ప్ర‌జ‌ల్ని ఏప్రిల్ ఫూల్ చేసిన చంద్రబాబు

ప్రతినెలా పెన్షన్ల పంపిణీ పేరుతో ఆర్భాటపు ప్రచారం

పదినెలల్లో 3 లక్షల పెన్షన్లు కట్ చేశారు

కూట‌మి పాల‌న‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్

అన్ని వ‌ర్గాల‌ను న‌మ్మించి దారుణంగా మోసం చేస్తున్న చంద్రబాబు  

హామీల అమ‌లు చేత‌కాన‌ప్పుడు సీఎం పద‌వి నుంచి దిగిపోవాలి

చంద్ర‌బాబు పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త

డైవ‌ర్ట్ చేసేందుకే వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల మీద అక్ర‌మ‌ కేసులు

మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం

రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌రువు   

మ‌హిళ‌ల‌పై దాడుల జ‌రుగుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు

పోలీసులు కూట‌మి కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నారు

చ‌ట్టాల‌ను ఉల్లంఘించిన వారంతా భ‌విష్య‌త్తులో మూల్యం చెల్లించుకోక‌ త‌ప్ప‌దు

ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించిన ఆర్కే రోజా

తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి రోజా

తాడేపల్లి: నమ్మించి మోసం చేయడంలో ఆరితేరిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్య‌మంత్రయినా ఒక ప‌థ‌కాన్ని ఒక్క‌సారే ప్రారంభిస్తారు, కానీ మ‌న రాష్ట్రంలో చంద్ర‌బాబు ప్రతినెలా పెన్షన్ల ప్రారంభం అంటూ ప్రచార యావతో వెంపర్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిజంగా పండుటాకుల పట్ల అంత ప్రేమ ఉంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పదినెలల్లోనే దుర్మార్గంగా మూడు లక్షల పెన్షన్లను ఎందుకు తొలగించారో చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 

ఇంకా ఆమె ఏమన్నారంటే..

చంద్రబాబు ఈ పదినెలల్లో ఎన్నికల హామీల్లో ఒక్క పెన్షన్లు మినహా ఏ ఒక్క హమీని అమలు చేయలేదు. దీనిపై ప్రజల్లో రగుతున్న అసంతృప్తి నుంచి వారి దృష్టి మళ్లించేందుకు ప్రతినెలా పెన్షన్ల పంపిణీని చంద్రబాబు ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా వృద్దుల పట్ల ఎంతో మానవత్వంతో వ్యవహరిస్తున్నాను అని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైయస్ జ‌గ‌న్ నొక్కిన బ‌ట‌న్ల‌న్నీ మేమిచ్చే పిఛ‌న్లంతే అంటూ కనీస అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న మాట్లాడుతుంటే అంతే నిస్సిగ్గుగా ఆయన్ను మోసే ఎల్లో మీడియా దానిని అచ్చేసి ఆనందిస్తోంది. గ‌తంలో 2014-19 మ‌ధ్య చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా కేవ‌లం 39 ల‌క్ష‌ల మందికి మాత్ర‌మే పింఛ‌న్లు ఇచ్చాడు. జ‌గ‌న్ సీఎం అయ్యాక పింఛన్ల‌ను రూ.3వేల‌కు పెంచుకుంటూ పోతూ 2019-24 మ‌ధ్య 66,34,742 మందికి పింఛ‌న్లు పంపిణీ చేశారు. అంటే ఈ 27 ల‌క్ష‌ల మందిని అయిదేళ్ల‌పాటు చంద్ర‌బాబు మోసం చేసిన‌ట్టే క‌దా. మ‌ళ్లీ ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక దాదాపు 3 లక్ష‌ల పింఛ‌న్ల‌కు కోత విధించి 63.59 ల‌క్ష‌ల మందికి మాత్రమే పింఛ‌న్లు అంద‌జేస్తున్నారు. ఇదీ చంద్రబాబు నిజస్వరూపం. ఎన్నిక‌ల హామీల‌న్నీ ప‌క్క‌న ప‌డేసి ఒకేఒక్క పింఛ‌న్ల ప‌థ‌కం అమ‌లు చేస్తూ జ‌గ‌న్ నొక్కిన బ‌ట‌న్లు అన్నింటికీ ఇదే స‌మానమ‌ని చెప్పడం ప్ర‌జ‌ల‌ను ఏప్రిల్ ఫూల్ చేయ‌డ‌మే. 

అన్నివ‌ర్గాల‌ను న‌మ్మించి మోసం

వైయ‌స్ జ‌గ‌న్ సీఎంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ సంక్షేమానికి కేవ‌లం డీబీటీ రూపంలోనే రూ. 2.72 లక్ష‌ల కోట్లు నేరుగా ల‌బ్ధిదారుల అకౌంట్ల‌లో జ‌మ చేయ‌డం జ‌రిగింది. కానీ చంద్ర‌బాబు కేవ‌లం రూ. వెయ్యి పింఛ‌న్ పెంచి ఇవ్వ‌డమే అన్ని ప‌థ‌కాల‌కు స‌మానం అని చెప్పుకోవ‌డం ప్ర‌జ‌ల‌ను ఫూల్స్ చేసి వెన్నుపోటు పొడ‌వ‌డ‌మే. అధికారంలోకి రాక‌ముందు సూప‌ర్ సిక్స్ అమ‌లు చేస్తామ‌ని చెప్పి న‌మ్మించి ఓటేయించుకుని ప‌ట్టించుకోకుండా మోసం చేశాడు. ఉగాది రోజున వ‌లంటీర్ల వేత‌నం రూ. 10 వేల‌కు పెంచుతాన‌ని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వ‌చ్చాక వారికి ఉద్యోగాలే లేకుండా చేశాడు. వారి కుటుంబాల‌ను రోడ్డున ప‌డేశాడు. ఇంట్లో ఎంత‌మంది మ‌హిళ‌లుంటే అంత‌మందికి నెల‌కు రూ. 1500 ఇస్తాన‌ని చెప్పి మ‌హిళ‌ల‌ను, నెల‌కు రూ. 3వేలు నిరుద్యోగ భృతి ఇస్తాన‌ని నిరుద్యోగుల‌ను, ఎంత‌మంది పిల్ల‌లుంటే అంత‌మందికి అమ్మ‌కు వంద‌నం ఇస్తాన‌ని చెప్పి పిల్ల‌ల త‌ల్లుల‌ను, ఫ్రీబ‌స్ పేరు చెప్పి మ‌హిళ‌ల‌ను.. ఇలా అన్ని వ‌ర్గాల‌తో ఓటేయించుకుని చంద్ర‌బాబు ఫూల్స్ చేశాడు. 

చేత‌కాన‌ప్పుడు దిగిపోవాలి

ప్ర‌తిపక్షంలో ఉన్న‌ప్పుడు ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం చాలా ఈజీ అనుకున్నాన‌ని ఇప్పుడు నా వ‌ల్ల కావ‌డం లేద‌ని చంద్ర‌బాబే అంగీక‌రించాడు. త‌న‌కు చేత‌కాన‌ప్పుడు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి దిగిపోవాలి. జ‌గ‌న్‌ను కూర్చోబెడితే ప‌థ‌కాల‌ను తూచ త‌ప్ప‌కుండా ఎలా అమ‌లు చేయాలో చేసి చూపిస్తారు.  చంద్ర‌బాబుకి  హామీలు అమ‌లు చేయాల‌న్న చిత్త‌శుద్ది, ప్ర‌జ‌ల‌కు మేలు చేయాల‌న్న మ‌న‌సు ఆయ‌న‌కు లేదు. అధికారం కోసం ఎన్ని అబ‌ద్దాలైనా చెబుతాడు. ఎవ‌రి కాళ్ల‌యినా ప‌ట్టుకుంటాడ‌ని మ‌రోసారి రుజువైంది. ఎన్నికల స‌భల్లో నేను అప్పులు చేయ‌ను. సంప‌ద సృష్టించి పేద‌ల‌కు పంపిణీ చేస్తాన‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్పుకున్నాడు. కానీ అధికారంలోకి వ‌చ్చిన 10 నెల‌ల్లోనే రూ.1.52 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేశాడు. ఇదేనా చంద్ర‌బాబు స‌మ‌ర్థ‌త‌? రాష్ట్రాన్ని ఇప్ప‌టివ‌ర‌కు 17 మంది ముఖ్య‌మంత్రులు పాలిస్తే తొలి ఏడాదిలోనే ఇంత దారుణంగా అప్పులు చేసి ఇంత చెత్త పాల‌న అందించిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌ప్ప ఇంకెవ‌రూ లేరు. ఇన్ని అప్పులు చేసినా ఎన్నిక‌ల హామీ ఒక్క‌టీ అమ‌లు చేసిన పాపాన‌పోలేదు. 

అప్పులపై పదేపదే అబద్దాలు

జ‌గ‌న్ మీద నింద‌లు మోప‌డానికి మాత్రం రూ. 14 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేశాడ‌ని ప‌దేపదే అబ‌ద్ధాలు ప్ర‌చారం చేశాడు. కానీ, అధికారంలోకి వ‌చ్చాక మొన్న‌టి అసెంబ్లీలో రాష్ట్ర మొత్తం అప్పులు 5.39 ల‌క్ష‌ల కోట్ల‌ని, అందులోనూ  2014-19 మ‌ధ్య చంద్ర‌బాబు చేసిన అప్పులు తీసేస్తే జ‌గ‌న్ చేసిన అప్పులు రూ. 3.39 ల‌క్ష‌ల కోట్ల‌ని ఆర్థిక‌మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ స్వ‌యంగా స‌మాధానం ఇచ్చాడు. వాటిలో రూ. 2.75 ల‌క్ష‌ల కోట్లు జ‌గ‌న్ హయాంలో సంక్షేమానికే ఖ‌ర్చు చేయ‌డం జ‌రిగింది. ఇవేకాకుండా నాడు-నేడు ద్వారా స్కూళ్లు, మెడిక‌ల్ కాలేజీల నిర్మాణం, పోర్టులు, 31 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణం, గ్రామాల్లో స‌చివాల‌యాలు, ఆర్బీకే సెంట‌ర్లు..  ఇవ‌న్నీ చూస్తే ఆయ‌న చేసిన అభివృద్ది క‌ళ్ల‌ముందే కనిపిస్తుంది. ప‌చ్చ ఛానెళ్లు ఉన్నాయి క‌దా అని అబ‌ద్ధాలు నూరి ప్ర‌జ‌ల‌కు వ‌డ్డిస్తే, అదంతా నిజ‌మేన‌ని న‌మ్మి ఓటేసిన పాపానికి ప్ర‌జ‌లిప్పుడు తీవ్రంగా నష్ట‌పోయామ‌ని తెలుసుకున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు లోకేష్ చేసిన కామెడీ పాద‌యాత్రలో పెట్రోల్ ధ‌ర‌లు, నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు, విద్యుత్ చార్జీలు పెంచేది లేద‌ని సెల్పీలు తీసుకుని చెప్పాడు. ఇప్పుడు ఈ ప‌ది నెల‌ల పాల‌న‌తో ధ‌ర‌లు త‌గ్గించామ‌ని పెట్రోల్ బంకుల దగ్గ‌ర‌, విద్యుత్ సబ్ స్టేష‌న్ల దగ్గ‌ర‌, సెల్ఫీలు తీసుకుని చెప్పే ద‌మ్ము ధైర్యం లోకేష్ కి ఉందా?  పాల నుంచి ప‌వ‌ర్ వ‌ర‌కు అన్ని ధ‌ర‌లు పెరిగిపోయి సామాన్యుడు బ‌త‌క‌లేని ప‌రిస్థితి త‌యారైంది. 

కూట‌మి పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేదు

కూట‌మి పాల‌న‌లో సంక్షేమం అభివృద్ధే కాదు.. మహిళ‌ల‌కు రాష్ట్రంలో ర‌క్ష‌ణ కూడా లేదు. ప్ర‌తి రోజూ 70 మంది మ‌హిళ‌లు, చిన్నారుల మీద దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు జ‌రుగుతున్నాయ‌ని వారే అసెంబ్లీలో అంగీక‌రించారు. ఎంతోమందిపై అత్యాచారాలు జ‌రిగినా బాధితులకు న్యాయం చేయ‌డం లేదు. విచ్చ‌ల‌విడిగా దొరుకుతున్న మ‌ద్యం, గంజాయి కార‌ణంగా మ‌హిళ‌ల మీద దాడులు జ‌రుగుతున్నాయి. అధికారంలోకి వ‌చ్చిన వంద రోజుల్లో గంజాయిని పూర్తిగ నిర్మూలిస్తామ‌ని కూట‌మి ప్ర‌భుత్వం చెప్పుకుంది. కానీ ముఖ్య‌మంత్రి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పంలో, హోంమంత్రి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న విశాఖ ప్రాంతంలో ఎక‌రాల‌కు ఎక‌రాల్లో గంజాయి సాగు చేస్తున్నా ప‌ట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. వీధివీధికి బెల్ట్ షాపులు  ఏర్పాటు చేసి విచ్చ‌ల‌విడిగా మద్యం విక్ర‌యాలు చేయిస్తున్నారు. రాజ‌మండ్రి కిమ్స్ ఆస్ప‌త్రిలో ఏజీఎం దీప‌క్ అనే వ్య‌క్తి అంజ‌లి అనే యువ‌తిని లోబ‌ర్చుకుని వేధింపుల‌కు గురిచేస్తే ఆమె మార్చి 23న ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఈ కేసులో నిందితుడు, ఆస్ప‌త్రి యాజ‌మాన్యం త‌న సామాజిక వ‌ర్గం వారే కావ‌డంతో ప్రభుత్వం వారిని కాపాడే ప్ర‌య‌త్నం చేస్తోంది. విద్యార్థులు, మ‌హిళా సంఘాలు, వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళ‌న చేయ‌క‌పోయుంటే క‌నీసం నిందితుడు దీప‌క్‌ను కూడా అరెస్ట్ చేసేవారే కాదు. కానీ ఈ ఆస్ప‌త్రిలో సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వ‌మ‌ని డిమాండ్ చేస్తుంటే ప‌ట్టించుకోవ‌డం లేదు. 

పోలీసులే రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు చేస్తున్నారు

రాష్ట్రంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల్లా త‌యార‌య్యారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పోలీసులే ద‌గ్గ‌రుండి అమ‌లు చేస్తున్నారు. నిందితుల‌ను కాపాడేందుకు కేసులు డైవ‌ర్ట్ చేయ‌డంలో పోలీసులే కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చాలా కేసుల్లో రుజువైంది. ఎంపీపీ, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీని గెలిపించ‌డానికి పోలీసులు చ‌ట్ట విరుద్దంగా వ్య‌వ‌హ‌రించారు. ప‌చ్చ చొక్కా తొడుక్కున్న అధికార పార్టీ నాయ‌కుల్లా వ్య‌వ‌హ‌రించారు. చంద్ర‌బాబు ఎల్ల‌కాలం అధికారంలో ఉండ‌డ‌ని పోలీసులు గుర్తుంచుకోవాలి. చ‌ట్టాల‌ను ఉల్లంఘించి ప‌నిచేస్తే భ‌విష్య‌త్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంది. నేర‌స్తుల‌కు అండ‌గా నిలిచి పోలీస్ వ్య‌వ‌స్థ మీద ప్ర‌జ‌ల్లో ఉన్న న‌మ్మ‌కాన్ని పోగోట్టుకోవ‌ద్దు. ఎంత‌సేప‌టికీ వైయ్స‌సార్సీపీ నాయ‌కుల మీద అక్ర‌మ కేసులు  బ‌నాయించి వేధించినంత మాత్రాన భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే లేదు. ఇప్ప‌టికే త్రిపురాంత‌కంలో ఎంపీటీసీ సృజ‌న, య‌ల‌మంచ‌లిలో ఎంపీటీసీ కంబాల స‌త్య‌శ్రీ, పుల్ల‌ల‌చెరువులో నాగేంద్ర‌మ్మ ల‌ను టీడీపీ నాయ‌కులు బెదిరించినా ఏమాత్రం బెద‌ర‌కుండా వైయ‌స్ఆర్‌సీపీ కోసం ఓటేసి పార్టీ మీద‌, జ‌గ‌న్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈవీఎంల పుణ్య‌మా అని గెలిచారు కాబ‌ట్టే, హామీల విష‌యంలో కూట‌మి నాయ‌కులు త‌మ ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌జ‌ల్ని మోసం చేసిన ఈ పార్టీల‌కు రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారు. 

తిరుమ‌ల అప‌విత్ర‌త‌పై ప‌వ‌న్ నోరెత్త‌రే? 

తిరుమ‌ల‌లో విచ్చ‌ల‌విడిగా గంజాయి, మద్యం, బిర్యానీలు దొరుకుతున్నాయి. అరాచ‌క‌శ‌క్తులు స్వైర‌విహారం చేస్తున్నాయి. తిరుమ‌ల ప‌విత్ర‌త మంట‌గ‌ల‌సిపోతుంటే  స‌నాత‌న ధ‌ర్మాన్ని కాపాడ‌తాన‌ని బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా చెప్ప‌కునే ప‌వ‌న్ కళ్యాణ్ ఎక్క‌డికి పోయాడు. తిరుమ‌ల మెట్లు ఎందుకు క‌డ‌గ‌డం లేదు? ఆడ‌బిడ్డ‌కు అన్యాయం జ‌రిగితే అక్క‌డ నేనున్నాన‌ని చెప్పిన ఈ పెద్ద మ‌నిషి రాజ‌మండ్రి బొల్లినేని కిమ్స్ ఆస్ప‌త్రిలో అచేత‌నంగా ప‌డి ఉన్న అంజ‌లిక న్యాయం చేయ‌డానికి ఎందుకు ముందుకు రావ‌డం లేదు. అసెంబ్లీలో వెకిలి డ్రామాల‌కు ప‌డిప‌డి న‌వ్వ‌డానికి తీరిక ఒపిక ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి, బాధితుల‌కు న్యాయం చేయ‌డానికి లేదా? బీజేపీకి భ‌య‌ప‌డే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇఫ్తార్ విందుకి కూడా వెళ్ల‌లేదు. ఇలాంటి వ్య‌క్తి వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకి వ్య‌తిరేకంగా ఓటేస్తాడ‌ని నేను అనుకోవ‌డం లేదు. 

ఆడుదాం ఆంధ్రలో అవినీతి జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌భుత్వ‌మే చెప్పింది

ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తుంటే ఓర్వ‌లేక‌పోతున్నారు. అక్ర‌మ కేసులు బ‌నాయించి ప్ర‌శ్నించే గొంతుల‌ను నొక్కాల‌ని చూస్తున్నారు.  వీళ్లంద‌రికీ రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లే బుద్ధి చెబుతారు. వెకిలి న‌వ్వులు న‌వ్వే వారంతా రాబోయే రోజుల్లో అనుభ‌విస్తారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి నిధుల‌న్నీ అన్ని జిల్లాల‌కు క‌లెక్ట‌ర్ల ద్వారా ఖ‌ర్చు చేయ‌డం జ‌రిగింది. దీనికి మంత్రిగా నాకు కానీ, శాప్ చైర్మ‌న్ అయిన సిద్ధార్థ రెడ్డికి కానీ సంబంధం లేదు. ఇందులో ఏవైనా అవ‌క‌త‌వ‌కలు జ‌రిగాయా అని అసెంబ్లీలో అడిగితే లేద‌ని, ఏమైనా చర్య‌లు తీసుకుంటారా అని అడిగితే ప్ర‌సక్తే లేద‌ని వారే స‌మాధానం ఇచ్చారు. అవినీతి జ‌ర‌గ‌లేద‌ని వారే స‌మాధానం ఇచ్చి టీవీల్లో మాత్రం ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ లో గ‌ట్టిగా మాట్లాడే  వారిని అరెస్ట్ చేసి సంబ‌ర‌ప‌డానేది వారి ఆశ‌.
 

Back to Top