మంత్రులు, ఎమ్మెల్యేలపై దాడి చేస్తే సన్మానించాలా?

పోలీసులు అరెస్టు చేసి చర్యలు తీసుకోవడం తప్పా?

దాడికి ఆజ్యం పోసి, అహింసను ప్రోత్సహించింది పవ‌న్ క‌ల్యాణ్ 

ప్రశాంతమైన‌ విశాఖలో అలజడికి చంద్రబాబు కుట్ర

చంద్రబాబుకు బానిసలా పవన్ ప్యాకేజీ రాజ‌కీయం

ఎవరెన్ని చేసినా ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌

అసాంఘిక శక్తులకు బాబు, పవన్ నేతృత్వం.. తప్పనిసరిగా బాధ్యత వహించాలి

ఇరిగేష‌న్ శాఖ మంత్రి అంబటి రాంబాబు 

తాడేపల్లి: ఎవరెన్ని కుట్ర‌లు చేసినా, ఎన్ని కుయుక్తులు ప‌న్నినా ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వస్తుంది. విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు అని ఇరిగేష‌న్ శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు. ప్రశాంతమైన విశాఖ ఒక అలజడి నగరంగా మారిందంటే దానికి కారణం జనసేన. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్న ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అని మంత్రి ఉద్ఘాటించారు. మంత్రులు, ఎమ్మెల్యేల‌పై దాడి చేస్తే చ‌ర్య‌లు తీసుకోవ‌డం త‌ప్పా..? ప్ర‌జాప్ర‌తినిధుల‌పై దాడి చేసిన వారిన‌ స‌న్మానించాలా అని ప్ర‌శ్నించారు. విశాఖ ఎయిర్‌పోర్టు వ‌ద్ద జ‌రిగిన దాడికి ఆజ్యం పోసి, అహింస‌ను ప్రోత్స‌హించింది ప‌వ‌న్ క‌ల్యాణ్ అని మంత్రి అంబ‌టి రాంబాబు పున‌రుద్ఘాటించారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి అంబ‌టి రాంబాబు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.  

మంత్రి అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..

రాష్ట్రంలో అత్యంత ప్రధాన నగరం విశాఖపట్నం. అక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది. చాలా అందమైన నగరం. పర్యాటకులను ఆకర్షించే నగరం. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో అతి పెద్ద నగరం. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌తో పోటీ పడగలిగే నగరం విశాఖ. అలాంటి నగరం నిన్న, ఇవాళ చాలా ఇబ్బంది పడుతోంది. ప్రశాంతమైన విశాఖ ఒక అలజడి నగరంగా మారిందంటే దానికి కారణం జనసేన. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్న ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌. బాబు దగ్గర ప్యాకేజీ తీసుకోవడం. విశాఖ మీదకు వెళ్లి దాడి చేయడం. విశాఖ నగరంలో అలజడి సృష్టించడం. చంద్రబాబు ఇప్పటికే విశాఖపైకి అమరావతి రైతులు, మహా పాదయాత్ర పేరుతో దాడి చేయిస్తున్నారు. వారు నేరుగా అమరావతి నుంచి అరసవెల్లి సూర్య దేవాలయానికి నేరుగా వెళ్లకుండా, నియోజవర్గాల్లో పర్యటిస్తూ, తొడ గొడుతున్నారు. రెచ్చ గొట్టేలా వ్యవహరిస్తూ నడుస్తున్నారు. మీసాలు తిప్పుతున్నారు.

ఆ ఆలోచన వల్లే ఇదంతా..
నిన్న ఉత్తరాంధ్ర ప్రజలు, విశాఖలోని అన్ని వర్గాల ప్రజలు అంతా కలిసి వచ్చారు. విద్యార్థులు, వ్యాపారులు కలిసికట్టుగా తరలి వచ్చారు. గర్జన ర్యాలీలో పాల్గొన్నారు. తమకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కావాలని తేల్చి చెప్పారు. కానీ చంద్రబాబు ఏమంటున్నారు. అందుకు వీల్లేదంటున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఏమీ ఇవ్వొద్దంటున్నారు. అన్నీ అమరావతిలోనే కావాలంటున్నాడు. ఎందుకంటే తమ భూములు అక్కడ ఉన్నాయి కాబట్టి. అందుకే అక్కడ మాత్రమే కేంద్రీకృత అభివృద్ధి కోరుకుంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ వద్దన్న స్వార్థమైన ఆలోచన వల్ల ఇదంతా జరుగుతోంది. ఉత్తరాంధ్ర వాసుల ఆకాంక్షను గౌరవించకుండా, అంత మంది ఎందుకు గర్జించారు అన్నది ఆలోచించకుండా, వారిని తొక్కి వేయాలని నిన్న విశాఖలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసి, ఏ స్థాయిలో విమర్శలు చేశారన్నది అందరూ చూశారు. 

ప్యాకేజీ–కాల్‌షీట్‌–టూర్‌..
నిన్న గర్జన బాగా సక్సెస్‌ అయింది. లక్షలాది మంది తరలి వచ్చారు. కాగా, నిన్న పవన్‌కళ్యాణ్‌ కూడా విశాఖ వచ్చారు. జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చానని ఆయన చెప్పినా, అది వాస్తవం కాదు. ఆయన చంద్రబాబు వాణి వినిపించడానికి వచ్చాడు. ఏమన్నా ఉంటే, జనవాణి కార్యక్రమాన్ని మూడు నెలల ముందే నిర్ణయించుకున్నానని, వాయిదాకు వీల్లేదని చెప్పారు. ఏం ఆ మాత్రం వాయిదా వేసుకోలేకపోయారా?. కానీ, ఆ పని చేయకుండా, అత్యంత కీలకమైన గర్జన జరుగుతుంటే సమయంలో చంద్రబాబు దగ్గరకు పోయి ప్యాకేజీ తీసుకుని, ఒక మూడు రోజుల కాల్షీట్‌ ఇచ్చాడు. అందులో భాగంగా నిన్న మధ్యాహ్నం విశాఖ వచ్చాడు. 

దీనికి నీ సమాధానం ఏమిటి?..
విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద ఏం జరిగింది. గర్జనలో పాల్గొని విజయవాడ తిరిగి వెళ్లడానికి విమానాశ్రయానికి వచ్చిన మంత్రులు జోగి రమేష్, రోజా, రజనితో పాటు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీద దాడి చేస్తారా? వారి కార్ల అద్దాలు పగలగొడతారా? మంత్రి రోజాను ఇష్టం వచ్చినట్లు తిడతారా? దీనికి నీ సమాధానం ఏమిటి? పవన్‌కళ్యాణ్‌ చెప్పాలి. ఇదేనా నీ సంస్కృతి. నిజానికి అదే మీ వైఖరి. గతంలో రివాల్వర్‌ పట్టుకుని డెక్కన్‌ క్రానికల్‌ ఆఫీస్‌ వద్ద హల్చల్‌ చేసిన పవన్‌కళ్యాణ్‌కు అంతే కంటే సంస్కారం ఉంటుందా? ఆయనే అలా ఉంటే, కార్యకర్తలు ఇంకా ఎలా ఉంటారు?

దాడులు చేస్తే సన్మానించాలా?..
ఇంత జరిగినా దానికి సమాధానం చెప్పని పవన్‌కళ్యాణ్, తమ పార్టీ వారిని ఎందుకు అరెస్ట్‌ చేశారని అడుగుతున్నారు. అరెస్ట్‌ చేయక, సన్మానాలు చేస్తారా? మంత్రులు, ఎమ్మెల్యేల మీద దాడి చేసి, ఒకరి తల పగలగొడితే అరెస్ట్‌ చేయకుండా సన్మానం చేయాలా?. కానీ చంద్రబాబు ఆ పని చేస్తారు. ఎందుకంటే మీ ద్వారా మావారిపై దాడి చేయించాడు కాబట్టి. ఈ విషయాన్ని ఒకసారి ప్రజలంతా ఆలోచించాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలి. ఆ స్థాయిలో దాడి జరిగిన తర్వాత కూడా తాను ఊరేగింపుగా నోవాటెల్‌కు వెళ్తానన్నాడు. అంత ఉద్రిక్త పరిస్థితిలో అలా ఊరేగింపుగా వెళ్లడం సబబేనా? అంత గొడవకు ఆజ్యం పోసి, అహింసను ప్రోత్సహించి ఇవాళ మళ్లీ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.

బాబు, పవన్‌ బాధ్యత వహించాలి..
మంత్రుల మీద దాడి చేస్తే ఊర్కుంటారా? ప్రభుత్వం ఊర్కే ఉండిపోదు కదా? ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడుతుంది. అలాగే అసాంఘిక శక్తులను అణిచి వేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. దాడుల చేసిన వారిని అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెడతారు. అసాంఘిక శక్తులకు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ బాధ్యత వహించాల్సి ఉంది.

దుర్మార్గమైన ఆలోచన..
రాజకీయాలు రాజకీయాలుగానే చేయాలి తప్ప. కులాల ప్రస్తావన ఎందుకు? ఇప్పుడు విశాఖలో జనవాణి కార్యక్రమం అవసరమా? మేము 15న గర్జన అని ప్రకటించిన తర్వాత, మీరు మీ కార్యక్రమం గురించి చెప్పారు. చంద్రబాబు దగ్గరకు వెళ్లారు. ప్యాకేజీ తీసుకున్నారు. గర్జన ర్యాలీని డైవర్ట్‌ చేస్తానన్నావు. ఆ ప్రయత్నం చేశావు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఉత్తరాంధ్ర ప్రజల మనసులో ఉన్న ఆకాంక్షను మీరు చెరపలేరు. మీరు దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు.

బానిసలా పవన్‌ మద్దతు..   
నేను మళ్లీ చెబుతున్నాను. ఒళ్లు బలిసిన వారు పాదయాత్ర చేస్తున్నారు. వారిదే పాదయాత్ర. దానికి పవన్‌ మద్దతు. అంటే ఒక బానిస మద్దతుగా పవన్‌ వ్యవహరిస్తున్నారు. ఒళ్లు బలిసి పాదయాత్ర చేస్తున్న వారికి బానిస మద్దతు. ఎందుకంటే నువ్వొక బానిసవు. చంద్రబాబుకు బానిసగా పని చేస్తున్నావు.

దాడి డ్రామానా..
పవన్‌ ఎందుకు విశాఖ వెళ్లాలి? ఒకవైపు గర్జన ర్యాలీ జరుగుతుంటే, మరోవైపు టీడీపీ రౌండ్‌ టేబుల్‌ సమావేశం. ఇంకా జనవాణి పేరుతో నీ పర్యటన. మీరు మా మంత్రుల మీద దాడి. ఏమిటి సైకో చేష్టలు? పైగా అది కోడికత్తి డ్రామా అంట. ఆ దాడి మేమే చేసుకున్నామంట. ఎయిర్‌పోర్టు వద్ద చాలా కెమెరాలు ఉన్నాయి. మీ అనుకూల ఛానళ్లలో కూడా విజువల్స్‌ వచ్చాయి. చంద్రబాబు అనుకూల మీడియాలోనూ చూపారు. దానికి ఏమంటావు? కనీసం ఘటనను ఖండించావా? కానీ రెచ్చగొట్టావు. ఆ పని చేసి చేసి చివరకు నీ నెత్తి మీద నీవే చేయి పెట్టుకుంటావు. ఇవాళ ఏదో మంత్రుల మీద దాడి చేశామని సంతోష పడుతున్నావేమో.. కానీ దోషులకు శిక్ష తప్పదు.

పార్టీ పేరు మార్చుకోవాలి..
ఇక మీ ఎల్లో మీడియా. చంద్రబాబుతో పాటు, మీకు మద్దతు. గర్జన ర్యాలీ ఫెయిల్‌ అయిందని దుష్ప్రచారం. నిజానికి ర్యాలీ ఎంత బ్రహ్మాండంగా జరిగింది. దుర్మార్గమైన ఆలోచన చేస్తున్న పార్టీ జనసేన. అది జనసేన కాదు. బాబు సేన అని పెట్టుకోవాలి. లేదా అశాంతి సృష్టించే పార్టీ అని పెట్టుకోవాలి. నాకు అర్ధం కాలేదు. ఏ పార్టీలో అయినా కార్యకర్తలు అంటారు. కానీ ఇక్కడ జనసేన సైనికులు అంట. అంటే వారు యూనిఫామ్‌ వేసుకుంటారా? ఇలాగే దాడులు చేస్తారా? చట్టాన్ని ఉల్లంఘించి యథేచ్ఛగా దాడులు చేస్తారా? ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తారా?

అతి తథ్యం..
ఒక్క విషయం గుర్తుంచుకోండి. హింసను ప్రేరేపించే ఏ పార్టీ కూడా బతికి బట్ట కట్టలేదు. చంద్రబాబుకు ఆ విషయం స్పష్టంగా తెలుసు. అందుకే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. నీకు ప్యాకేజీ ఇచ్చి చేయిస్తున్నాడు. జనసేన సైనికులు, వీర మహిళలు ఆలోచించుకొండి. మీరు చేస్తున్నది తప్పు. ఎవరు ఏం చేసినా, ఎందరు ఎన్ని అనుకున్నా, ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వస్తుంది. విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇది నిజం.

Back to Top