రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది

దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం

సర్కార్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో వరుస ఘటనలు

విశాఖలో ప్రేమోన్మాది దాడి ఘటనకూ ఇదే కారణం

ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని తక్షణం అరెస్ట్ చేయాలి

చట్టాలను కఠినంగా అమలు చేయకపోవడం వల్లే అరాచకాలు

మహిళలకు భద్రతనిచ్చే దిశాచట్టాన్ని నిర్వీర్యం చేశారు

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి

తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రేమోన్మాది తల్లీకూతుళ్ళపై దారుణంగా దాడి చేసిన ఘటనపై ప్రభుత్వ సీరియస్‌గా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ దాడికి కారకుడైన వ్యక్తిని పట్టుకుని, కఠినంగా శిక్షించాలని కోరారు. మహిళలకు భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ఇంకా ఆమె ఏమన్నారంటే...

ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి నెలకొంది. రోజుకు మహిళలపై దాడులకు సంబంధించి దాదాపు 70 ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గంటకు మూడు, నాలుగు ఘటనలు నమోదవుతున్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇంకా ప్రభుత్వం దృష్టికి రాని ఘటనలు ఎన్నో. ప్రభుత్వ ఉదాసీనత, మహిళలపై దాడులకు పాల్పడితే కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందనే భయం లేకపోవడం వల్లే  ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో ఒక ప్రేమోన్మాది తల్లీకూతుళ్ళపై అతి దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి చనిపోగా, యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తల్లీకూళుళ్ళపై దాడి చేసిన దుండగుడిని వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలి. గతంలో నీరబ్‌శర్మ అనే వ్యక్తి  పెదగంట్యాడలో ఒక యువతిపై దాడిచేసి పారిపోతే ఈ రోజుకు అతడిని పట్టుకోలేకపోయారు. సాక్షాత్తు హోంమంత్రి నివాసం ఉంటున్న జిల్లాలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నా పోలీసులు చిత్తశుద్దితో స్పందించడం లేదు. పోలీసుల ఉదాసీనతను చూసి అలుసుగా తీసుకుని దుండుగులు రెచ్చిపోతున్నారు. హొమంత్రి నివాసం ఉంటున్న జిల్లాలోనే ఇప్పటి వరకు 22 పోక్సో కేసులు నమోదయ్యాయి. మైనర్ బాలికపలైన వేధింపులు జరుగుతున్నాయంటే అంతకన్నా దురదృష్టకరం ఉందా. 

రాజమండ్రి నాగాంజలి కేసులో నిందితులకు ప్రభుత్వ అండ

రాజమండ్రిలో నాగాంజలి తల్లిదండ్రులు వైయస్ జగన్‌గారిని కలిశారు. వారికి ధైర్యం చెప్పడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామని వైయస్ జగన్ భరోసా ఇచ్చారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు. ఈ ఘటన జరిగి పదిరోజులు అవుతున్నా సీఎం, హోంమంత్రి ఆ సంఘటన జరిగిన దగ్గరకు వెళ్ళి, బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు, ధైర్యం చెప్పలేదు. చివరికి సీసీ ఫుటేజీ ఇవ్వాలని అంజలి తల్లిదండ్రులు కోరినా పోలీసులు దానిగురించి పట్టించుకోలేదు. మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీసుల ఉదాసీనత అర్థమవుతోంది. ఆసుపత్రి యాజమాన్యాన్ని, నిందితుడు దీపక్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రచారం కోసమే శక్తియాప్

దిశయాప్‌ను శక్తియాప్ అంటూ పేరు మార్చి తీసుకువచ్చారు. శక్తీ టీంలు పనిచేస్తున్నాయని హోంమంత్రి చెబుతున్నారు. అలాంటప్పుడు ఇటువంటి దారుణాలు ఎలా జరుగుతున్నాయి? నిందితులకు ఎవరు అండగా నిలుస్తున్నారు? బాధితులకు సహాయ సహకారాలు అందడం లేదు. ఈరోజు రాష్ట్రంలో ఆడపిల్లలకు ఇంట్లోనూ, బయటకు వెళ్ళినా, స్కూల్‌కు వెళ్ళినా రక్షణ లేదు. రాంబిల్లిలో ప్రేమ పేరుతో ఒకవ్యక్తి వేధిస్తున్నాడని చెప్పినా పోలీసుల నిర్లక్ష్యం వల్ల అదే నిందితుడి చేతుల్లో ఆమె హత్యకు గురైంది. అలాగే ఏటికొప్పాకలో కూడా నాలుగేళ్ళ బాలికపై అత్యాచారం జరిగింది. వైయస్ఆర్‌సీపీగా మేం వెళ్లి ఆ రెండు కుటుంబాలకు ధైర్యం చెప్పాం. ముచ్చుమర్రిలో బాలికపై అత్యాచారంకు పాల్పడి, ఆమెను హతమార్చి శరీరాన్ని ముక్కలుగా నరికి పారేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగంలో రాజకీయ కక్షలకే పోలీస్ యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారు. శాంతిభద్రతలను గాలికివదిలేశారు. ఇక మహిళల విషయానికి వస్తే ఫిర్యాదు చేసినా సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు. వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. ఇటువంటి అంశాలపై హోంమంత్రి ఒక్క సమీక్ష కూడా చేయలేదు.
 

Back to Top