విశాఖపట్నం: తుపాను కారణంగా చేతికి వచ్చిన ధాన్యం తడిచిపోయి, కొనుగోలు చేసే వారు లేక రైతాంగం అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌరసరఫరాశాఖ మంత్రి నాందెండ్ల మనోహర్ లు డైవర్షన్ పాలిటిక్స్ తో కాలం గడుపుతున్నారని మాజీమంత్రి, వైయస్ఆర్ సిపి రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. విశాఖపట్నంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుపాను హెచ్చరికలు వచ్చిన తరువాత అయినా సరే సీఎం చంద్రబాబు రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ళపై కనీసం ఒక్క సమీక్షా సమావేశం అయినా నిర్వహించారా అని నిలదీశారు. పీడీఎస్ బియ్యం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ లు కాకినాడ పోర్ట్ చుట్టూ తిరగడమే సరిపోతోంది. రైతుల ఇబ్బందులను మరిచి డైవర్షన్ రాజకీయాలకే వీరు పరిమితం అయ్యారని విమర్శించారు. ఇంకా ఆయన ఎమన్నారంటే... దళారీల దోపిడీకి రైతులు విలవిల రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యంను కొనుగోలు చేసే విషయంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దళారీలు పెట్రేగిపోతున్నారు. రైతుల నుంచి కారుచౌకగా దళారీలు ధాన్యంను కొనుగోలు చేసి, మంచి రేటుకు ప్రభుత్వానికి అమ్ముకుంటున్నారు. కోట్లాధి రూపాయల ఈ స్కాంను కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు, లేబర్ కూడా దళారీల గుప్పిట్లోనే ఉన్నాయి. వారు చెప్పిన రేటుకే రైతు ధాన్యంను అమ్ముకోవాల్సిన దుస్తితి నెలకొంది. ఒక్కో బస్తా ధాన్యంకు దాదాపు రూ.400 నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. సీజన్ ప్రారంభంలోనే రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ళపై ముఖ్యమంత్రి సంబంధిత శాఖలైన వ్యవసాయ, సివిల్ సప్లయిస్ విభాగాలతో సమీక్షా సమావేశం నిర్వహించి, వారికి సరైన దిశానిర్ధేశం చేయాల్సి ఉన్నా, దానిని ఏ మాత్రం పట్టించుకోలేదు. రైతుల కష్టాల కన్నా... డైవర్షన్ పాలిటిక్స్ కే వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. తుపానుతో దెబ్బతిన్న ధాన్యంను కన్నెత్తి చూసే వారే లేరు రాష్ట్రంలో తుపాను కారణంగా దెబ్బతిన్న ధాన్యంను కొనుగోలు చేసేందుకు కనీసం ఆ వైపు దృష్టి సారించిన వారే లేరు. ఉభయ గోదావరిజిల్లాలు, కృష్ణాజిల్లాలో రోడ్ల పక్కన కిలోమీటర్ల మేర రోడ్లపైనే ధాన్యంను రైతులు ఆరబోసుకుంటున్నారు. గన్నీ బ్యాగులు దొరకక, లేబర్ అందుబాటులో లేక, రవాణా వాహనాలు సమకూరక ఎక్కడికక్కడ కళ్లాల్లోనే ధాన్యం పోగుపడిపోయింది. ఈ తుపాను వల్ల ఆ ధాన్యం తడిచిపోయి, రంగుమారుతూ రైతులకు ఎనలేని నష్టాన్ని తీసుకువస్తోంది. ఇంత జరుగుతున్నా దీనిపై సీఎం, డిప్యూటీ సీఎం, సివిల్ సప్లయిస్ మంత్రి ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. మా హయాంలో ఈ-క్రాప్ అమలు చేశామనే కోపంతో దానిని కూడా కూటమి ప్రభుత్వం పక్కకుపెట్టడం వల్ల కనీసం నష్టపోయిన రైతుకు బీమా కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు రైతులను ఆదుకునేందుకు ఇరవైవేల రూపాయలు ఇస్తానన్న చంద్రబాబు హామీ నీటిమూటగా మారింది. నిత్యం పత్రికల్లో రైతుల ధైన్యంను ప్రతిబింభించే కథనాలు ధాన్యం కొనుగోళ్ళు జరగడం లేదు, తేమ పేరుతో రైతులను దోచుకుంటున్నారు, తుపాను వల్ల రైతుల కష్టం నీటిపాలవుతోందని నిత్యం పత్రికల్లో కథనాలు వస్తున్నా కూడా ఈ ప్రభుత్వం స్పందించం లేదు. తెలుగుదేశంకు అనుకూలమైన ప్రతికల్లోనే ఈ కథనాలు ప్రచురిస్తున్నా కూడా స్పందన లేదు. తేమ శాతంను శాస్త్రీయంగా లెక్కించకుండా, దళారీలకు విక్రయించుకుంటేనే మంచిదనే భావం రైతుల్లో కలిగిస్తున్నారు. రైతులకు అండగా నిలిచేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్దం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. వైయస్ జగన్ సీజన్ కు ముందే అధికారులతో సమీక్ష నిర్వహించేవారు వైయస్ జగన్ గారి హయాంలో రైతు ఈ రాష్ట్రానికి వెన్నెముక అని భావించారు. సీజన్ కు ముందే సివిల్ సప్లయిస్, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేవారు. ఆర్బీకేల ద్వారా సకాలంలో ధాన్యం కొనుగోళ్ళకు చర్యలు తీసుకున్నారు. తేమశాతాన్ని శాస్త్రీయంగా లెక్కించడం, రైతులు ఆరబోసుకునేందుకు ఎఎంసిల్లో ఏర్పాట్లు చేయడం, తహసిల్ధార్ స్థాయి అధికారులను నియమించి ధాన్యంను గిట్టుబాటు రేటుకే కొనుగోలు చేయించడం, ఆ సొమ్మును రైతు ఖాతాలకు జమం చేసేవారు. జీపీఎస్ ట్రాకర్లతో కూడిన వాహనాల్లో ధాన్యంను మిల్లులకు తరలించారు. జగన్ గారి పాలనలో దళారీలను పూర్తిగా నియంత్రించారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో 37.70 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం సేకరించాం వైయస్ జగన్ గారి ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేశారు. 2014-19 అయిదేళ్ళ చంద్రబాబు పాలనలో 17,94,000 మంది రైతుల నుంచి 2.65 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేసి, 40,236 కోట్ల రూపాయలు చెల్లించారు. అదే జగన్ గారి ప్రభుత్వంలో 37.70 లక్షల మంది రైతుల నుంచి 3,40,24,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 65,225 కోట్ల రూపాయలు చెల్లించాం. అంటే దాదాపు రెట్టింపు. నేడు కూటమి ప్రభుత్వంలో బస్తాకు రూ.1720 ధర కూడా దక్కని దారుణమైన పరిస్థితి ఏర్పడింది. సాక్షాత్తు సివిల్ సప్లయిస్ మంత్రిని కలిసి రైతులు కన్నీళ్ళతో తమ గోడును వెళ్ళబోసుకున్నా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు.