ఢిల్లీ: తిరుమలలో వరుసగా జరుగుతున్న భద్రత వైఫల్యాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ.. ప్రధానమంత్రి, హోం మంత్రి, హోంశాఖ కార్యదర్శికి వైయస్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ‘‘వైకుంఠ ఏకాదశి రోజున ఆరుగురు భక్తులు తొక్కిసలాటలో చనిపోయారు. అన్నదానం క్యూ కాంప్లెక్స్‌లో భక్తులను నియంత్రించలేక తొక్కిసలాట జరిగింది. నాన్ వెజ్ పదార్థాలను కొండపైకి తీసుకెళ్లి తిన్న ఘటనలు జరిగాయి’’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు. ‘‘మద్యం, గంజాయి మత్తులో ఓ వ్యక్తి.. సులభంగా అలిపిరి చెక్ పాయింట్‌ను దాటుకొని వెళ్లి భక్తులను గాయపరిచారు. పవిత్రమైన పాప వినాశనం డ్యామ్‌లో నిబంధనలకు విరుద్ధంగా బోట్లను తిప్పారు. మార్చి 31న మతిస్థిమితం లేని వ్యక్తి బైక్ పై తిరుమల కొండపైకి చేరుకున్నాడు. టీటీడీ పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. దానివల్లే సమన్వయ లోపం, భద్రత లోపం తలెత్తింది. తిరుమల జాతీయ ప్రాధాన్యత కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రం. వరుసగా జరుగుతున్న భద్రతా వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు.