అనంతపురం జిల్లా: పాపరెడ్డిపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కక్షసాధింపు వల్లే వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త కురబ లింగమయ్య హత్యకు గురయ్యాడని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లింగమయ్య హత్యపై మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. పరిటాల సునీత డైరెక్షన్‌లో స్థానిక ఎస్ఐ సుధాకర్ ప్రోత్సహాంతోనే ఈ ఘాతుకం జరిగిందని ఆరోపించారు. హత్యకు పాల్పడిన ఆరుగురు నిందితులను కాపాడేందుకు పోలీసులే ప్రయత్నిస్తుండటం చూస్తుంటే, లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం ఎంతగా దారుణంగా అమలు జరుగుతుందో అర్థమవుతోందిన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... అనంతపురం జిల్లా రామగిరి మండల ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి పదవి దక్కకూడదని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్‌లు లు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. టీడీపీకి ఒకరు, వైయస్‌ఆర్‌సీపీకి ఎనిమిది మంది ఎంపీటీసీలు ఉండటంతో ఎంపీపీ పదవి సాధారణంగానే వైయస్‌ఆర్‌సీపీకి దక్కుతుంది. అయితే పరిటాల సునీత ఆదేశాలతో టీడీపీ గుండాలు ఉప ఎన్నికకు ముందు నుంచే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీలను బెదిరించడం, వారి బంధువులను వేధించడం చేశారు. కోర్ట్ ఆదేశాలతో పోలీస్ భద్రత మధ్య మార్చి 27న వైయస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నిక కోసం రామగిరి మండల పరిషత్ కార్యాలయంకు వస్తుంటే స్థానిక ఎస్ఐ సుధాకర్ తన ఫోన్ నుంచి పరిటాల సునీత, శ్రీరామ్‌లకు వీడియో కాల్ చేసి, ఎంపీటీసీలను భయబ్రాంతులకు గురి చేశారు. తరువాత ఎన్నిక సమయానికి ఎంపీటీసీలు హాజరుకాలేకపోయారని అధికారులు ఎన్నికలను వాయిదా వేస్తే, వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీలను ఇదే ఎస్ఐ సుధాకర్ ఎమ్మార్వో కార్యాలయంకు తీసుకువెళ్ళి బైండోవర్ చేయించాడు. అక్కడికి టీడీపీ గుండాలను తీసుకువచ్చి, వారితో ఎంపీటీసీలను కిడ్నాప్ చేయించేందుకు ప్రయత్నించాడు. దీనిని అడ్డుకునేందుకు మాజీమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్‌తో కలసి ధర్నా చేసినందుకు నాతో పాటు మొత్తం 26 మందిపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టారు. దాడులు జరుగుతున్న పోలీసులు ప్రేక్షకపాత్ర 27న పాపిరెడ్డిపల్లి గ్రామంలో పరిటాల శ్రీరామ్ తన చిన్నాయన ఇంట్లో కూర్చుని మండలానికి ఒక వైయస్ఆర్‌సీపీ నాయకుడిని చంపితే కానీ భయం ఉండదంటూ టీడీపీ గుండాలను రెచ్చగొట్టారు. ఈ నేపథ్యంలోనే క్యాంప్‌లో ఉన్న వైయస్ఆర్‌సీపీ ఎంపీటీసీలకు సహకరించినందుకు పార్టీ నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటిపై మార్చి 27, 28వ తేదీల్లో వరుసగా రెండు రోజుల పాటు టీడీపీ గుండాలు దాడులు చేశారు. ఈ దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. ఈ దాడులను వ్యతిరేకించిన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త కురుబ లింగమయ్యను మార్చి 30వ తేదీన ఆరుగురు టీడీపీ గుండాలు దాడిచేసి దారుణంగా హత్య చేశారు. సంఘటనా స్థలంలో ఇదే గుండాల చేతుల్లో గాయపడిన లింగమయ్య కుమారులు దీనికి కారణం టీడీపీ గుండాలు ఆదర్శ్, మనోజ్, నర్సింహా, నవకాంత్, రమేష్, సురేష్ లేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు నిందితులను కాపాడేందుకు ఇద్దరిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, స్టేట్‌మెంట్‌లపై మృతుడి భార్యతో సంతకాలు చేయించుకున్నారు. లింగమయ్య మృతదేహానికి నివాళి అర్పించేందుకు, గాయపడి ఆసుపత్రిలో ఉన్న ఆయన కుమారులను పరామర్శించేందుకు వెళ్ళిన మాపై పోలీసులు అడుగడుగునా నిర్భందాలను విధించారు. పూర్తిగా పరిటాల సునీత కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారు. చట్టాల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా, అధికార దుర్వినియోగంకు పాల్పడుతున్నారు. ఇదంతా చూస్తూంటే ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కనుమరుగయ్యాయని అర్థమవుతోంది. సామాన్యుడికి భద్రత లేదు. బాధితుల పక్షాన పోలీసులు నిలబడకుండా అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు అమలు కావడం లేదు. కోర్ట్ ఆదేశాలను అమలు చేయకుండా పోలీసులు ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. ప్రశ్నించిన వారిపైన తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అనంతపురంజిల్లాలో అరాచక పాలన సాగిస్తున్నారు.