అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి అన్ని విధాలుగా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి పాలన అవినీతి అక్రమాలు దౌర్జన్యాలను శ్రీకాంత్ రెడ్డి ఎండగట్టారు. వైయస్ జగన్ ఐదేళ్లలో పెద్దగా కరవు ఛాయలు కనపడలేదన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మొదటి ఏడాదిలోనే దారుణమైన కరవు పరిస్థితులు దాపురించాయన్నారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిగా ఉన్న నీటితోనే పెట్టిన పంటలు చేతికి రావడం లేదన్నారు. వచ్చిన పంటలను అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. టమోటో పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు. రైతుల జీవితాలు కష్టతరంగా మారాయన్నారు. భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల బోర్లు ఎండుతున్నాయని అన్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో తీవ్ర త్రాగునీటి ఎద్దడి నెలకొందన్నారు. మామిడి తోటలు నిట్ట నిలువునా ఎండుతున్నాయన్నారు. వేల రూపాయలు పెట్టి ట్యాంకర్ల ద్వారా మామిడి చెట్లుకు నీళ్లు నింపుకోలేని పరిస్థితులు వున్నాయన్నారు. నీళ్లు తోలుకునేందుకు కేంద్ర ప్రభుత్వ ఎన్ ఆర్ ఈ జి ఎస్ పథకం ద్వారా బిల్లులు పొందవచ్చునని, వారాంతానికి బిల్లులు చెల్లించాలని, బిల్లులను రైతులకు అడ్వాన్స్ గా ఇచ్చినా ఇంకా మంచిదేనని ఆయన సూచించారు. మామిడి రైతులపై ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచనలు చేయాలని కోరారు. రైతులకు ఉచిత బోర్లు వేస్తామని కూటమి పెద్దలు చెప్పారన్నారు. గత ప్రభుత్వంలో ఉచిత బోర్లు వేసి వాటికి విద్యుత్ సర్వీసులను కూడా మంచి సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం 51 కరవు మండలాలను ప్రకటించిందన్నారు. ప్రక్కనే ఉన్న వైయస్ఆర్ జిల్లాలో స్వల్ప కరవు, తీవ్రకరవు ఉన్న మండలాలను ప్రకటించారన్నారు. అన్నమయ్య జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించక పోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాయచోటి నియోజక వర్గంలో 6 మండలాల్లోనూ తీవ్ర కరవు పరిస్థితులు ప్రభుత్వానికి కనపడలేదా అని ప్రశ్నించారు. గతంలో వర్షపాత నివేదికల మూలంగా రాయచోటి నియోజక వర్గంలోని సంబేపల్లె మండలం కరవు మండలాల జాబితాలో రాలేదని, కరవు మండలంగా చేర్చాలని తాము పలుమార్లు ప్రభుత్వాన్ని కోరామని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో కొందరు రాద్దాంతం చేశారన్నారు. ఇప్పుడు ఇక్కడ కరవు లేదు అనుకుంటున్నారా? రైతులు సుఖంగాఉన్నారనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మామిడి చెట్ల పరిస్థితి దారుణంగా ఉంది.. ప్రతి బోరు ఎండిపోయే పరిస్థితులుదాపురించాయన్నారు. రైతులు బంగారాన్ని తాకట్టు పెట్టి బోర్లు వేస్తున్నారు. రైతులు ఇంత దయనీయమైన పరిస్థితులతో ఇబ్బందులు, కష్టాలు పడుతుంటే ఈ ప్రభుత్వానికి జాలి కలగదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కరవు మండలాలుగా ప్రకటించడంలోనే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే రేపు ఇన్స్యూరెన్స్ లు ఏవిధంగా ఇస్తారు? ఏ విధంగా పంటల పరిహారం అందచేస్తారు? అని ఆయన నిలదీశారు. ఆ రోజు రైతులకు భారం లేకుండా జగన్ ప్రభుత్వమే ఇన్స్యూరెన్స్ కు ప్రీమియాన్ని చెల్లించిందన్నారు.ఇన్స్యూరెన్స్ వచ్చేలా చేస్తే మేము ఇంకా బాగా చేస్తామని ఇప్పటి ప్రభుత్వ పెద్దలు హేళనగా మాట్లాడారన్నారు. ఈ ఏడాదికి రైతు భరోసా ఒక్క రూపాయి చెల్లించక పోతిరి? ఏ రకమైన ఇన్స్యూరెన్స్ లకు ప్రీమియం లు కట్టాకపోతిరి? ఇన్స్యూరెన్స్ లు.. ఇన్ పుట్ సబ్సిడీల మాటే లేదు.. కరవు మండలాల ప్రకటన ప్రసక్తే లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు. అన్నమయ్య జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని, రాయచోటి నియోజక వర్గంలోని 6 మండలాలను తీవ్ర కరవు మండలాలుగా గుర్తించి రైతులను ఆదుకోవాలని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు.