హామీలు రద్దు.. మోసాల పద్దు!

బడ్జెట్‌ పుటల సాక్షిగా బాబు మరోసారి మోసాలు

యువత, పిల్లలు, రైతులకు మళ్లీ దగా

నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధికి.. సున్నా

మహిళల ఉచిత బస్సు.. తుస్సు

జాడలేని జాబ్‌ క్యాలెండర్‌..

ఇప్పటికే ఏడాది ఎగ్గొట్టి.. అరకొరగా అన్నదాతా సుఖీభవ

ఈ పథకానికి కావాల్సింది రూ.10,717 కోట్లైతే బడ్జెట్‌లో 

ఇచ్చింది కేవలం రూ.6,300 కోట్లే.. 50 ఏళ్లకే పెన్షన్‌ దేవుడెరుగు.. 

అవ్వతాతల పెన్షన్ల వ్యయంలో ఈ బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లకుపైగా కోత.. 

రూ.3 వేల కోట్లకుపైగా కోతలతో ‘తల్లికి వందనం’

మరోపక్క తొలిసారిగా రూ.లక్ష కోట్లకు పైగా అప్పులు.. ప్రజా రుణం రూ.1.03 లక్షల కోట్లు

పన్నేతర బాదుడుతో ప్రజల జేబులు ఖాళీ.. మద్యం ద్వారా రూ.27,097 కోట్లు.. 

పేదల గృహ నిర్మాణాల కేటాయింపుల్లో భారీ కోత.. అభివృద్ధి, సంక్షేమం.. తిరోగమనమే

మొత్తం బడ్జెట్‌ రూ.3.22 లక్షల కోట్లు  

 

 అమరావతి: ‘‘బాబు ష్యూరిటీ అంటే... చరిత్ర చూడని మోసాలు గ్యారెంటీ!’’ అని బడ్జెట్‌ పుటల సాక్షిగా మరోసారి రుజువయ్యాయి! ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా ఎగ్గొడుతూ.. ఇస్తున్న ఒకటో రెండో పథకాలకు కూడా కోతలు, కత్తిరింపులు విధిస్తూ... లక్షల మంది లబ్ధిదారులను తగ్గిస్తూ.. పిల్లల నుంచి అవ్వల దాకా అన్ని వర్గాలను మోసం చేస్తూ.. సూపర్‌ సిక్స్‌కు ఎగనామం పెడుతూ సీఎం చంద్రబాబు సర్కారు శుక్రవారం అసెంబ్లీకి బడ్జెట్‌ను సమర్పించింది. 

సూపర్‌ సిక్స్‌ సహా హామీలన్నీ విస్మరించి పిల్లలు, మహిళలు, నిరుద్యోగులు, యువత, రైతన్నలు.. ఇలా అన్ని వర్గాలను దగా చేసింది. ప్రతి జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అని హామీ ఇచ్చి ఆ ఊసే లేకుండా చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో ఏడాదిగా యువత నెలకు రూ.3 వేల చొప్పున నష్టపోతోంది. 1.60 కోట్ల మందికి ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేల ఆర్థిక సాయాన్ని మరోసారి ఎగ్గొట్టడంతో మహిళలు ఏడాదికి సుమారు రూ.28,800 కోట్లు కోల్పోతున్నారు! ఇక ‘తల్లికి వందనం’ అంటూనే బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లకుపైగా కోత పెట్టారు! 

అన్నదాతా సుఖీభవ అమలుకు కావాల్సింది రూ.10,717 కోట్లైతే బడ్జెట్‌లో ఇచ్చింది కేవలం రూ.6,300 కోట్లే! ఈ లెక్కన 22 లక్షల మందికిపైగా రైతులు రూ.4,417 కోట్ల పెట్టుబడి సాయానికి దూరం కానున్నారు. గతేడాది మొండి చెయ్యి చూపడంతో రైతన్నలు ఇప్పటికే రూ.పది వేల కోట్లకుపైగా నష్టపోయారు. ఇక ఇప్పటికే దాదాపు రెండు లక్షల పెన్షన్లను తగ్గించగా తాజా బడ్జెట్‌ కేటాయింపుల్లో రూ.5 వేల కోట్లకుపైగా కోత విధించటాన్ని బట్టి మరిన్ని పింఛన్లను ఎగరగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 

వెరసి.. ప్రణాళిక – ఆలోచనల సమ్మిళతంగా ఉండాల్సిన రాష్ట్ర బడ్జెట్‌.. అంతులేని మోసాలు.. గాడి తప్పిన అంకెల సమాహారంగా మిగిలిపోయింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో మంత్రులు అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి పి.నారాయణ ప్రవేశపెట్టారు.

అంకెల్లో ఆడంబరంగా..
అప్పులతో ముంచెత్తుతూ.. అంకెల్లో అత్యంత భారీతనంతో ఆడంబరంగా కనిపించిన ఈ బడ్జెట్‌ పరిమాణం రూ.3.22 లక్షల కోట్లు! కానీ ఇంత భారీ బడ్జెట్‌లోనూ హామీలకు కేటాయింపులు చేయకుండా సీఎం చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారు. గత ప్రభుత్వం డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా ఏకంగా రూ.4.57 లక్షల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూరిస్తే ఇప్పుడు చంద్రబాబు ఏడాదిలోనే రూ.లక్ష కోట్లకుపైగా అప్పులతో ముంచెత్తి చరిత్ర సృష్టించారు. 

ఆకారం పెంచినా.. నేల విడిచి సాము చేసినా.. ఈ బడ్జెట్‌ చంద్రబాబు సర్కారు మోసాలను మాత్రం దాచిపెట్టలేకపోయింది! ఎన్నికల హామీల సంగతి అటుంచితే.. సీఎం చంద్రబాబు రోజూ జబ్బలు చరుచుకునే ‘సంపద సృష్టి’ ఆనవాళ్లు బూతద్దంతో గాలించినా బడ్జెట్‌లో కానరాలేదు. వైఎస్సార్‌ సీపీ హయాంలో విలువైన సంపద సృష్టిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పోర్టులు, కొత్త మెడికల్‌ కాలేజీల గురించి ఈ బడ్జెట్‌లో కనీసం ప్రస్తావించలేదు. 

ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ ఇంటి ముంగిటికే గత ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక వ్యవస్థలు, సంక్షేమ పథకాలను కూటమి సర్కారు నిర్వీర్యం చేయడంతో ఇవాళ పల్లెలు కళ తప్పి కనిపిస్తున్నాయి. వలంటీర్ల వేతనాలు రూ.ఐదు వేలు కాదు.. ఏకంగా రూ.పది వేలకు పెంచుతామంటూ నమ్మబలికి ఏకంగా వ్యవస్థకే మంగళం పాడేశారు!

హామీలు గాలికి..
సూపర్‌ సిక్స్‌లో తొలి హామీగా పేర్కొన్న నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల భృతి గురించి బడ్జెట్‌లో అసలు ప్రస్తావనే లేకుండా చేశారు. ఆడబిడ్డ నిధికి పైసా కూడా కేటాయించలేదు. మహిళల ఉచిత బస్సు ఊసే లేదు. అన్నదాతా సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు కోతలు విధించి అరకొర కేటాయింపులను చూపించినా ఎప్పటి నుంచి అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. కాగితాల్లో కేటాయింపులు చేయడం.. అమలు చేయకపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే! 

గత బడ్జెట్‌లోనూ అన్నదాతా సుఖీభవకు రూ.వెయ్యి కోట్లు కేటాయింపులు చేసినట్లు చూపించి చివరకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టడం తెలిసిందే. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి రూ.15 వేల చొప్పున తల్లికి వందనం కింద ఇచ్చేందుకు రూ.9,407 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్‌లో పేర్కొన్నప్పటికీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పకుండా తప్పించుకునే యత్నం చేశారు.

పేదల ఇళ్లకు పాతర..
పేదల ఇళ్ల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం పాతరేసింది. వైఎస్సార్‌సీపీ హయాంలో 2023–24లో ఏకంగా రూ.6,866 కోట్లు కేటాయించి వ్యయం చేయగా.. కూటమి సర్కారు 2024–25 పేదల రూ.4,012 కోట్లు కేటాయించి కేవలం రూ.1,611 కోట్లే వ్యయం చేసినట్లు సవరించిన అంచనాల్లో పేర్కొంది. ఇక 2025–26లో పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.6,317 కోట్లు ప్రతిపాదించింది.

పదిలక్షల పింఛన్ల కోత!

According to statistics there is risk of cutting pensions of ten lakh people

 

పేదవాడి పింఛనుపై కూటమి సర్కారు కత్తికట్టింది. ఇప్పటికే కోత కత్తెర పట్టుకుని తిరు­గు­తున్న ప్రభుత్వం.. బడ్జెట్‌లో దానికి మరింత పదును పెట్టింది..! చంద్ర­బాబు సర్కారు కేటాయింపుల ప్రకారం చూస్తే.. ఇది స్పష్టంగా తేలిపోతోంది. లక్ష రెండు లక్షలు కాదు.. ప్రతిపాదిత గణాంకాల ప్రకారం ఏకంగా పది లక్షల పింఛన్లకు కటింగ్‌ పెట్టే ప్రమాదం నెలకుంది. ఫిబ్రవరి 1న ప్రభుత్వం పింఛన్లు విడుదల చేసిన లబ్ధిదారుల సంఖ్య 63.59 లక్షలు. 

వీరికి వచ్చే (2025–26) ఆర్థిక సంవత్సరంలో నెలకు రూ.2,719.50 కోట్ల చొప్పున పంపిణీ చేయాలి. అంటే ఏడాదికి   రూ.32,634 కోట్లు. కానీ, బడ్జెట్‌లో పింఛన్లకు రూ.27,518 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది కావాల్సిన నిధుల కన్నా ఏకంగా రూ.5,116 కోట్లు తక్కువ కావడం గమనార్హం.   

ఇప్పటికే కొనసాగుతున్న స్పెషల్‌ డ్రైవ్‌
8 నెలల క్రితం వరకు.. ఐదేళ్లు హాయిగా గుండెల మీద చేయి వేసుకొని మరీ ప్రతి నెల ఠంఛనుగా ఇంటి వద్దనే పింఛన్లు తీసుకున్న లక్షల మంది లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎప్పుడు? ఎలా? తమ పింఛనుకు ఎసరు పెడతారోనని బిక్కుబిక్కుమంటున్నారు. నిరుడు జూన్‌లో కూటమి సర్కారు కొలువుదీరాక పింఛన్ల కోతకు సిద్ధపడింది. ఇందుకుతగ్గట్లు లబ్ధిదారుల్లో అనర్హులు ఎక్కువగా ఉన్నారంటూ ప్రచారం సాగిస్తోంది. 

ఏళ్ల నుంచి పింఛన్లు పొందుతున్నవారు కూడా అర్హత నిరూపించుకోవాలంటూ సర్వే, స్పెషల్‌ డ్రెవ్‌ పేరుతో రకరకాల కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ వస్తోంది. 8,18,900 మంది దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పింఛన్‌ అర్హత, అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలింపజేస్తోంది.

50 ఏళ్లకే పింఛన్‌ అంటూ నమ్మించి..
ప్రస్తుతం కనీసం 60 ఏళ్లున్న దాటినవారికే పింఛన్‌ పొందేందుకు అర్హత ఉంది. కూటమి ప్రభుత్వ పెద్దలు ఎన్నికల 
ముందు.. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే రూ.4 వేల చొప్పున పింఛను ఇస్తామంటూ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీ అమలు చేయలేదు. ఇంకోవైపు.. ఈ ప్రభుత్వంలో ప్రతి నెల ఇస్తున్న పింఛన్లే ఫిబ్రవరి 1 నాటికి ఏకంగా 1,89,957 తగ్గాయి.

గత ఏడాది మే నెలలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 65,49,864 మందికి పింఛను విడుదల చేయగా, కూటమి సర్కారులో ఫిబ్రవరి 1న 63,53,907 మందికే ఇచ్చింది. మరోవైపు, కూటమి ప్రభుత్వం ఏర్పాటు రోజు నుంచే రాష్ట్రంలో పింఛన్ల కోసం కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా చేసింది. ఈ మేరకు ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోయాయి. 

‘ఫీజు’లో కోత.. విద్యార్థులకు వాత!

Only Rs 1960 crore allocated for fee reimbursement in latest budget

ఉన్నత విద్యా రంగంపై ప్రభు­త్వం చిన్నచూపు చూస్తోందని మరో­సారి రుజు­వైంది. నూ­తన విద్యా విధా­నాన్ని బలోపేతం చేస్తూ చేపట్టా­ల్సిన చర్య­లు బడ్జెట్‌లో ఏమాత్రం కనిపించ లేదు. కేవలం వర్సిటీల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, సాంకేతిక విద్యా సంస్థల్లో పని చేసే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, కార్యాలయాల నిర్వహణ ఖర్చుల కోసం రూ.2,506 కోట్లు కేటాయించారు. 

ఐటీఐ, సంప్రదాయ, సాంకేతిక ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అందించే పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ (ఆర్టీఎఫ్‌–ఎంటీఎఫ్‌)ల కేటాయింపుల్లోనూ అలసత్వం ప్రదర్శించినట్టు బడ్జెట్‌ ద్వారా స్పష్టమైంది. ఏటా రూ.2,800 కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌–ఆర్టీఎఫ్‌) కోసం ఖర్చు చేయాల్సి ఉండగా, బడ్జెట్‌లో రూ.1,960 కోట్లు మాత్ర­మే కనిపిస్తోంది. 

ఇక హాస్టల్‌ వసతి ఖర్చులు (పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌– ఎంటీఎఫ్‌)కు ఏడాదికి రూ.1,100 వ్యయం అవుతుండగా రూ.684 కోట్లు మాత్రమే కేటాయింపులు ఉన్నాయి. చాలా వరకు వివి­ధ కార్పొరేషన్ల కేటాయింపుల్లో విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ల కేటాయింపులను చూపిస్తుండటం గమ­నార్హం. మొత్తంగా విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్‌ షిప్‌లలో సుమారు రూ.1200 కోట్ల మేర కోత విధించినట్టు తెలుస్తోంది.

పెండింగ్‌ బకాయిలఊసే లేదు
గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జూన్‌ తర్వాత చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్‌ మెయింటెనెన్స్‌ చార్జీలను ప్రభుత్వం నిలిపి వేసింది. మేలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల కోడ్‌­తో విద్యా­ర్థులకు, పేదలకు సంక్షేమ పథకాలు నిలి­చిపోయాయి. అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులకు రెండు విడతల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సుమారు రూ.1,400 కోట్లు, హాస్టల్‌ మెయింటెనెన్స్‌ ఖర్చుల కింద రూ.1,100 కోట్ల చెల్లింపులు చేయాలి. 

కూటమి ప్రభు­త్వం వీటిని ఆపేసింది. దీంతో లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పిడుగులా పడింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కళాశాలల యాజమాన్యాల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగిపోవ­డంతో విద్యార్థుల తల్లులు దిక్కుతోచక పుస్తెలు అమ్మి, తాకట్టుపెట్టి, అధిక వడ్డీలకు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తు­న్న దుస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో కూటమి నేత­లు ప్రైవేటు కాలేజీల్లో పీజీ చేరే వారికి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామన్నారు. 

ఇప్పుడు ఆ ఊసే మరిచారు. ఇప్పటికి రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థు­లను విస్మరించింది. విద్యకు సంబంధించి కేంద్రం నుంచే సింహ భాగం నిధులు వస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా మోసం చేయడం తగదని విద్యార్థి వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.

ఏటా విద్యార్థులకుఇవ్వాల్సింది రూ.2,800 కోట్లు
బడ్జెట్‌లో కేటాయించింది రూ.1,960 కోట్లు 

 

నమ్మించి నయ వంచన! 

Coalition government that ignored farmer welfare

 ఆచరణ సాధ్యం కాని హామీలతో అందలమెక్కిన టీడీపీ కూటమి ప్రభుత్వం అనుకున్నట్టుగానే అన్నదాతలకు మొండి చేయి చూపింది. ‘ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకుంటున్నారు. రైతులకు జగన్‌ కేవలం రూ.7,500 చొప్పునే ఇస్తున్నారు. మిగతా ఆరు వేలు కేంద్రమే ఇస్తోంది. అదే మాకు అధికారం ఇస్తే తొలి ఏడాది నుంచే ప్రతి రైతుకు మేమే రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం’ అంటూ ప్రజాగళంలో చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. తీరా ఆచరణకు వచ్చేసరికి అన్నదాతలకు పంగనామాలు పెడుతున్నారు. 

రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూ.. వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయించింది కేవలం నాలుగు శాతం మాత్రమే కావడం గమనార్హం. రూ.3.22 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేవలం రూ.12,401 కోట్లు కేటాయించడం పట్ల రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన తొలి ఏడాది బడ్జెట్‌లో అన్నదాత సుఖీభవ పథకానికి మొక్కుబడిగా రూ.1,000 కోట్లు కేటాయించారు. 

ఓ వైపు వైపరీత్యాలు, మరోవైపు మార్కెట్‌లో ధరలు లేక తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం ఎంతో కొంత ఊరటనిస్తుందని రైతులు ఆశగా ఎదురు చూశారు. కానీ పగ్గాలు చేపట్టి తొమ్మిది నెలలు గడిచినా తొలి ఏడాదికి సంబంధించి పైసా పెట్టుబడి సాయం విదిల్చ లేదు. వాస్తవానికి రాష్ట్రంలో రైతు భరోసా లబి్ధదారులు 53,58,368 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జమ చేయాలంటే బడ్జెట్‌లో రూ.10,717 కోట్లు కేటాయించాలి. 

కానీ కేటాయించింది కేవలం రూ.6,300 కోట్లే. ఈ మొత్తం రూ 20 వేల చొప్పున అర్హులైన రైతులకు చెల్లిస్తే కేవలం 31.50 లక్షల మందికి మాత్రమే సరిపోతుంది. అంటే వాస్తవ లబ్ధిదారుల్లో 22.08 లక్షల మందికి పెట్టుబడి సాయం అందదు. మరో పక్క కౌలు రైతులకు తామే పూర్తిగా పెట్టుబడి సాయం అందిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. పెట్టుబడి సాయంలో ఇలా రూ.4,417 కోట్ల మేర కోత పెట్టడం పట్ల రైతాంగం నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. 

ఆర్‌ఎస్‌కేలు, అగ్రి ల్యాబ్‌ల నిర్వహణకు కేటాయింపులు నిల్‌ 
ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌ల నిర్వహణకు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఆర్బీకేలను కుదించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం అగ్రి ల్యాబ్‌లను పీ–4 పద్దతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నామని ఇటీవలే  ప్రకటించింది. అందువల్లే వీటి నిర్వహణకు కేటాయింపులు జరపలేదనే వాదన విని్పస్తోంది.   ధరల స్థిరీకరణ నిధికి వైఎస్‌ జగన్‌ హయాంలో రూ.3 వేల కోట్లు కేటాయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం రూ.300 కోట్లు విదిల్చింది.  

విపత్తుల బారిన పడి పంటలు నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి కింద గత జగన్‌ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించ లేదు. విత్తన రాయితీ పథకానికి గతేడాది రూ.268 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది పెంచకపోగా రూ.240 కోట్లకు కుదించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాడి రైతులకు పశువుల మేత కోసం బంజరు భూముల కేటాయింపు కోసం నిధులు, గోపాల మిత్రల పునర్నియామకం ఊసే లేదు. 

రాయితీపై సోలార్‌ పంపు సెట్ల ఏర్పాటుకు కూడా నిధులు కేటాయించలేదు. రైతు కూలీలకు కార్పొరేషన్‌ స్థాపించి రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న హామీ ప్రస్తావన లేదు.  పట్టు పరిశ్రమకు 2023–24 బడ్జెట్‌తో పోల్చితే భారీగా కోత పెట్టింది.  ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి, స్వచ్ఛంద బీమా నమోదు పథకం తీసుకొచ్చారు. ఈ పథకానికి రూ.1,023 కోట్లు మాత్రమే కేటాయించారు. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా కోసం ఏటా రూ.1,700 కోట్లు కేటాయించారు. 

అలాగే వడ్డీ లేని పంట రుణాల కోసం వైఎస్‌ జగన్‌ సర్కారు హయాంలో ఏటా రూ.500 కోట్లు కేటాయించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని సగానికి సగం తగ్గించింది. కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించింది. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించడం వల్ల ఖరీఫ్‌ 2024–25 లో 69.51 లక్షల ఎకరాలకు బీమా కవరేజ్‌ పొందగా, స్వచ్ఛంద బీమా నమోదు పథకాన్ని అమలు చేయడంతో రబీ 2024–25 సీజన్లో కేవలం 7.65 లక్షల మంది రైతులు 9.93 లక్షల ఎకరాలకు మాత్రమే కవరేజ్‌ పొందగలిగారు. గడిచిన రబీ సీజన్‌తో పోల్చుకుంటే మూడో వంతు రైతులకు కూడా రక్షణ లేకుండా పోయింది. 

పాత లబ్దిదారులకే వేట నిషేధ భృతి
గద్దెనెక్కగానే వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికి రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. 2024–25 సీజన్‌కు 1,30,128 మంది అర్హత పొందగా, వారికి రూ.260.26 కోట్లు జమ చేయాల్సి ఉంది. కాని ఏడాది గడిచినా పైసా విదల్చలేదు. అనర్హులున్నారంటూ రీ సర్వే పేరిట అర్హులను తొలగించి, తమ పార్టీ సానుభూతిపరులను చేర్చి 1,22,968 మంది అర్హత పొందినట్టుగా లెక్క తేల్చారు. 

వారికి రూ.245.94 కోట్లు జమ చేయాలని ప్రతిపాదనలు పంపారు. అదే విషయాన్ని బడ్జెట్‌లో ప్రస్తావించారు. కానీ 2025–26 సీజన్‌లో వేటకు వెళ్లే మత్స్యకారులకు నిషేధ భృతి కోసం కేటాయింపులు జరపక పోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఆక్వా, నాన్‌ ఆక్వాజోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. 

అర్హత కలిగిన 68,134 ఆక్వా కనెక్షన్లకు విద్యుత్‌ సబ్సిడీ విస్తరిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ఆ మేరకు కేటాయింపులు జరపలేదు. ఎప్పటిలోగా అమలు చేస్తామన్న స్పష్టతా ఇవ్వలేదు. మరో వైపు ఆక్వా రైతులకు సబ్సిడీపై ఏరియేటర్స్, సబ్సిడీపై ట్రాన్స్‌ ఫార్మర్స్‌ ఏర్పాటు, కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్మాణం వంటి హామీలపై పైసా కేటాయింపు జరపక పోవడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు. 

మత్స్య యూనివర్సిటీకి మొండి చేయి  
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంతో పాటు వైఎస్సార్‌ ఉద్యాన, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయాలకు అరకొరగానే కేటాయింపులు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌ మత్స్య యూనివర్సిటీకి కేవలం రూ.38 కోట్లు మాత్రమే కేటాయించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీకీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో 400 ఎకరాల్లో రూ.332 కోట్ల అంచనాతో భవన నిర్మాణాలకు ప్రతిపాదించారు. 

రూ.100 కోట్లతో పరిపాలన భవనం, అకడమిక్‌ బ్లాక్, బాలుర, బాలికల హాస్టల్స్, రైతు శిక్షణా కేంద్రం, వైస్‌ చాన్సలర్‌ బంగ్లా నిర్మాణ పనులు చేపట్టారు. ఈ వర్సిటీకి గతేడాది పైసా ఖర్చు చేయలేదు. ఈ ఏడాది పైసా కేటాయింపులు జరపలేదు. మరోవైపు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ ల్యాండింగ్‌ జెట్టీల నిర్మాణానికి సైతం పైసా కేటాయించలేదు. దీంతో వీటి భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. 

Back to Top