లేలా ప్లాన్‌ చేశారని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన సంపద సృష్టి ఇదేనన్న కాకాణి, మొబిలైజేషన్‌ అడ్వాన్సుల పేరుతో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుంటూ పొలిటికల్‌ గవర్నెన్స్‌కి తెర తీశాడని ఆక్షేపించారు. ప్రజలు ఏమైపోయినా పర్లేదు, తన జేబులు నిండితే చాలన్నట్టు చంద్రబాబు పాలన సాగుతోందని మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాల‌యంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

మద్యం రేట్లు తగ్గించకపోగా పెంపు:
– కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అందుకు భిన్నంగా చంద్రబాబు దోపిడీ విధానానికి తెర  తీశారు. 9 నెలలుగా బాబు పాలనలో అడుగడుగునా వైఫల్యాలు, అవినీతి, అసమర్థత కనిపిస్తూనే ఉంది. 
– తక్కువ ధరకు నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పిన చంద్రబాబు, లిక్కర్‌ రేట్లు పెంచి మద్యం మీద కూడా  బాదుడు మొదలుపెట్టాడు. జగన్‌గారి  పాలనలో ఉన్న బ్రాండ్లకే రేట్లు పెంచి చంద్రబాబు నిస్సిగ్గుగా దోచుకుంటున్నాడు. బాటిల్‌ మీద రూ.10 నుంచి రూ.50 వరకు పెంచేసి దోపిడీకి తలుపులు తెరిచాడు. మందుబాబుల జేబులు కొట్టి చంద్రబాబు ఉండవల్లి నివాసానికి నోట్ల కట్టలు పారిస్తున్నాడు. 
– మద్యం దుకాణ నిర్వాహకులకు నష్టం వస్తుందనే సాకు చూపించి రేట్లు పెంచుకోవడానికి అడిషనల్‌ రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్సును సవరించి 14 శాతానికి కమిషన్‌ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చాడు. దానికి కేబినెట్‌లో ఆమోదం లభించింది. ఆ విధంగా అన్ని బ్రాండ్ల మీద 10 నుంచి 20 శాతం పెంచేశాడు. 
– విక్రయించే ప్రతి సీసా మీద రూ.5 ఇవ్వాలని లిక్కర్‌ సిండికేట్‌తో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీడీపీ నాయకుల ద్వారా తెలిసింది. 
– రూ.99 కి అమ్మే చీప్‌ లిక్కర్‌.. లిమిటెడ్‌ స్టాక్‌ ఉంచి, ధరలు పెంచిన మద్యం మాత్రం విచ్చలవిడిగా అమ్ముతున్నారని మందుబాబులే చెబుతూ చంద్రబాబుని బండ బూతులు తిడుతున్నారు. 
– మార్జిన్‌ 14 శాతానికి పెంచినందు వల్ల వచ్చిన దాదాపు రూ.3 వేల కోట్లు ప్రభుత్వానికి నష్టం వస్తుందని ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ చెబుతోంది. లిక్కర్‌ సిండికేట్‌ల జేబుల్లోకి వెళ్లే ఆ రూ.3 వేల కోట్లలో మూడో వంతు (రూ.1000 కోట్లు) చంద్రబాబుకి ఇచ్చేలా ఒప్పందం జరిగినట్టు టీడీపీ నాయకులే బాహాటంగా చెబుతున్నారు.
– తమకు వాటాలు దక్కకపోవడంతో బీజేపీ, జనసేన నాయకులు చంద్రబాబు తీరు మీద తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 
– ఇప్పటికే మద్యం టెండర్లలో సిండికేట్‌తో డీల్‌ కుదుర్చుకుని ఎమ్మెల్యేలు, ఎల్లో గ్యాంగులు వందల కోట్ల రూపాయలు దోచుకున్నారు. చంద్రబాబు కూడా భారీగా ముడుపులు అందుకున్నారు. తాజాగా మార్జిన్‌ పెంచి మరో రూ.3 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకి కూడా గండి కొట్టారు. 

ప్రభుత్వం నష్టపోయినా పర్లేదు:
– గత ఐదేళ్ల జగన్‌ పాలనలో ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యం దుకాణాలను అధికారంలోకి వస్తూనే చంద్రబాబు ప్రైవేటుపరం చేసి తన వారికి కట్టబెట్టడం ద్వారా దోపిడీకి డోర్లు తెరిచాడు. ప్రభుత్వం నష్టపోయినా పర్లేదు కానీ, టీడీపీ వారి జేబులు నింపడంలో భాగంగానే చంద్రబాబు ప్రైవేటు విధానాన్ని తెరపైకి తెచ్చాడు. 
– టెండర్లలో ఒక మార్జిన్‌ పెట్టి, టెండర్లు ఖరారు చేసి.. దక్కించుకున్న వారు కొనసాగుతుండగానే మార్జిన్‌ పెంచడం వెనుక భారీ అవినీతి దాగి ఉంది.
– ఎమ్మార్పీ ధరలు పెంచి అమ్ముకునే విధంగా తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలబడిపోయే అవినీతి. మద్యం షాపుల టెండర్ల దగ్గర మొదలైన అవినీతి అంచలంచలుగా పెరిగి ఇప్పుడు మందు బాబులను కూడా ఆగం చేసే పరిస్థితికి తెచ్చారు. 
– మద్యం వినియోగదారుల మీద భారం మోపి వచ్చిన డబ్బును సిండికేట్‌తో నీకింత నాకింత అనే విధంగా బేరం మాట్లాడుకున్నట్టు స్పష్టంగా అర్థం అవుతోంది.
– ఎన్నికల సందర్భంగా చంద్రబాబు చెప్పిన సంపద సష్టి ఇదే. తనకు, తన కుటుంబానికి తన పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంపద సృష్టి జరుగుతోంది.

వాట్సాప్‌ లిక్కర్‌ డెలివరీ సక్సెస్‌:
– గత మా వైయ‌స్ఆర్‌సీపీ పాలనలో బెల్డ్‌ షాపులను పూర్తిగా మూసేశాం. పర్మిట్‌ రూమ్‌లు రద్దు చేశాం. మద్యం విక్రయ వేళలు కుదించడంతో పాటు మద్యం షాపులు, బార్లు తగ్గించడం జరిగింది.
– కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పగలు రాత్రి తేడా లేకుండా ఉదయం 6 గంటలకు మొదలుపెట్టి అర్థరాత్రి వరకు మద్యం అమ్ముతున్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో బెల్ట్‌ షాపులు తెరిచి మద్యం ఏరులై పారిస్తున్నారు. 
– నిద్ర లేవగానే బెడ్‌ లిక్కర్‌ దొరికేలా ఉదయం 6 గంటలకే మద్యం దక్కేలా చూస్తున్నాడు. ఆఖరుకి మద్యం డోర్‌ డెలివరీ చేస్తున్నారు.
– మద్యం షాపులు లక్కీ డిప్‌ కూపన్లు ఇవ్వడం చూస్తుంటే రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో అర్థమవుతుంది. షాపులు మూసేయాలన్న మహిళల ఆక్రందనలను చంద్రబాబు చెవికెక్కించుకోవడం లేదు.  
– లోకేష్‌ చెప్పిన వాట్సాప్‌ గవర్నెన్స్‌ ఫెయిలైనా వాట్సాప్‌ లిక్కర్‌ డెలివరీ మాత్రం విజయవంతం అయ్యింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మద్యం అమ్మకాలు చేసుకుంటున్నారు. 
– ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు, అనుమతి లేని మద్యం షాపులు, బార్లు నడుస్తున్నాయి. నెల్లూరులో జరుగుతున్న వ్యవహారాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. 

మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ చంద్రబాబు జేబులోకే:
– గతంలో ఏ పని కేటాయించాలన్న ఒక పద్ధతి ప్రకారం జరిగేది. ఈరోజు జ్యుడీషియల్‌ ప్రివ్యూలు లేవు. రివర్స్‌ టెండరింగ్‌ విధానం లేదు. మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇస్తున్నారు. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేశారు.   
– మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ పేరుతో అవినీతిని చంద్రబాబు స్ట్రీమ్‌లైన్‌ చేసేశాడు. పనులు మొదలు కాకుండానే ప్రజల సొమ్ము నేరుగా కాంట్రాకర్ల నుంచి తన కమీషన్‌ రూపంలో తీసుకుంటున్నాడు. ఇదే చంద్రబాబు చెప్పిన పొలిటికల్‌ గవర్నెన్స్‌. 
– అపార్ట్‌మెంట్‌ కట్టినా, లే అవుట్‌ వేసినా, ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా.. ప్రతి దానికీ మా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విచ్చలవిడిగా వసూలు చేస్తున్నాడు. 
– చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుపై.. దోపిడీ, అవినీతికి వ్యతిరేకంగా వైఎస్సార్పీపీ పోరాడుతుంది. 
– అలాగే ప్రజాక్షేత్రంలో చంద్రబాబును నిలదీస్తూనే ఉంటామని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వివరించారు.

Back to Top